‘తిత్లీ’ ప్రభావంపై చంద్రబాబు సమీక్ష….

నష్టతీవ్రత, పునరావాస ఏర్పాట్లపై ఆదేశాలు
నేడు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లనున్న సీఎం

విజయవాడ: శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను‌‌ ప్రభావంపై గత అర్థరాత్రి నుంచి సీఎం చంద్రబాబు తన నివాసం నుంచే అధికారులతో నిరంతర సమీక్ష కొనసాగిస్తున్నారు. ఈ రోజు ఉదయం 15వ ఆర్థిక సంఘం సమావేశం అనంతరం సీఎం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.రాత్రికి అక్కడే బస చేసి పునరావాస చర్యలపై సమీక్షించనున్నారు. విశాఖ వరకు విమానంలో వెళ్లి అక్కడ నుంచి హెలికాప్టర్‌లో ప్రయాణం సహకరించకపోతే రోడ్డు మార్గం ద్వారా సీఎం శ్రీకాకుళానికి చేరేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్టీజీ, ఇస్రో అధికారులతో తుఫాన్‌ కదలికలపై సమాచార సేకరణ చేస్తున్నారు. ఏయే ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోందో ఎప్పటికప్పడు స్థానిక అధికారుల ద్వారా తన నివాసం నుంచే సీఎం సమాచారాన్ని రాబట్టుకుంటున్నారు.

గురువారం ఉదయం 5.40గంటల సమయంలో తీరాన్ని దాటిన వాయుగుండం పలాస పురపాలికలో తీవ్ర నష్టం కలిగించినట్లు సీఎం తెలిపారు. మరికొన్ని గంటల పాటు ఈదురుగాలులు, భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోపాలపురం పోర్టు వద్ద జరిగిన నష్టాన్ని గురించి స్థానిక మత్స్యకారులు సమాచారం అందించారు. తుపాన్‌ తెరిపి ఇచ్చిన వెంటనే పునరావాస చర్యలను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నష్ట తీవ్రతను అంచనా వేసి ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోల ద్వారా సమాచారం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేల కూలిన చెట్లు, పడిపోయిన విద్యుత్తు స్తంభాలకు జియోట్యాగింగ్‌ చేయాలని సూచించారు. బాధితులకు సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. భోజనం, అల్పాహారం, తాగునీరు అందరికీ అందేలా చూడాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *