కలిసి నడుద్దాం అంటున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జగన్‌…

పరస్పర చర్చలతో వివాదాలన్నీ పరిష్కరించుకుందాం
ట్రైబ్యునళ్లు, కోర్టుల్లో కేసుల్ని ఉపసంహరిద్దాం
గోదావరి, కృష్ణా వాటాలను పూర్తిగా వినియోగించుకుందాం
ఇరు రాష్ట్రాల మధ్య విమాన సౌకర్యాలు పెంపు
రైళ్లు, హైవేల కోసం కేంద్రంపై ఒత్తిడి తెద్దాం
తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జగన్‌ల అంగీకారం
ఏపీ ఓడరేవుల నుంచి తెలంగాణ సరకుల ఎగుమతికి కేసీఆర్‌ ప్రతిపాదన.. ఏపీ సీఎం సమ్మతి
కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం.. వస్తానన్న జగన్‌

 

నదీ జలాల వాటాలను నూటికి నూరు శాతం వాడుకుంటే రెండు రాష్ట్రాల అవసరాలు కచ్చితంగా తీరుతాయి. సాగునీరు, తాగునీటితో పాటు విద్యుదుత్పాదన పెరుగుతుంది. ఇక ముందు ఇలాంటి కృషి జరగాలి. ట్రైబ్యునళ్లు, న్యాయస్థానాల అవసరం లేకుండా అన్ని సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం. – ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సీఎం కేసీఆర్‌
 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేటాయించిన గోదావరి, కృష్ణా జలాలను సంపూర్ణంగా వాడుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు నిర్ణయించారు. ట్రైబ్యునళ్లు, న్యాయస్థానాల్లో ఉన్న అన్ని కేసులను సత్వరమే ఉపసంహరించుకొని, రెండు రాష్ట్రాలు పరస్పరం చర్చించుకొని, అన్ని వివాదాలను పరిష్కరించుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఏపీలోని ఓడరేవుల ద్వారా తెలంగాణ సరకులను ఎగుమతి చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాల కోసం విమానాల సంఖ్య పెంచాలని భావించారు. ఇరు రాష్ట్రాల మధ్య మరిన్ని రైళ్లు, జాతీయ రహదారుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. రవాణా వసతుల పెంపుదల కోసం కేంద్రానికి ఉమ్మడిగా లేఖ రాయాలని నిర్ణయించారు. సోమవారం ఏపీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌ అమరావతిలో వైఎస్‌ జగన్‌తో దాదాపు రెండు గంటల సేపు సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను చర్చించారు. చర్చల్లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌, మాజీ ఎంపీ వినోద్‌, పార్టీ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, వైకాపా సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి, ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై చర్చ జరిగింది.

మనం కలిసి పనిచేస్తే సత్ఫలితం
జలాల వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాల వెనుకబాటు గురించి కేసీఆర్‌ వివరించారు. ఏ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీల నీరు ఇవ్వాలనే నిర్ణయం జరిగినా కేంద్రం దానిని అమలు చేయకుండా ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకుందని వివరించారు. ట్రైబ్యునళ్లు, న్యాయస్థానాల చుట్టూ తిరిగినా అనేక సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ సరైన ప్రాజెక్టుల నిర్మాణం జరగకపోవడంతో పాటు చెక్‌డ్యామ్‌ల వంటివి లేకపోవడం వంటి వాటి వల్ల వందల టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోంది. ఈనెల 24న గవర్నర్‌ సమక్షంలో ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శుల సమావేశం హైదరాబాద్‌లో ఉంది. ఈ భేటీతో తొలి అడుగు పడుతుందని, ఆ తర్వాత ఇద్దరు సీఎంల సమావేశం జరపాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న సాగునీటి సమస్యలపై తనకున్న అనుభవాన్ని కేసీఆర్‌ జగన్‌తో పంచుకున్నారు. రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే కృష్ణా, గోదావరి నీటిని సమర్థంగా వాడుకోవచ్చని ఇద్దరి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. నీతి ఆయోగ్‌లో సీఎం జగన్‌ ప్రసంగం, ప్రత్యేక హోదాతో పాటు పలు విషయాలపై ఇద్దరు చర్చించినట్టు సమాచారం.

ఓడ రేవులు వాడుకుందాం
ఏపీకి సుదీర్ఘమైన సముద్రతీరం ఉందని, ఓడరేవులు ఉన్నాయని, వీటి ద్వారా ఎగుమతులు సాగుతున్నాయని, వాటిని ముమ్మరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహకరిస్తామని కేసీఆర్‌ చెప్పారు. తమ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు జరిగే ఎగుమతుల కోసం ఏపీలోని ఓడరేవులకు తెలంగాణ నుంచి సరకులను పంపిస్తామని ఆయన చెప్పగా.. అందుకు జగన్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

కేసీఆర్‌కు సాదరస్వాగతం
అమరావతి పరిధిలోని తాడేపల్లిలో తన నివాసానికి విచ్చేసిన కేసీఆర్‌, కేటీఆర్‌ సహా తెరాస ముఖ్య నేతలకు ఏపీ సీఎం జగన్‌ సాదర స్వాగతం పలికారు. ఇంటి బయటికి వచ్చి వారిని తోడ్కోని లోపలికి వెళ్లారు. కేసీఆర్‌, కేటీఆర్‌లను జగన్‌ శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. కేసీఆర్‌ పోచంపల్లి శాలువాతో జగన్‌ను సత్కరించారు.

కేసీఆర్‌ ఆహ్వానం.. జగన్‌ అంగీకారం
ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని కేసీఆర్‌ స్వయంగా జగన్‌ను ఆహ్వానిస్తూ పత్రికను అందజేశారు. గోదావరి జలాల సద్వినియోగమే లక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిందని, రికార్డు సమయంలో ప్రాజెక్టు పూర్తయిన సందర్భంగా ఘనంగా జాతికి అంకితం చేస్తున్నామని, ఈ చారిత్రక ఘట్టంలో భాగస్వామి కావాలని కేసీఆర్‌ కోరారు. దీనికి జగన్‌ అంగీకరించారు. ఈ ఆహ్వానం తనకు గొప్ప గౌరవమని, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి, ప్రారంభోత్సవంలో పాల్గొంటానని చెప్పారు.

కలిసి భోజనం చేసిన సీఎంలు
ఇద్దరు ముఖ్యమంత్రులు మధ్యాహ్నం రెండు పార్టీల నేతలతో కలిసి భోజనాలు చేశారు. ఈ విందు భేటీలోనే కొన్ని విషయాలపై సరదా సంభాషణలు చోటు చేసుకున్నాయి. తర్వాత ముఖ్యమంత్రులిద్దరూ భేటీ అయ్యారు. మధ్యాహ్నం 2:45 గంటల ప్రాంతంలో జగన్‌ నివాసానికి వచ్చిన కేసీఆర్‌ సాయంత్రం 4:40 గంటల వరకు అక్కడే ఉన్నారు. మధ్యలో మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు, వైకాపా ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, వెంకట్రామిరెడ్డి, సాయిప్రసాదరెడ్డి అక్కడకు వచ్చారు. జగన్‌, కేసీఆర్‌లను పీఠాధిపతి ఆశీర్వదించారు. అనంతరం జగన్‌, కేసీఆర్‌ ఒకే కారు (జగన్‌ కాన్వాయ్‌)లో గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ విశాఖ శ్రీ శారదాపీఠ ఉత్తరాధికారి శిష్య తురీయాశ్రమ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత కేసీఆర్‌.. కేటీఆర్‌, ఇతర నేతలతో కలిసి హైదరాబాద్‌ బయల్దేరారు. జగన్‌ వారికి ఘనంగా వీడ్కోలు పలికారు.

 

ఇద్దరు సీఎంల అంగీకారాలు

* ఏపీ, తెలంగాణల మధ్య రవాణా సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. విమానయాన సేవలు తక్కువగా ఉన్నాయి. వాటిని పెంచాలి. దీని కోసం విమానయాన సంస్థలతో సమావేశాలు జరిపాలి.
* తెలంగాణ-ఏపీల మధ్య రైల్వే వసతులు అంతంత మాత్రమే. వాటిని పెంచాలి. విభజన చట్టంలో రెండు రాష్ట్రాల మధ్య స్పీడ్‌ రైలు వేస్తామని కేంద్రం హామీ ఇచ్చినా దీనిని అమలు చేయలేదు. దాంతో పాటు మరిన్ని రైళ్లు వేయాలి. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
* జాతీయ రహదారుల సంఖ్యను ఇరు రాష్ట్రాల మధ్య పెంచాలి. ఇందుకోసం కేంద్రాన్ని కోరాలి.
నెలరోజుల్లోగా ప్రభుత్వ రంగ సంస్థల విభజన

* విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని ప్రభుత్వరంగ సంస్థల విభజన ప్రక్రియను నెలాఖరులోగా పూర్తి చేయాలి.
* ఆర్టీసీ, రాష్ట్ర ఆర్థిక సంస్థల మధ్య సమస్యలపై సీఎంల స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. విద్యుత్‌ ఉద్యోగుల విభజన, విద్యుత్‌ బకాయిల పరిష్కారం త్వరితగతిన జరగాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *