లెక్క సరిచేస్తారా! ఇంగ్లాండ్‌తో భారత్‌ రెండో టెస్టు నేటి నుంచే


0
కోహ్లి నాయకత్వంలో 36 టెస్టులు ఆడిన భారత్‌ ఒక్కసారి కూడా ఒకే తుది జట్టుతో వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడలేదు.
11
లార్డ్స్‌లో భారత్‌ 17 మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనే గెలిచింది. నాలుగు డ్రా చేసుకుని.. పదకొండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇంగ్లాండ్‌ జట్టు 2011 నుంచి లార్డ్స్‌లో ఆడిన 21 మ్యాచ్‌ల్లో 11 మాత్రమే గెలిచింది.
1916
లార్డ్స్‌లో ఆడిన 25 టెస్టుల్లో కుక్‌ చేసిన పరుగులు. ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో అతడు రెండో స్థానంలో ఉన్నాడు.
* ఇంగ్లాండ్‌ లార్డ్స్‌లో చివరిసారి 2011లో ఓ ఆసియా ప్రత్యర్థిపై గెలిచింది. అది భారత్‌పైనే. ఆ తర్వాత అక్కడ ఆసియా జట్ల చేతిలో మూడు టెస్టులు ఓడిన ఇంగ్లాండ్‌.. రెండు టెస్టులు డ్రా చేసుకుంది.
‘‘ఒక బ్యాట్‌మన్‌కు తన తొలి 20-30 బంతులను ఎలా ఎదుర్కొవాలన్న విషయంపై స్పష్టత ఉండాలి. అలాగని దూకుడు పనికిరాదు. ప్రశాంతంగా ఆడాలి. దీనిపై మేమంతా చర్చించుకున్నాం. తొలి టెస్టు ఓటమి నిరాశ కలిగించేదే. మేం చేయాల్సిందల్లా తప్పులు చేయడం తగ్గించుకోవాలి.. కెప్టెన్‌గా నేను ఏం చేయాలో అదే చేస్తున్నాను. ఆటగాళ్లతో మాట్లాడుతున్నాను. ఇద్దరు స్పిన్నర్లతో దిగాలన్న ఆలోచనైతే ఉంది. జట్టు సమతూకాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలి’’
– కోహ్లి
* ప్రస్తుత భారత జట్టులో ఒక్క రహానె మాత్రమే లార్డ్స్‌ మైదానంలో అంతర్జాతీయ శతకం (2014లో) సాధించాడు.
* లార్డ్స్‌లో మైదానంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఇంగ్లాండ్‌ బౌలర్లు అండర్సన్‌, బ్రాడ్‌ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అండర్సన్‌ 22 మ్యాచ్‌ల్లో 94 వికెట్లు పడగొట్టగా.. బ్రాడ్‌ 20 మ్యాచ్‌ల్లో 78 వికెట్లు తీసుకున్నాడు.
ఎంత పోరాడితేనేం.. కోహ్లి ఒక్కడైపోయాడు. సహచరులు సహకరించి ఉంటే, కాస్తయినా నిలబడి ఉంటే తొలి టెస్టులో ఫలితం వేరేలా ఉండేది. సిరీసే భిన్నంగా సాగేది. ప్చ్‌.. ఓ చక్కని అవకాశం చేజారింది. మొత్తంగా టీమ్‌ఇండియాలో లోపమెక్కడుందో బర్మింగ్‌హామ్‌ టెస్టు తేటతెల్లం చేసింది. ఈ నేపథ్యం మరో పోరాటానికి భారత జట్టు సిద్ధమైపోయింది. నేటి నుంచే రెండో టెస్టు. మరి కోహ్లీసేన పుంజుకుంటుందా? సిరీస్‌ సమం చేస్తుందా? అంతా బ్యాట్స్‌మెన్‌ చేతుల్లోనే..! వాళ్లెంత బాధ్యతగా ఆడతారన్నదే టీమ్‌ ఇండియాకు కీలకం.
లండన్‌

తొలి టెస్టులో విజయానికి చేరువగా వచ్చినా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో పరాజయంపాలైన భారత జట్టు గురువారం ఆరంభమయ్యే రెండో టెస్టులో ఇంగ్లాండ్‌తో తలపడుతుంది. బ్యాటింగ్‌ బలహీనతలను భారత్‌ ఎలా అధిగమిస్తుంది, ఇంగ్లాండ్‌ పేసర్లను ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరం.
అదనపు బ్యాట్స్‌మెన్‌తో..!: తొలి టెస్టులో కోహ్లి తప్ప బ్యాట్స్‌మెన్‌ ప్రదర్శనంతా పేలవం. ఓపెనర్లు మురళీ విజయ్‌, ధావన్‌తో పాటు రాహుల్‌, రహానె, దినేశ్‌ కార్తీక్‌ తీవ్రంగా నిరాశపరిచారు. బ్యాట్స్‌మెన్‌ లోపాలను సరిదిద్దుకుని ఫామ్‌ను అందుకోకుంటే భారత్‌కు మరోసారి ఇబ్బందులు తప్పవు. మొదటి టెస్టు వైఫల్యం నేపథ్యంలో భారత్‌ అదనపు బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగుతుందా అన్నది ఆసక్తిరేపుతోంది. కోహ్లి నాయకత్వంలో భారత్‌ ఎప్పుడూ ఒకే తుది జట్టుతో వరుసగా రెండో మ్యాచ్‌ ఆడలేదు. ఇప్పుడు లార్డ్స్‌లో తుది జట్టును కొనసాగిస్తే ఆశ్చర్యమే. ఒకవేళ భారత్‌.. అదనపు బ్యాట్స్‌మెన్‌ను తీసుకోవాలనుకుంటే ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యపై వేటుపడొచ్చు. అప్పుడు పుజారా జట్టులోకి వస్తాడు. ఐతే బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ మాటలను బట్టి చూస్తే భారత్‌ అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకునే అవకాశం కనిపించట్లేదు. అదో సంప్రదాయ ఆలోచన అన్నది అతడి అభిప్రాయం. అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకోకుంటే పుజారాను.. ధావన్‌ స్థానంలో తీసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. తొలి టెస్టులో ధావన్‌, 26, 13 పరుగులు మాత్రమే చేశాడు. భారత జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కూడా మార్పులుండొచ్చు. బ్యాట్స్‌మెన్‌ విఫలమైనా.. బౌలర్ల ప్రదర్శనతో మాత్రం భారత్‌ సంతోషంగానే ఉంది. బౌలర్లు మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తారని ఆశిస్తోంది. ఐతే రెండో స్పిన్నర్‌ను తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అరుణ్‌ చెప్పిన నేపథ్యంలో బౌలింగ్‌ విభాగంలో మార్పులు ఉండొచ్చు. ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో రవీంద్ర జడేజా లేదా కుల్‌దీప్‌ యాదవ్‌ జట్టులోకి రావొచ్చు. అప్పుడు ఇషాంత్‌, షమి, పాండ్య పేస్‌ బాధ్యతలు పంచుకుంటారు. ఐతే టీమ్‌ ఇండియా అదే తుది జట్టుతో ఎలాంటి మార్పులూ చేయకుండా బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది.

ఇంగ్లాండ్‌ ఉత్సాహంగా..: ఇక సిరీస్‌లో ఆధిక్యం సంపాదించిన ఆతిథ్య ఇంగ్లాండ్‌ ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. ఆ జట్టుకు పెద్దగా ఇబ్బందులేమీ లేవు. తుది జట్టు ఎంపికలో పెద్దగా సంక్లిష్టతలూ లేవు. ఇప్పటికే 12 మందితో కూడిన జట్టును ప్రకటించింది. బ్యాట్స్‌మన్‌ మలన్‌పై వేటు పడగా.. కోర్టు కేసు కారణంగా ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అందుబాటులో లేడు. వారి స్థానంలో పోప్‌, వోక్స్‌ జట్టులోకి వచ్చారు. 20 ఏళ్ల పోప్‌ అరంగేట్రం చేయడం ఖరారు అయింది. పిచ్‌ పరిస్థితిని బట్టి మొయిన్‌ అలీ, స్టోక్స్‌లలో ఒకరు జట్టులో ఉంటారు.
పిచ్‌ ఇలా…: వేడి గాలుల కారణంగా లార్డ్స్‌ పిచ్‌పై పచ్చికను కాపాడడం మైదాన సిబ్బందికి సవాలుగా మారింది. పరిస్థితులు దాదాపుగా ఎడ్జ్‌బాస్టన్‌లో ఉన్నట్లే ఉన్నాయి. బంతి అక్కడిలాగే స్వింగవుతుందా ? లేదా స్పిన్నర్లకేమైనా సహకారం లభిస్తుందా అన్నదానికి కచ్చితమైన సమాధానం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *