తిత్లీ పెనుతుపాను బీభత్సం చూశారా..

శ్రీకాకుళం: బంగాళాఖాతంలో ఏర్పడిన తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాపై విరుచుకుపడుతోంది. ఈరోజు ఉదయం వజ్రపుకొత్తూరు మండలంలో తుపాను తీరం దాటిన సమయంలో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. దీంతో తీర ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. మినీ కోనసీమగా పిలుచుకునే ఉద్దానం ప్రాంతంలో కొబ్బరిచెట్లు పెనుగాలులకు ఊగిపోతున్నాయి. కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. పెనుగాలుల ధాటికి ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఉద్దానంతో పాటు పలాస, టెక్కలి, ప్రాంతాల్లో తుపాను బీభత్స దృశ్యాలు చూస్తుంటే వణుకుపడుతోంది. భారీ శబ్దాలతో పెనుగాలులు సృష్టిస్తున్న విధ్వంసం ఈ వీడియోలో చూడొచ్చు.

శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్ర తనయ నదులకు వరద తాకిడి పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో అధికారులు తీర ప్రాంతాలను అప్రమత్తం చేశారు. సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు.. భావనపాడు, ఉమిలాడ, సున్నాపల్లి తదితర తీర గ్రామాల్లో ఈదురు గాలులతో జోరుగా వర్షం కురుస్తోంది. సంతబొమ్మాళి మండలం మరువాడలో సముద్ర తీరంలో అలల ఉద్ధృతికి పది అడుగుల మేర కోతకు గురైంది. తుపాను బీభత్సానికి శ్రీకాకుళం.. ఇచ్ఛాపురం, కవిటి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, లావేరు, రణస్థలం, పాతపట్నం, నరసన్నపేట, పోలాకి, గార, ఎచ్చెర్ల ప్రాంతాల్లోని తీర వాసులు గజగజలాడిపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *