జగన్‌కు ఎందుకు జై కొట్టారంటే..!

  ప్రత్యేకం: ఏపీ ప్రజలు మార్పునకు ఓటేశారు. వైకాపాకూ ఒక్క అవకాశం ఇస్తామంటూ విస్పష్ట తీర్పు ఇచ్చారు. ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉందని.. అదే తమను గెలిపిస్తుందని ఆ పార్టీ నేతలు చెప్పిన మాటలే నిజమయ్యాయి. త్రిముఖ పోరు జరిగిన ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వైకాపా సఫలీకృతమైంది. తెదేపా వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు వైకాపా శ్రేణులు పూర్తి స్థాయిలో కృషి చేశాయి. ఈసారి పార్టీ ఓడితే జీవన్మరణ సమస్యగా పరిణమిస్తుందంటూ వైకాపా నేతలు అంతర్గతంగా చేసిన సూచనలు కూడా ఎన్నికల్లో కార్యకర్తలు పట్టుదలగా పనిచేసేందుకు దోహదం చేశాయి. వీటితో పాటు పార్టీ అధినేత జగన్‌ ఇచ్చిన హామీలు ప్రజల్లోకి బలంగా చొచ్చుకెళ్లాయి. కొన్ని ప్రధాన అంశాల్లో తెదేపా వైఖరి.. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారంటూ చేసిన ప్రచారం వైకాపాకు మంచి మైలేజ్‌ను తీసుకొచ్చింది. అవే జగన్‌ పార్టీ విజయానికి కారణమయ్యాయి.

కలిసొచ్చిన పాదయాత్ర


ఈ ఎన్నికల్లో వైకాపా విజయంలో కీలక పాత్ర పోషించిన అంశం పాదయాత్ర. 2004 ఎన్నికలకు ముందు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, 2014 ముందు చంద్రబాబు పాదయాత్ర చేసే అధికారంలోకి వచ్చారు. ఇదే సెంటిమెంట్‌ జగన్‌కూ కలిసి వచ్చింది. ఆయన్ను జనానికి మరింత దగ్గర చేసింది. కడప జిల్లా ఇడుపులపాయలో ‘ప్రజా సంకల్పయాత్ర’ పేరిట ప్రారంభమైన పాదయాత్ర.. 13 జిల్లాల్లో 341 రోజుల పాటు 3,648 కి.మీ కొనసాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. ఈ యాత్ర దారి పొడవునా ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోవడంతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన ముందుకు సాగారు. అధికారంలోకి వస్తే ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తాననే విషయాలపై అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చారు. పాదయాత్రలో ఎక్కువగా వృద్ధులు, మహిళలు, యువతతో జగన్‌ మమేకమయ్యారు. యువత కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందర్నీ ఆప్యాయంగా పలకరించడం, బాధతో తన దగ్గరికి వచ్చిన వారిని అక్కున చేర్చుకుని ఓదార్చడం వంటి అంశాలు జగన్‌ను జనానికి దగ్గర చేశాయి. అవే తాజా ఎన్నికల్లో విజయానికి దోహదపడ్డాయి. ఈ పాదయాత్ర ఆయా జిల్లాల్లోని వైకాపా కార్యకర్తలకు ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎన్నికలకు సుమారు ఏడాదికి ముందే చేపట్టిన ఈ పాదయాత్ర ఎన్నికల ప్రచారంగానూ ఉపయోగపడింది.

నాంది పలికిన ‘నవరత్నాలు’

వైకాపా గెలుపునకు ప్రధానంగా దోహదపడిన అంశాలేమైనా ఉన్నాయంటే.. కచ్చితంగా చెప్పుకోవాల్సింది ఆ పార్టీ ప్రకటించిన ‘నవరత్నాలు’. ప్రజా సంక్షేమానికి సంబంధించిన తొమ్మిది ప్రధానాంశాలతో వైకాపా వీటిని రూపొందించింది. వైఎస్సార్‌ రైతుభరోసా, ఆరోగ్యశ్రీ, యువత-ఉపాధి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, అమ్మ ఒడి, పింఛన్ల పెంపు, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ గృహనిర్మాణం, బీసీ సంక్షేమం అంశాలను నవరత్నాల్లో పొందుపరిచారు. ముఖ్యంగా పింఛన్ల పెంపు, వైద్య ఖర్చులు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు, అమ్మ ఒడి కింద బడికి పిల్లల్ని పంపితే తల్లిదండ్రులకు రూ.15వేల ప్రోత్సాహకం.. ఇలా చాలా కీలక అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. ఎన్నికలకు ఏడాది ముందే నవరత్నాలను ప్రకటించడం ద్వారా అవి ప్రజల్లోకి బలంగా చొచ్చుకెళ్లేందుకు అవకాశం కలిగింది. తాము ప్రకటించిన నవరత్నాల్లో కొన్నింటిని తెదేపా కాపీ కొట్టిందనే ప్రచారమూ వైకాపాకు కలిసొచ్చింది. ముఖ్యంగా పింఛన్ల పెంపు, వారి అర్హత వయసు తగ్గింపు తదితర అంశాలు తమ నుంచే కాపీ కొట్టారంటూ జగన్‌తో పాటు వైకాపా నేతలంతా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.

‘హోదా’పై ఒకే వైఖరి

రాష్ట్ర విభజన నాటి నుంచి వైకాపా ఒకే మాటపై నిలబడింది. ఏపీకి కచ్చితంగా ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ పోరాటాలు చేసింది. పార్లమెంట్‌ లోపలా, వెలుపలా ఆ పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన తెలిపారు. ఇటు రాష్ట్రంలోనూ అదే పోరాటాన్ని కొనసాగించారు. జిల్లాల వారీగా సభలు నిర్వహిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. తెదేపా ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నా ‘హోదా’ సాధించలేకపోయిందనీ.. తెదేపా నేత చంద్రబాబు ప్యాకేజీకి అంగీకరించడం పొరపాటంటూ జగన్‌ విస్త్రృతంగా ప్రచారం చేశారు. ఈ అంశంలో తెదేపాను ఇరుకున పెట్టే ప్రయత్నం చేయడంతో.. మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా చంద్రబాబు కూడా ప్రత్యేక హోదాపై తన వైఖరిని మార్చుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం తెదేపాకు జరిగిపోయింది. తొలి నుంచీ ఒకే మాటపై నిలబడి, పట్టుబట్టి ఉంటే ‘హోదా’ రాకపోయేదా? అంటూ ప్రజలు కూడా చర్చించుకునే పరిస్థితి కనిపించింది. ఈ విషయంలో మొదటి నుంచీ ఒకే వైఖరితో ఉండటంతో పరిస్థితులన్నీ వైకాపాకు అనుకూలంగా మారాయి.

ప్రభుత్వ వ్యతిరేకత..

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండటం సహజం. తెదేపా ప్రభుత్వంపై పలు అంశాల్లో ఉన్న అసంతృప్తిని వైకాపా తమకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధించింది. ఎక్కువగా తెదేపా నేతల ప్రచారార్భాటాలు కూడా ఆ పార్టీని దెబ్బతీశాయి. మరోవైపు తెదేపాకు చెందిన జన్మభూమి కమిటీలపై ఉన్న వ్యతిరేకత కూడా వైకాపాకు బాగా కలిసొచ్చింది. కిందిస్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన ఏ పని చేయించుకోవాలన్నా జన్మభూమి కమిటీ సభ్యులకు ఎంతో కొంత ముట్టజెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందంటూ వైకాపా జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లింది. ఇలాంటి అంశాలు వైకాపా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

పసుపు కుంకుమకు దీటుగా..

 

తక్కువ సమయంలోనే తెదేపాకు ఎక్కువగా ప్రచారం కల్పించిన పథకం పసుపు-కుంకుమ. స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళల ఖాతాలో విడతల వారీగా రూ.20వేలు జమ చేయడం ద్వారా వారికి దగ్గరయ్యేందుకు తెదేపా ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అయితే దానికి దీటుగా వైకాపా కూడా మహిళలను ఆకర్షించే ప్రయత్నాలు చేసింది. ఇంచుమించు ‘పసుపు-కుంకుమ’ తరహాలోనే అధికారంలోకి వస్తే ఏడాదికి రూ.15వేలు చొప్పున ఐదేళ్లలో రూ.75వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. గత ఎన్నికల్లో డ్వాక్రా మహిళల రుణాలను రద్దు చేస్తామన్న హామీని చంద్రబాబు అమలు చేయలేదని వైకాపా బాగా ప్రచారం చేసింది. ఈ నేపథ్యంలోనే మహిళలకు ఏటా రూ.15వేలతో పాటు ఎన్నికల నాటికి ఉన్న రుణాల మొత్తాన్ని మాఫీ చేస్తామని జగన్‌ ప్రకటించారు. తండ్రి రాజశేఖర్‌రెడ్డిలా ఇచ్చిన మాటను జగన్‌ నిలబెట్టుకుంటాడంటూ వైకాపా చేసిన ప్రచారంతో మహిళలు ఆ పార్టీ వైపు నిలిచినట్లు కనిపిస్తోంది.

రైతులను ఆకర్షించిన హామీలు

అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని వైకాపా చేసిన ప్రచారం వారికి మంచి ఫలితాలనిచ్చింది. ఏటా మే నెలలో పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకు రూ.12,500 చొప్పున వారి ఖాతాలో జమ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. నవరత్నాలతో పాటు మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని పొందుపరిచింది. దీని ద్వారా ఐదేళ్లలో ఒక్కో రైతుకు రూ.50వేలు లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. అంతేకాకుండా రైతులకు వడ్డీలేని రుణాలు, ఉచితంగా బోర్లు, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ, రూ.4వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు, 9 గంటల ఉచిత విద్యుత్‌ తదితర అంశాలు రైతులను ఆకర్షించాయి. దీంతో పాటు రైతు ప్రమాదవశాత్తు మరణించినా.. ఆత్మహత్య చేసుకున్నా వైఎస్‌ఆర్‌ భరోసా కింద రూ.5లక్షలు ఆ కుటుంబానికి అందిస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. మృతిచెందిన రైతు కుటుంబాన్ని అప్పుల వాళ్లు ఇబ్బంది పెట్టకుండా అసెంబ్లీలో ప్రత్యేక చట్టం తీసుకొస్తామంటూ జగన్‌ ఇచ్చిన హామీతో రైతులు వైకాపాకు దగ్గరయ్యారు.

తెదేపా నేతలపై ఆకర్షణాస్త్రం

వైకాపా విజయంలో ఆకర్షణాస్త్రం కూడా కీలకంగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత వైకాపాలోకి వలసలు జోరందుకున్నాయి. ముఖ్యంగా తెదేపా నేతలను ఆకర్షించడంలో ఫ్యాన్‌ పార్టీ సక్సెస్ అయింది. వివిధ జిల్లాల్లో సీనియర్లు, సామాజిక వర్గాల వారీగా కీలకపాత్ర పోషిస్తున్న మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోగలిగింది. ఈ క్రమంలోనే అవంతి శ్రీనివాస్‌, తోట నర్సింహం, పి. రవీంద్రబాబు, సినీనటుడు అలీ, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్‌, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, యలమంచిలి రవితో పాటు మరికొంతమంది కీలక నేతలు వైకాపా గూటికి చేరారు. వీరిలో చాలా మందికి అసెంబ్లీ, లోక్‌సభ టికెట్లు దక్కాయి. ఆయా జిల్లాల్లో వారికున్న అనుభవం, తొలి నుంచీ వారి వెంట ఉన్న కేడర్‌ ఈ ఎన్నికల్లో వైకాపా విజయంలో కీలకపాత్ర పోషించాయి.

‘ఒక్క ఛాన్స్‌’ ఇద్దామనే ప్రచారం

‘జగన్‌కు ఒక్క అవకాశమిద్దాం’.. ఈ ప్రచారం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపింది. తండ్రి రాజశేఖర్‌రెడ్డి మృతి.. తర్వాత జరిగిన పరిణామాలతో జగన్‌ కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చారు. ఈ క్రమంలో 2011లో పార్టీ పెట్టిన ఆయన.. 2014 ఎన్నికల్లో విజయం అంచుల వరకు వెళ్లినా దాన్ని అందుకోలేకపోయారు. దీంతో తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఓ దశలో విభజన హామీలే కేంద్రంగా రాష్ట్రంలో రాజకీయాలు సాగాయి. ఓ విధంగా ఇది వైకాపాకు కలిసి వచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలకు పిలుపునిస్తూ ఆ పార్టీ ముందుకు కదిలింది. దీంతో నిరంతరం ప్రజల్లో ఉండేందుకు అవకాశమేర్పడింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌, భాజపాలు అంతంతమాత్రంగానే ఉండటం.. తెదేపాకు ఏకైక ప్రత్యామ్నాయంగా వైకాపా ఉండటంతో ఈసారి జగన్‌కు ఛాన్స్‌ ఇస్తే ఎలా ఉంటుందనే చర్చ నడిచింది. అదే ఆ పార్టీ విజయావకాశాలకు మరింత తోడ్పాటు అందించింది.

కలిసివచ్చిన పీకే వ్యూహాలు

బిహార్‌కు చెందిన ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) ను విశ్వసించడం జగన్‌కు ప్లస్‌ అయింది. ఏయే నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉంది.. ఇన్‌ఛార్జ్‌లను మార్చాల్సిన స్థానాలేవి? తదితర అంశాలతో కూడిన జాబితాపై సర్వే జరిపి ఆ వివరాలను జగన్‌కు పీకే అందించారు. దాని ప్రకారమే చాలా చోట్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లను వైకాపా మార్చేసింది. అంగ, అర్థబలాలతో పాటు సామాజిక సమీకరణాలను కూడా ప్రశాంత్‌ కిశోర్‌ బృందం పరిగణనలోకి తీసుకుని సర్వే చేసింది. ఆయా సర్వేలకు అనుగుణంగానే ఎమ్మెల్యే టికెట్లను జగన్‌ కేటాయించారు. దీంతోపాటు ఒకే విడతలో అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం కూడా వైకాపాకు కలిసొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *