లెక్క చూపని ఆస్తులు రూ.20 కోట్లు..

ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న ఫిర్యాదులతో తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసంలో శుక్రవారం కూడా ఐటీ సోదాలు కొనసాగాయి. రెండోరోజు పూర్తిగా ఆయన ఇంట్లోనే సోదా చేశారు. లెక్కలు చూపని ఆస్తులు రూ. 20 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇవి రేవంత్‌ బావమరిది స్థిరాస్తి సంస్థకు చెందినవిగా తేలింది. ఆదాయపు పన్ను శాఖ దాడుల నేపథ్యంలో అవినీతి నిరోధకశాఖ (అనిశా) రేవంత్‌రెడ్డిపై మరో కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్‌పై ఐటీ దాడులు ప్రభుత్వ కక్షసాధింపేనంటూ కాంగ్రెస్‌ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. పార్టీ కార్యకర్తలు ఆయన ఇంటివద్దకు చేరుకుని నిరసనలు వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు రెండోరోజూ కొనసాగాయి. గురువారం అర్ధరాత్రి తర్వాత కొంత విరామం ఇచ్చిన అధికారులు మళ్లీ శుక్రవారం ఉదయం నుంచే తనిఖీలు మొదలుపెట్టారు. రాత్రి పొద్దుపోయే వరకూ ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. మొదటిరోజు రేవంత్‌ సోదరులు కృష్ణారెడ్డి, కొండల్‌రెడ్డి, బావమరిది జయప్రకాశ్‌రెడ్డిలతోపాటు ఆయన మిత్రులు సెబాస్టియన్‌, ఉదయసింహ ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రేవంత్‌ బంధువుల స్థిరాస్తి వ్యాపార లావాదేవీలకు సంబంధించిన ఆదాయ వ్యయ వివరాలు సేకరించేందుకే అధికారులు తొలిరోజు ప్రాధాన్యమిచ్చారు. శుక్రవారం మాత్రం కేవలం రేవంత్‌రెడ్డి ఇంట్లోనే సోదాలు చేశారు. ఎన్నికల సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్లు, ఆదాయపు పన్ను శాఖకు దాఖలు చేసిన అఫిడవిట్లు దగ్గర పెట్టుకుని మరీ సోదాలు చేశారు. ఈ సందర్భంగా లెక్క చూపని ఆస్తులు రూ.20 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇది రేవంత్‌ బామ్మర్ది జయప్రకాశ్‌రెడ్డికి చెందిన శ్రీ సాయిమౌర్య ఎస్టేట్స్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి సంబంధించిన మొత్తంగా తేలింది. ఈ కంపెనీ 2011 తర్వాత ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం లేదు. ఈ కంపెనీ ఆదాయ, వ్యయాలను పరిశీలించగా లెక్క చూపించని ఆదాయం రూ.20 కోట్లు తేలింది. దీనికి సంబంధించిన 30% జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు రేవంత్‌ భార్య గీత బ్యాంక్‌ లాకర్‌ను తెరిపించిన అధికారులు 560 గ్రాముల బంగారాన్ని, కొన్ని ఆస్తిపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయన మామ పద్మారెడ్డి ఇంట్లోనూ 10 లక్షల నగదు లభ్యమైంది. రేవంత్‌ నివాసంలో నిన్న కొన్ని వజ్రాభరణాలు, బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆభరణాల విలువ అంచనా వేసేందుకు నిపుణులను తీసుకొచ్చారు. సోదాల సందర్భంగా అధికారులు రేవంత్‌రెడ్డి ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్లతోపాటు గురువారం స్వాధీనం చేసుకున్న కంప్యూటర్‌ హార్డ్‌డిస్కులను సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీకి చెందిన నిపుణులను పిలిచి అప్పగించారు. న్యాయస్థానం అనుమతితో వీటిని విశ్లేషించి అందులో ఉన్న సమాచారం వెలికితీసి నివేదిక సమర్పించనున్నారు.

గంటల తరబడి విచారణ
సోదాలు మొదలయ్యేసరికి రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అధికారులు ఆయనను అక్కడి నుంచి పిలిపించారు. గురువారం రాత్రి 8 గంటలకు ఇంటికి చేరుకున్న రేవంత్‌ను అవసరాన్ని బట్టి ఆదాయపు పన్ను శాఖాధికారులు విచారిస్తూనే ఉన్నారు. ప్రధానంగా రేవంత్‌రెడ్డి ఆదాయ వనరులు, వ్యాపారంలో పెట్టుబడులు, బంధువులు నిర్వహిస్తున్న వ్యాపారాలకు సంబంధించి ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన ధ్రువపత్రాల్లో కొన్ని హెచ్చుతగ్గులు ఉండటంతో వాటి గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది.

రేవంత్‌రెడ్డిపై మరో కేసు?
ఆదాయపు పన్ను శాఖ దాడుల నేపథ్యంలో అవినీతి నిరోధకశాఖ (అనిశా) రేవంత్‌రెడ్డిపై మరో కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం ప్రజాప్రతినిధులు ఆదాయానికి మించిన ఆస్తులు పోగేసినట్లు తేలితే వారిపై కేసు నమోదు చేయవచ్చు. ఇప్పుడు ఆదాయపన్ను శాఖ నిర్వహిస్తున్న దాడుల్లో రేవంత్‌రెడ్డి ఆస్తులు, ఆదాయం వంటి వివరాలన్నీ వెలికితీస్తున్నారు. ఎన్నికల సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్‌ ఆధారంగా విశ్లేషణ జరుగుతోంది. బయటకు వెల్లడించని ఆస్తులున్నట్లు గుర్తించినా, ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు తేలినా ఆదాయపు పన్ను శాఖ ద్వారా అనిశా ఆ సమాచారం సేకరించి కేసు నమోదు చేసే అవకాశం ఉంది. శాసనమండలి ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేయాలని నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు డబ్బు ఇచ్చేందుకు ప్రయత్నించిన ఘటనలో రేవంత్‌రెడ్డిపై అనిశా ఇప్పటికే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఆ 50 లక్షలు ఎక్కడివి?
ఓటుకు నోటు కేసులో సెబాస్టియన్‌కు ఇచ్చిన 50 లక్షల గురించి కూడా ఐటీ అధికారులు రేవంత్‌ను ఆరా తీశారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలుసుకోవడానికి ఆ కేసులో రేవంత్‌రెడ్డితోపాటు నిందితులయిన ఉదయ్‌సింహ, సెబాస్టియన్‌లను కూడా విచారించారు. వీరిని సోమవారం తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. మధ్యాహ్నం రేవంత్‌ ఇంటికి వచ్చిన ఉదయసింహను ఆదాయపు పన్ను అధికారులను లోనికి పిలిచారు. సోదాలు జరుగుతున్నంతసేపూ ఆయన అక్కడే ఉండటం గమనార్హం.

తెదేపా వైఖరెంటో చెప్పాలి: వైకాపా నేత భూమన
రేవంత్‌రెడ్డి ఇళ్లు, ఆస్తులపై ఐటీ దాడులపై తెలుగుదేశం పార్టీ తమ వైఖరి వెల్లడించాలని వైకాపా ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఐటీ దాడుల్లో బయటపడుతున్న ఆస్తులు రేవంత్‌వేనా? లేక చంద్రబాబు బినామీ ఆస్తులా? అని అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో ప్రధాన సూత్రధారి అయిన చంద్రబాబును ఎందుకు వదిలేస్తున్నారన్నారు. ఈ కేసులో సంబంధం ఉన్న వ్యక్తులందరినీ వెంటనే హైదరాబాద్‌ వదిలి అజ్ఞాతంలోకి వెళ్లమని మంత్రి లోకేష్‌ చెబుతుండడం దారుణమైన విషయమని వ్యాఖ్యానించారు.

పోలీసులు, రేవంత్‌ అభిమానుల తోపులాట
ఒంటిపై పెట్రోలు పోసుకున్న వ్యక్తి
బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసంపై ఐటీ దాడుల నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శుక్రవారం సాయంత్రం రేవంత్‌ నివాసానికి కాంగ్రెస్‌ నేతలు, కొడంగల్‌ ప్రాంతం నుంచి ఆయన అభిమానులు, అనుచరులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. తమ నాయకుడికి ప్రాణహాని ఉందని, ఆయనను చూపించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రేవంత్‌ను అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరగడంతో కొందరు నినాదాలు చేస్తూ నివాసం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. బంజారాహిల్స్‌ ఏసీపీ కేఎస్‌రావు ఆధ్వర్యంలో పోలీసులు వారిని నెట్టుకుంటూ వాహనం వద్దకు తీసుకెళ్లడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రేవంత్‌ అభిమానులు కొందరు పోలీసు వాహనాలకు అడ్డంగా కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరికి పోలీసులు ఇంట్లోకి వెళ్లి రేవంత్‌ను బయటికి పిలిపించి అభిమానులకు చూపించడంతో వారు కొంత శాంతించారు. సదాశివపేట ప్రాంతానికి చెందిన ప్రసాద్‌ అనే యువకుడు చేతివేలు కోసుకొని రేవంత్‌ చిత్రపటానికి రక్తతిలకం దిద్దారు. దాడులను నిరసిస్తూ భూపాలపల్లికి చెందిన ఉమేష్‌రెడ్డి ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిని, మిగతా అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *