ఆ అమ్మాయి అంత నటించక్కర్లేదు…

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు చేసే ప్రతీ సినిమాలో తన పాత్ర కొత్తగా ఉండేలా చూసుకుంటారని అంటున్నారు నటుడు సుధీర్‌బాబు. పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌ ఇచ్చిన కానుక అభిమానులనే కాదు సినీ తారలనూ సర్‌ప్రైజ్‌కు గురిచేసింది. మహేశ్‌-వంశీపైడిపల్లి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు ‘మహర్షి’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌లో మహేశ్ స్టూడెంట్‌లా స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తూ పక్కన అమ్మాయి కనపడగానే ఆమెను వెనక్కి తిరిగి చూసిన తీరుకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.

దీనిపై సుధీర్‌బాబు ట్విటర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘మహేశ్‌ తన ప్రతీ సినిమాలోని పాత్ర కోసం ఏదన్నా కొత్తగా చేయాలని చూస్తారన్న విషయం నాకు తెలుసు. కానీ ‘మహర్షి’ ఫస్ట్‌లుక్‌ నన్ను సర్‌ప్రైజ్‌కు గురిచేసింది. ఎందుకంటే ఇందులో సూపర్‌స్టార్‌ లుక్‌ ఫ్రెష్‌గా, ఫ్లర్టేషియస్‌గా ఉంది. కానీ నేను సర్‌ప్రైజ్‌ అవ్వని విషయం కూడా ఒకటి ఉంది. మహేశ్‌ పక్కనున్న అమ్మాయి అంత నటించక్కర్లేదు. ఎందుకంటే మహేశ్‌ను చూడగానే ఏ అమ్మాయికైనా ఆ ఎక్స్‌ప్రెషన్‌ సహజంగానే వచ్చేస్తుంది. ఇప్పటివరకు ఏ దర్శకుడు చూపించలేని విధంగా సూపర్‌స్టార్‌ లుక్‌ను కొత్తగా చూపించారు దర్శకుడు వంశీపైడిపల్లి. కంగ్రాట్స్‌ అండ్‌ గుడ్‌లక్‌’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు సుధీర్‌.

ఈ చిత్రంలో మహేశ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. అల్లరి నరేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో మహేశ్‌.. రిషి పాత్రలో అల్లరి నరేశ్‌ రవి పాత్రల్లో నటిస్తున్నారు. డెహ్రాడూన్‌, హైదరాబాద్‌, గోవాలో షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్ర నిర్మాణ పనులు ఏకధాటిగా కొనసాగుతున్నాయి. 2019 ఏప్రిల్‌ 5న ప్రపంచ‌వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు సన్నాహాలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *