పాకిస్థాన్‌కి కోచ్‌ అయినప్పుడు సలహా ఇస్తా: రోహిత్‌

దాయాది రిపోర్టర్‌కి చురక అంటించిన హిట్‌మ్యాన్‌

 


మాంచెస్టర్‌: ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థిపై శతకం బాదిన రోహిత్‌శర్మ ఓ పాకిస్థాన్‌ రిపోర్టర్‌కి తనదైనశైలిలో చురక అంటించాడు. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన హిట్‌మ్యాన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. అనంతరం మీడియాతో మాట్లాడేటప్పుడు పాక్‌ విలేకరి నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. దీంతో చక్కటి సమయస్ఫూర్తి ప్రదర్శించి అందరిచేత నవ్వులు పూయించాడు.

అసలేం జరిగిందంటే.. పాకిస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌ ఇటీవలి కాలంలో విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అది వాళ్ల ఫలితాల్లో కనిపిస్తుంది. మీరు వాళ్లకిచ్చే సలహా ఏంటి? అని విలేకరి అడిగారు. దీనికి రోహిత్‌ నవ్వుతూ ‘నేనొకవేళ పాకిస్థాన్‌ కోచ్‌ అయితే తప్పకుండా సలహా ఇస్తా. ఇప్పుడేం చెప్పగలను?’ అంటూ తనదైన రీతిలో బదులిచ్చాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.

ఇదిలా ఉండగా తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై శతకం సాధించిన రోహిత్‌ రెండో మ్యాచ్‌లో ఆసీస్‌పై అర్ధశతకం సాధించాడు. ఇక నిన్నటి పాకిస్థాన్‌ మ్యాచ్‌లో ఏకంగా 140 పరుగులు సాధించి ప్రపంచకప్‌లో ఇరుజట్లపై అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించాడు. తన గారాల పట్టి సమైరా శర్మ తన జీవితంలోకి వచ్చాక బాగా రాణిస్తున్నానని హిట్‌మ్యాన్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌ తర్వాత ఇంతలా రాణించడం సంతోషంగా ఉందని, తమ జట్టు సరైన పద్ధతిలో ముందుకు సాగుతుందని తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *