టాప్‌ 10 న్యూస్‌ – 5PM

 

1. అక్కడే ఉండి కేసీఆర్‌కు ఊడిగం చేయండి: బాబు

అధికారులపై ఎన్నికల సంఘానికి అవినీతి పార్టీ ఫిర్యాదు చేస్తే విచారణ కూడా లేకుండా వారిని బదిలీ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్షేపించారు. చివరికి ఎన్నికల పరిధిలో లేని అధికారులను సైతం బదిలీ చేశారని అన్నారు. ఇది అత్యంత దుర్మార్గమని అభివర్ణించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చంద్రబాబు రోడ్‌ షో నిర్వహించారు. ‘‘వివేకానంద రెడ్డిని సొంత ఇంట్లోనే దారుణంగా చంపిన విషయం తెలిసిందే. ఆ కేసును విచారణ జరుపుతున్న కడప ఎస్పీని సైతం బదిలీ చేశారు. జగన్‌కు మన పోలీసులపై నమ్మకం లేదు. తెలంగాణ పోలీసులపైనే ఉంది. అలాంటప్పుడు లోటస్‌పాండ్‌లోనే ఉండాలి. అక్కడే ఉండి కేసీఆర్‌కు ఊడిగం చేయాలి’’ అని చంద్రబాబు అన్నారు.

2. మన 16కు మరో 150 సీట్లు తోడవుతాయి: కేటీఆర్‌

‘‘తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ ఎంపీలు గెలిస్తే రాహుల్‌కు లాభం. భాజపా వాళ్లు విజయం సాధిస్తే మోదీకి లాభం. అదే తెరాస అభ్యర్థులు గెలిస్తే తెలంగాణ గడ్డకు మంచి జరుగుతుంది’’ అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లలో తెరాస అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. దేశవ్యాప్తంగా మరో 150 సీట్లు తోడవుతాయని చెప్పారు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో బుధవారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఎంపీ అభ్యర్థి వినోద్‌తో కలిసి కేటీఆర్‌ పాల్గొన్నారు.

3. ఏపీ పోలీస్‌శాఖపై కీలక జీవో విడుదల

సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో డీజీపీ సహా ఎన్నికలతో సంబంధం ఉన్న పోలీస్ యంత్రాంగం మొత్తాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీవో నంబర్‌ 721ను విడుదల చేసింది.

4. వైకాపా చెప్పినట్లు ఈసీ చేస్తోంది: తెదేపా

వైకాపా చెప్పినట్లే ఈసీ నడుచుకుంటోందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఈ మేరకు వైకాపా ఈసీకిచ్చిన ఫిర్యాదు కాపీని, బదిలీలకు సంబంధించిన ఈసీ ఆదేశాల కాపీని తెదేపా బుధవారం మీడియాకు విడుదల చేసింది. ఈ నెల 25వ తేదీన ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే.. 26న ఈసీ చర్యలు ప్రారంభించిందని పేర్కొంది. డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావులను బదిలీ చేయాలని వైకాపా సూచించిందని తెలిపింది.

5. దేశరక్షణ అంశాలకు ఎన్నికల కోడ్‌ వర్తించదు

దేశ రక్షణకు సంబంధించిన ప్రకటనలపై ఎలాంటి ఎన్నికల కోడ్‌ ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు బుధవారం వెల్లడించాయి. మిషన్‌ శక్తి ఆపరేషన్‌ గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో మోదీ ఈ ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మోదీ ప్రసంగం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిందా అంటూ పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ స్పష్టతనిచ్చింది.

6. ఐటీ గ్రిడ్స్‌ కేసులో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం సృష్టించిన ఐటీ గ్రిడ్స్‌ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం, ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి సహా ఆధార్‌ సంస్థ కేంద్ర సీఈవో, ఆధార్‌ ఏపీ రిజిస్ట్రార్‌కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఐటీ గ్రిడ్స్‌ సీఈవో అశోక్‌ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. వాళ్ల పరిధి కానప్పటికీ తెలంగాణ పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని పిటిషన్‌లో ఆయన ఆరోపించారు.

7. ఉపముఖ్యమంత్రిని తొలగించిన గోవా సీఎం

గోవా రాజకీయం మరోసారి వేడెక్కింది. భాజపా నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ(ఎమ్‌జీపీ)కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు భాజపాలో చేరుతున్నట్లు బుధవారం వేకువజామున ప్రకటించారు. దీంతో అక్కడ భాజపా బలం 14కు చేరింది. ఎమ్‌జీపీకి చెందిన మనోహర్‌ అజ్‌గావ్‌కర్‌, దీపక్‌ పుష్కర్‌లు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఎమ్‌జీపీ పార్టీ..భాజపాలో విలీనం అయినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మరో ఎమ్‌జీపీ నేత, ఉప ముఖ్యమంత్రి సుధిన్‌ ధావలికర్‌ మాత్రం ఎమ్‌జీపీలోనే కొనసాగుతున్నారు. దీంతో ఆయన్ని కేబినేట్‌ నుంచి తొలగిస్తున్నట్లు సీఎం ప్రమోద్‌ బుధవారం ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన గవర్నర్‌ మృదులా సిన్హాకు తెలియజేశారు.

8. తిరిగి రావడానికి సిద్ధం: రఘురామ్‌ రాజన్‌

దేశానికి తిరిగి వచ్చి.. తన అవసరం ఉన్న చోట పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్థానంలో సంతోషంగా ఉన్నప్పటికీ తన అవసరం ఉన్నచోట పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తానని వ్యాఖ్యానించారు. ఓ పుస్తకావిష్కరణ సభలో ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

9. భారత్‌లో ఎన్నికలు ముగిసేవరకు ఉద్రిక్తతలే:ఇమ్రాన్‌

భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉంటాయని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ వ్యాఖ్యానించారు. ‘ప్రమాదం ఇంకా పొంచి ఉంది. భారత్‌లో ఎన్నికలు ముగిసే వరకు ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉంటాయి. భారత్ నుంచి ఎదురయ్యే ఆక్రమణలకు గట్టి సమాధానం ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలను డాన్ పత్రిక ప్రచురించింది.

10. నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్

బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు సాయంత్రానికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 100.53 పాయింట్లు కోల్పోయి 38,133 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 38 పాయింట్లు కోల్పోయి 11,445 వద్ద ముగిసింది. యస్‌ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, ఇండియా బుల్స్‌ హౌసింగ్ ఫైనాన్స్‌ లిమిటెడ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్‌బీఐ షేర్లు లాబాల బాట పట్టగా..హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఎన్‌టీపీసీ, టాటా మెటార్స్‌, భారత్ ఎయిర్ టెల్, ఎయిచర్ మోటార్స్ లిమిటెడ్ షేర్లు నష్టాలను చవిచూశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 68.80వద్ద కొనసాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *