తండ్రిని మించిన విజేతగా…


ఒంటరిగా పోటీ చేయాలి.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి….. తొలి నుంచి వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి విధానం ఇదే. నవ్యాంధ్రలో జరిగిన తొలి ఎన్నికల్లోనూ.. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలో దిగటం వెనక లక్ష్యం ఇదే! 2014లో కచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో ఉన్న జగన్‌.. ఎన్నికలు సమీపించాక పరిస్థితులు మారుతున్నా వ్యూహాలు మార్చుకునేందుకు ఆసక్తి చూపలేదు. ఆ ఎన్నికల్లో 67 స్థానాలకే పార్టీ పరిమితం కావడంతో ఈ ఐదేళ్లలో అనేక దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. నాటి ఓటమికి కారణాలను విశ్లేషించుకుని, వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులపై శ్రద్ధ పెడుతూ.. పార్టీలో మార్పులు చేసుకుంటూ వచ్చారు. వ్యూహాత్మక ప్రణాళికలతో, సకల అస్త్రశస్త్రాలతో 2019 ఎన్నికల బరిలోకి దిగి గతంలో తన తండ్రి రాజశేఖరరెడ్డిని మించిన మెజారిటీ విజయం నమోదు చేశారు.

 

తండ్రి అడుగు జాడల్లో 2009లో జగన్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు. ఆ ఏడాదే వైఎస్‌ మృతి చెందడంతో రాజకీయంగా అనుకోని ఇబ్బందులను ఎదుర్కొన్నారు. జగన్‌ని ముఖ్యమంత్రిని చేయాలని అప్పట్లో సంతకాల సేకరణ

 

జరగడం.. పలువురు ఎమ్మెల్యేలు, నేతలు ఆయనకు మద్దతుగా నిలవడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయం కొన్ని నెలలపాటు జగన్‌ చుట్టూనే నడిచింది. తన తండ్రి అకాల మృతిని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్‌ చేపట్టిన ఓదార్పు యాత్రకు మంచి స్పందన రావడంతో రాజకీయంగా మళ్లీ ఆయన చర్చల్లో నిలిచారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం అనూహ్యంగా 2010 నవంబరు 25న రోశయ్యను తొలగించి కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. అదే సమయంలో జగన్‌ ఓదార్పు యాత్రకు అభ్యంతరం తెలిపింది. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో కిరణ్‌ సీఎంగా నియమితులైన నాలుగు రోజులకే 2011 అక్టోబరు 29న జగన్‌ కాంగ్రెస్‌ పార్టీకి, ఆ పార్టీ ద్వారా గెలిచిన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తర్వాత ఓదార్పు యాత్రను కొనసాగిస్తూ.. 2011 మార్చిలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ-వైకాపా) ప్రారంభించారు.

ప్రతి అక్కకు.. ప్రతి చెల్లెమ్మకు..ప్రతి అవ్వకూ..
ప్రతి తాతకూ.. ప్రతి సోదరుడికీ.. ప్రతి స్నేహితుడికీ.. మీ అందరి ఆప్యాయతలకు రెండు చేతులు జోడించి, శిరసు వంచి, పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా.. అంటూ ప్రసంగాలు ప్రారంభించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

సమగ్ర అధ్యయనం
ప్రజా సమస్యలు, రాష్ట్రంలో ప్రధాన అంశాలపై ఆయా రంగాల నిపుణులతో చర్చించి, సమగ్రంగా అధ్యయనం చేస్తుంటారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు, ప్రత్యేక హోదా అంశాలపై పట్టు పెంచుకుని అసెంబ్లీలోనూ, బయటా పలు సందర్భాల్లో ప్రసగించారు. యువభేరీ సదస్సులతో ప్రత్యేక హోదాపై యువతకూ అవగాహన కల్పించారు.

సాదాసీదా ఆహార్యం

చూడడానికి సాదాసీదాగా ఉంటారు. జనంలోకి వచ్చినప్పుడు పూర్తి తెలుపు రంగు చొక్కా ధరిస్తారు. ‘అన్నా, వాట్‌ సర్‌’.. ఇవి రెండూ ఊతపదాలు. కలిసిన వాళ్లు చిన్నవాళ్లయితే పేరుతోనూ, పెద్దవాళ్లయితే ‘అన్నా’ అని పిలవటం అలవాటు.
వ్యాయామంతో దినచర్య ప్రారంభం

ఉదయం 4:30 గంటలకే జిమ్‌లో వ్యాయామంతో దినచర్య ఆరంభం. తర్వాత పత్రికలు చూస్తారు.
9-9:30 నుంచి పార్టీ కార్యాలయంలో సందర్శకులు, పార్టీ నేతలను కలుస్తుంటారు.
మొండిగా ముందుకు

* ఎదుటి వారితో (ముఖ్యంగా కొత్తవారితో) ఎక్కువ సేపు మాట్లాడరంటారు
* ప్రత్యర్థుల విమర్శలపై సకాలంలో స్పందించరు.
* మొండిగా ముందుకు వెళతారనీ, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పంథా మార్చుకోరనీ ప్రతీతి.

బ్లాక్‌ టీ..

మితాహారి. బ్లాక్‌ టీ ఎక్కువగా తీసుకుంటారు. ఉదయం పండ్ల రసంతోనే అల్పాహారం ముగించేస్తుంటారు. మధ్యాహ్నం ఒకటి రెండు పుల్కాలతో భోజనం పూర్తి. పెరుగు ఇష్టంగా తింటారు.
ఆదివారం కుటుంబానికే

ఆదివారం కుటుంబ సభ్యులతో గడిపేందుకే ఇష్టపడతారు. అత్యవసరమైతే తప్ప ఆ రోజు ఎవరినీ కలవరు, కార్యక్రమాలూ పెట్టుకోరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *