కోహ్లీని చూసి నేర్చుకోండి ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌కు కోచ్‌ సలహా

నాటింగ్‌హామ్‌: భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీని చూసి ఎంతో నేర్చుకోవాలని తమ జట్టు ఆటగాళ్లకు సలహా ఇచ్చాడు ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ పాల్‌ ఫార్‌బ్రేస్‌. ఇంగ్లాండ్‌ పర్యటన ప్రారంభమైనప్పటి నుంచి అందరి దృష్టి కోహ్లీ పైనే. ఎందుకంటే గత ఇంగ్లాండ్‌ పర్యటనలో అతడు పూర్తిగా విఫలమయ్యాడు. అయితే ప్రస్తుత టెస్టు సిరీస్‌లో కోహ్లి ఇప్పటికే నాలుగు వందలకు పైగా పరుగులు సాధించి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.

ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా జరుగుతోన్న మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ విజయం సాధించాలంటే ఇంకా 498 పరుగులు చేయాలి. రెండు టెస్టుల్లో ఓటమి, ఒత్తడిని అధిగమించి మెరుగైన ప్రదర్శన చేస్తోన్న కోహ్లీపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ అసిస్టెంట్‌ కోచ్‌ పాల్‌ మాట్లాడుతూ…‘ఆటగాళ్లు ఇతర ఆటగాళ్లను చూసి ఎంతో కొంత నేర్చుకుంటారని నేను బలంగా నమ్ముతా. బంతి వచ్చినప్పుడు కోహ్లీ ఎలా స్పందిస్తున్నాడు, ఎలా ఎదుర్కొంటున్నాడు అన్నది మనం చూసి నేర్చుకోవల్సిన అవసరం ఉంది. గొప్ప ఆటగాళ్ల నుంచి చూసి చాలా నేర్చుకోవచ్చు. వారి ఆటను గమనించి అలా ఆడేలా ప్రయత్నించడంలో ఎలాంటి తప్పు లేదు. ఇంగ్లాండ్‌ టాప్‌ బ్యాట్స్‌మెన్‌కు కోహ్లీని చూసి నేర్చుకోమని సలహా ఇస్తున్నాను. ఎందుకంటే అతడు ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్‌మెన్‌. ఈ సిరీస్‌లో అతడి ఆటతీరు అద్భుతం. ఇలా ఆడే ఆటగాళ్లంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటి ఇంగ్లాండ్‌ పర్యటనలో కోహ్లీ చాలా నేర్చుకున్నాడు’ అని పాల్‌ అన్నాడు.

‘ఇప్పటి వరకు ఈ సిరీస్‌లో సుమారు 15 క్యాచ్‌లు వదిలేశాం. ఫీల్డింగ్‌ మెరుగుపరుచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇందు కోసం మా ఫీల్డింగ్‌ కోచ్‌ ఎంతో శ్రమిస్తున్నారు. ప్రాక్టీస్‌లో రెండు రోజులు పూర్తిగా ఫీల్డింగ్‌కు కేటాయించాం. అయినప్పటికీ మూడో టెస్టులో మా ఫీల్డింగ్‌ ఆశించిన స్థాయిలో లేదు’ అని అసంతృప్తి వ్యక్తం చేశాడు పాల్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *