రాజ్‌కోట్: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ పృథ్వీషా అర్ధ శతకం సాధించాడు. దేశవాళీ టోర్నీలో సంచనాలు నమోదు చేసిన షా ఎన్నో అంచనాలతో విండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. తొలి టెస్టులో కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనింగ్‌కు దిగాడు. తొలి ఓవర్ ఆఖరి బంతికి రాహుల్ డకౌట్‌గా వెనుదిరిగినప్పటికీ పృథ్వీషా ఎక్కడా తడబడలేదు. పూజారాతో కలిసి అనుభవజ్ఞుడిలా జట్టును ముందుండి నడిపించాడు. వన్డే తరహాలో 56 బంతుల్లోనే 7 ఫోర్ల సాయంతో అర్ధ శతకం సాధించి తన ఎంపిక సరైనదేనని నిరూపించాడు. భారత్ ప్రస్తుతం 18 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. ఛతేశ్వర పూజారా 38 పరుగులతో షాతో కలిసి క్రీజులో ఉన్నాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 86 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.