సచిన్‌ను గుర్తుకు తెచ్చిన రోహిత్‌ అప్పర్‌కట్‌..

2003లో క్రికెట్‌ దిగ్గజం లాగే ఆడిన హిట్‌మ్యాన్‌

మాంచెస్టర్‌: భారత ఓపెనర్‌ రోహిత్‌శర్మ (140; 113బంతుల్లో 14×4, 3×6) తనదైన బ్యాటింగ్‌తో మరోసారి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఆడిన తీరు ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఎప్పుడూ శిఖర్‌ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ప్రారంభించే అతడు నిన్నటి మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌తో కలిసి ఆరంభించాడు. ఈ నేపథ్యంలో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు వీరిద్దరూ మంచి శుభారంభాన్ని అందించారు.

రోహిత్‌ మైదానం నలుమూలలా చూడచక్కని షాట్లతో అలరించాడు. కళాత్మక ఇన్నింగ్స్‌తో అభిమానులను మంత్ర ముగ్ధులను చేశాడు. తన కెరీర్‌లో గొప్పగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లో ఇదొకటిగా నిలుస్తుంది. అయితే, ఈ మ్యాచ్‌లో అతను క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ను అనుసరించడం విశేషం. 2003 ప్రపంచకప్‌లో సచిన్‌ ఆడిన షాట్లను భారత అభిమానులు ఎప్పటికీ మర్చిపోరు. మరీ ముఖ్యంగా పాకిస్థాన్‌పై వీరవిహారం చేసిన ఆ ఇన్నింగ్స్‌ సచిన్‌ కెరీర్‌లో అత్యంత విలువైనదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

అయితే అప్పటి సచిన్‌ షాట్లను రోహిత్‌ గుర్తు చేసుకున్నాడో ఏమో. నిన్నటి మ్యాచ్‌లో అచ్చం మాస్టర్‌ బ్లాస్టర్‌ను పోలిన షాట్లనే ఆడాడు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతున్నాయి. సచిన్‌ కొట్టిన అప్పర్‌కట్‌ షాట్‌ను రోహిత్‌ కూడా అదే ఊపులో ఆడాడు. మీరు ఒకసారి ఆ వీడియోను వీక్షించండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *