ఆడకుంటే అంతే…


టీమ్‌ఇండియాలో స్థానానికి ఇప్పుడున్నంత పోటీ, ఇప్పుడున్నన్ని అవకాశాలు ఎప్పుడూ లేవేమో! కొత్త ప్రతిభను తీసుకోవడానికి సెలక్షన్‌ కమిటీ ఇప్పుడున్నంత సముఖంగా ఎప్పుడూ లేదేమో! తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఏకంగా ఆరు మార్పులు చేయడం పెద్ద విశేషమే. ‘ఆడకుంటే అంతే సంగతులు’ అన్నది ఈ ఎంపిక ఇచ్చిన సందేశం. ప్రతిష్ఠ ఆధారంగానో, (ఆడకున్నా) ప్రతిభావంతుడన్న పేరుతోనో ఏళ్లకు ఏళ్లు జట్టులో స్థానం నిలుపుకోవడం ఇంకెంతమాత్రం సాధ్యం కాదని స్పష్టమైపోయింది. దేశవాళీలో చెలరేగిపోతూ యువతరం

సెలక్టర్లకు బాగానే పనికల్పిస్తోంది..!
‘దయ చేసి ధావన్‌ను వెస్టిండీస్‌ పర్యటనకు ఎంపిక చేయకండి. అక్కడ పరుగుల వరద పారించి తిరిగి ఆస్ట్రేలియా పర్యటనకు జట్టులో స్థానం సంపాదిస్తాడు’..
ఇంగ్లాండ్‌లో ధావన్‌ ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఓ విశ్లేషకుడి అసహనమిది. ఈ వ్యాఖ్యలు అర్థరహితమేమీ కాదు. పచ్చిక పిచ్‌లపై ఘోరంగా విఫలమైనా.. ఉపఖండంలో చెలరేగి, పరిమిత ఓవర్ల ఫామ్‌ ఆధారంగా తిరిగి టెస్టులకు ఎంపిక కావడం ధావన్‌కు రివాజుగా మారింది. కానీ ఈసారి సెలక్టర్ల నుంచి షాక్‌ తప్పలేదు. ఇంగ్లాండ్‌ పర్యటనలో స్వింగ్‌, బౌన్సీ పిచ్‌లపై ధావన్‌ నిలవడానికే కష్టపడ్డాడు. పేలవ ప్రదర్శనతో కేవలం 162 పరుగులు సాధించాడు. కానీ వెంటనే ఉపఖండంలో లాంటి పరిస్థితుల్లో రెచ్చిపోయాడు. వారం తర్వాత మొదలైన ఆసియాకప్‌లో ఇంగ్లాండ్‌లో కన్నా రెట్టింపు పరుగులు చేశాడు. టోర్నీలోనే టాప్‌ స్కోరర్‌గా నిలిచిన ధావన్‌… ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అవార్డునూ సాధించాడు. కానీ సెలక్షన్‌ కమిటీ ఈసారి అతడి వన్డే ఫామ్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. అలా తీసుకోవాలన్న కోరికను అణచుకుంటూ కుర్రాళ్లకు అవకాశమిచ్చింది. ధావన్‌ పక్కన పెట్టేసి.. ముగ్గురు ఓపెనర్లకు అవకాశమిచ్చింది. దేశవాళీలో పరుగుల వరదపారించిన మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షాతో పాటు కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేసింది. బహుశా ప్రస్తుతానికి ధావన్‌ టెస్టు కెరీర్‌కు బ్రేక్‌ పడినట్లేనేమో! డిసెంబరులో ఆస్ట్రేలియా పర్యటన నాటికి అతడి 33 ఏళ్లు నిండుతాయి. పచ్చిక పిచ్‌లు ఎదురయ్యే దేశాల్లో, ముఖ్యంగా టెస్టుల్లో రాణించడానికి అవసరమైనంత టెక్నిక్‌ అతడిలో లేదని ఇప్పటికే రుజువైంది. అందుకే వెస్టిండీస్‌పై పరుగులు చేయగలడని తెలిసినా సెలక్టర్లు అతణ్ని జట్టు నుంచి తప్పించారు. అటు వన్డేల్లో చక్కటి ఫామ్‌ను చాటినా రోహిత్‌కు మరోసారి మొండిచేయి ఎదురైంది. కుర్రాళ్ల ఊపు నేపథ్యంలో సెలక్టర్లు మురళీ విజయ్‌నీ కనికరించలేదు. వరుస వైఫల్యాలతో ఇంగ్లాండ్‌తో ఆఖరి రెండు టెస్టులకు జట్టులో స్థానం కోల్పోయి విజయ్‌… కౌంటీ క్రికెట్లో రాణిస్తున్నా పట్టించుకోలేదు.

మయాంక్‌ ఎట్టకేలకు..
చాలాకాలంగా ఊరిస్తున్న అవకాశం మయాంక్‌ అగర్వాల్‌కు ఎట్టకేలకు దక్కింది. అద్వితీయ ఫామ్‌తో సెలక్టర్లకు ఎంపిక చేయక తప్పనిసరి స్థితి కల్పించాడు అతడు. 2017-18 దేశవాళీ సీజన్‌లో మాయంక్‌ 36 ఇన్నింగ్స్‌లో 2253 పరుగులు చేశాడు. ఐతే రాహుల్‌తో కలిసి వెస్టిండీస్‌పై అతడు ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడా లేదా అన్నది ఆసక్తికరం. ఇంగ్లాండ్‌ పర్యటనకూ వెళ్లిన పృథ్వీ షాకు మొదటి అవకాశం దక్కొచ్చు. ఐతే ప్రస్తుతం ఫామ్‌ ప్రకారం అతణ్ని తుది జట్టు నుంచి దూరంగా పెట్టడం కష్టం. ఎన్నోసార్లు త్రుటిలో అవకాశం చేజారినా మయాంక్‌ నిరాశచెందలేదు. అసలు అతడు ఇంగ్లాండ్‌ పర్యటన ఎంపిక కాకపోవడమే దురదృష్టకరమని చాలా మంది భావించారు. శ్రీలంకలో ముక్కోణపు సిరీస్‌కు ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసినా మాయాంక్‌కు చోటు దక్కలేదు. ఆ నేపథ్యంలో దేశవాళీలో మరిన్ని పరుగులు చేశాడు. అయినా నిరాశ తప్పలేదు. ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంపిక కాలేదు. కానీ ‘ఎ’ జట్టు తరఫున అదే ఇంగ్లాండ్‌లో అదరగొట్టాడు. అయినప్పటికీ ఇంగ్లాండ్‌తో ఆఖరి రెండు టెస్టులకూ అతడికి అవకాశం రాలేదు. ఈసారి సొంతగడ్డపై ‘ఎ’ తరఫున పరుగుల వరద పారించాడు. చివరికి అతడు ఎంపికైన రోజు కూడా బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ తరఫున వెస్టిండీస్‌పై 90 పరుగులు చేశాడు. మయాంక్‌ అగర్వాల్‌.. భారత భవిష్యత్తుకు మంచి పెట్టుబడి అనడంలో సందేహం లేదు.
పాపం నాయర్‌!

అన్నీ బాగానే ఉన్నా.. ఒక్క కరుణ్‌ నాయర్‌ విషయంలోనే కఠినంగా వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లాండ్‌ పర్యటనలో ఐదు టెస్టులకూ జట్టుతోనే ఉన్నా అతడికి ఒక్క అవకాశం కూడా దక్కలేదు. మధ్యలో వచ్చిన హనుమ విహారి అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. కరుణ్‌ మాత్రం బెంచ్‌కే పరిమితమయ్యాడు. తీసుకోకున్నా.. అతడిని ఏ పరిస్థితుల్లో తీసుకోవట్లేదో చెబుతూ అతడిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే బాధ్యతే టీమ్‌మేనేజ్‌మెంట్‌దే. కానీ అలాంటి ప్రయత్నమేమీ జరగలేదు. టీమ్‌మేనేజ్‌మెంట్‌ తనతో ఏమీ మాట్లాడలేదని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా కరుణే చెప్పాడు. ఇప్పుడేమో ఎలాంటి కారణంగా లేకుండా జట్టు నుంచే తప్పించారు. అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఇలాంటి పరిస్థితి విచారకరం. టీమ్‌మేనేజ్‌మెంట్‌ అతడి ఎంపిక పట్ల అంత సుముఖంగా లేదని సమాచారం. ఏదేమైనా వెస్టిండీస్‌తో సిరీస్‌కు జట్టు ఎంపిక ద్వారా సెలక్టర్లు సీనియర్లకు గట్టి హెచ్చరికలే జారీ చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో మురళీ విజయ్‌, శిఖర్‌ ధావన్‌ తిరిగి జట్టులోకి ఎంపిక కావడం అంత తేలికైన విషయమేం కాదు. ఇక జాగ్రత్త పడకపోతే.. కొంతకాలంగా విమర్శలు ఎదుర్కొంటున్న రహానె చతేశ్వర్‌ పుజరాల విషయంలోనూ సెలక్టర్లు నిర్ణయం తీసుకునే సాహసం చేయొచ్చు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *