అరెస్టుల కలకలం…ప్రధాని హత్యకు కుట్రరచన…

దేశవ్యాప్తంగా పలువురు పౌరహక్కుల నేతలు, విప్లవ రచయితలు, న్యాయవాదుల ఇళ్లపై మంగళవారం పోలీసులు సోదాలు చేసి అరెస్టులు చేశారు. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నటం, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు సహా ఐదుగురు ప్రముఖులను పుణె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీలో మానవహక్కుల కార్యకర్త గౌతమ్‌ నవలఖా, ఫరీదాబాద్‌కు చెందిన పౌరహక్కుల నాయకురాలు సుధా భరద్వాజ్‌, ముంబయికి చెందిన అరుణ్‌ ఫెరీరా, వెర్నాన్‌ గొంజాల్వెస్‌లను అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో పాత్రికేయుడు టేకుల క్రాంతి, ఝార్ఖండ్‌లో గిరిజన నాయకుడు ఫాదర్‌ స్టాన్‌ స్వామి, గోవాలో పౌరహక్కుల కార్యకర్త, అంబేడ్కర్‌ మనవడు అనంద్‌ తేల్‌తుంబ్డే, ముంబయికి చెందిన పౌరహక్కుల న్యాయవాది, గొంజాల్వెస్‌ భార్య సుసాన్‌ అబ్రహం ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. విప్లవ రచయితల సంఘం (విరసం) వెబ్‌సైట్‌, మ్యాగజైన్‌లో.. క్రాంతి సబ్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఓ తెలుగు దినపత్రికకూ స్టాఫ్‌ ఫోటోగ్రాఫర్‌గా ఉన్నారు.

ఈ ఏడాది ఆరంభంలో మహారాష్ట్రలోని భీమా కోరెగావ్‌ గ్రామంలో చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించిన కేసులో భాగంగా.. తాజా దాడులు జరిగాయి. వరవరరావును స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచి.. పోలీసులు పుణెకు తీసుకెళ్లారు. అక్కడి న్యాయస్థానంలో బుధవారం ఆయన్ను హాజరుపరచనున్నారు. నవలఖ కూడా అరెస్టైనప్పటికీ.. ఆయన్ను కనీసం రేపటి వరకూ దేశ రాజధాని బయటకు తీసుకువెళ్లకూడదని దిల్లీ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. నవలఖ న్యాయవాది దాఖలు చేసిన హేబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను విచారిస్తూ ఈ ఆదేశాలిచ్చింది. ఇటు సుధా భరద్వాజ్‌ తరలింపుపై పంజాబ్‌, హరియాణా హైకోర్టు నిలుపుదల ఉత్తర్వులు జారీచేసినా.. ఆమెను పోలీసులు పుణెకు తరలిస్తున్నారని సుధా తరఫు న్యాయవాది ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి పౌరహక్కుల నాయకులను అరెస్టు చేయడం, వారి ఇళ్లలో సోదాలు జరపడం.. చర్చనీయాంశమైంది. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నారన్న కక్షతో పోలీసులు అప్రజాస్వామికంగా అరెస్టులకు పాల్పడుతున్నారని ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్‌, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, చరిత్రకారుడు రామచంద్ర గుహాతోపాటు పౌరహక్కుల నేతలు కేంద్రంపై విరుచుకుపడ్డారు.

హైదరాబాద్‌లో కలకలం
నగరంలోని గాంధీనగర్‌లో ఉన్న వరవరరావు నివాసానికి.. మంగళవారం 20 మందితో కూడిన పుణె పోలీసుల బృందం చేరుకుంది. తాము పుణె నుంచి వచ్చామని, సోదాలు నిర్వహించాలని వారు వరవరరావుకు చెప్పారు. ఉదయం పదిన్నర గంటల వరకూ పోలీసులు ఆయన్ను ప్రశ్నిస్తూనే ఉండటంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. తాము ఇంకా అల్పాహారం కూడా తినలేదని చెప్పగా అల్పాహారాన్ని తెప్పించి విచారణను కొనసాగించారు. ఆ తర్వాత ఇంట్లో సోదాలు మొదలుపెట్టారు. 500 జీబీ హార్డ్‌డిస్క్‌, 6 సెల్‌ఫోన్లు, 7 సిమ్‌కార్డులు, పోర్టెబుల్‌ ఇంటర్నెట్‌ మోడెమ్‌, పెన్‌ డ్రైవ్‌, ల్యాప్‌టాప్‌, 64 జీబీ మొమొరీ కార్డు, మావోయిస్టు పార్టీ-విరసం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల సమాచారం, మావోయిస్టుల చరిత్రకు సంబంధించిన రెండు డీవీడీలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటు మరో బృందం పక్కనే ఉన్న.. వరవరరావు కుమార్తె అనల ఇంటిలోనూ సోదాలు చేపట్టింది. 30మంది పుణె పోలీసులతో కూడిన మరో బృందం.. నాగోల్‌ జైపురీకాలనీలోని క్రాంతి రెడ్డి ఇంటికి వెళ్లింది.

ఉదయం 8.45కు సోదాలు మొదలుపెట్టింది. క్రాంతిరెడ్డిని సుమారు 4గంటలపాటు విచారించింది. ఆయన లాప్‌ట్యాప్‌, హార్డ్‌డిస్క్‌ను స్వాధీనం చేసుకుంది. విరసం వంటి సంస్థల్లో పనిచేయడాన్ని ఇబ్బందికరమని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వమే.. ఇలా సోదాలకు దిగి ఉండవచ్చని క్రాంతిరెడ్డి ఆరోపించారు. ఇటు నాలుగో బృందం ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఇఫ్లూ ప్రొఫెసర్‌ సత్యనారాయణ ఇంట్లో సోదాలు చేపట్టింది. వరవరరావు రెండో కుమార్తె పవన భర్తే సత్యనారాయణ. ఒకేసారి నాలుగు చోట్ల సోదాలు మొదలుకావడంతో.. కలకలం రేగింది. సమాచారం తెలిసిన వెంటనే పెద్దసంఖ్యలో పౌరహక్కుల కార్యకర్తలు వరవరరావు ఇంటికి చేరుకున్నారు. పోలీసులు వీరిని నిలువరించేందుకు ప్రయత్నించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో వరవరరావు ఇంట్లో సోదాలు పూర్తిచేసిన పుణె పోలీసులు.. అయన్ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ఆ వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు వెంటనే రోడ్డు మార్గంలో పుణె తరలించారు.

ముందే వచ్చారు
హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించేందుకు.. పుణె పోలీసులు సోమవారమే నగరానికి చేరుకున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం ఆరు గంటలకే సోదాలు మొదలుపెట్టారు. ఈ తతంగాన్ని చిత్రీకరించారు. స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలను ఫోరెన్సిక్‌ పరిశీలనకు పంపనున్నారు.

పుస్తకాలు ఉండటమే నేరమా?
ఇంట్లో పుస్తకాలుంటే నేరమా అని ఇఫ్లూ ప్రొఫెసర్‌ సత్యనారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసులు తమ ఇంట్లో సోదాలు జరిపిన అనంతరం సత్యనారాయణ, ఆయన భార్య పవన మీడియాతో మాట్లాడారు. ‘‘కులం, దళిత’వంటి పదాలు కనిపిస్తే.. అనేక ప్రశ్నలు వేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న జర్నల్స్‌లో ప్రచురితమైన అకడమిక్‌ పత్రాలపైనా ప్రశ్నించారు. విద్యార్థులకు అందుబాటులో ఉంచేందుకు.. ఇంట్లో పుస్తకాలు పెట్టుకుంటే నేరమవుతుందా? మా పిల్లల ల్యాప్‌టాప్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మమ్మల్ని కేసుల్లో ఇరికించేందుకు మహారాష్ట్ర పోలీసులు ప్రయత్నిస్తున్నారు’’ అని వాపోయారు.

మోదీ హత్యకు కుట్ర!
మహారాష్ట్రలోని భీమా-కోరేగావ్‌లో జనవరిలో చోటుచేసుకున్న అల్లర్ల వెనుక మావోయిస్టుల హస్తం ఉందన్న అనుమానాలతో పుణె పోలీసులు విచారణ ప్రారంభించారు. జూన్‌లో దేశవ్యాప్తంగా ఆరుగుర్ని అరెస్టు చేశారు. ఇందులో దిల్లీకి చెందిన పౌరహక్కుల నేతలు రోనా విల్సన్‌, రోనా జాకబ్‌, దళిత హక్కుల నాయకుడు, ఎల్గార్‌ పరిషత్‌కు చెందిన సుధీర్‌ ధవాలె, షోమ సేన్‌, మహేష్‌ రావుత్‌, న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్‌లు ఉన్నారు. వీరి ఇళ్లలో జరిపిన సోదాల్లో పోలీసులు మూడు లేఖలు స్వాధీనం చేసుకున్నారు. రాజీవ్‌గాంధీ హత్య తరహాలోనే ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, భాజపా అధ్యక్షుడు అమిత్‌ షాలను హత్య చేయాలని మావోయిస్టులు రచించుకున్న ప్రణాళికలు ఈ లేఖల్లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రణాళికను అమలు చేసేందుకు ఎం-4 రైఫిళ్లు, 4లక్షల రౌండ్ల బుల్లెట్లు, రూ.8 కోట్లు అవసరమవుతాయని ఆ లేఖలు పేర్కొన్నట్లు వివరించారు. మిలింద్‌ అనే మావోయిస్టు నేత పేరుతో ఓ లేఖ ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్‌, సూర్‌గఢ్‌, గడ్చిరౌలిల్లో వరవరరావు, సురేంద్రల నాయకత్వంలో జరిపిన కార్యకలాపాలతో జాతీయస్థాయిలో ప్రచారం వచ్చిందని.. భవిష్యత్తులో దేశవ్యాప్తగా చేపట్టాల్సిన చర్యల కోసం వారు నిధుల సేకరణ కూడా చేస్తారని ఈ లేఖలో ఉన్నట్లు తెలిపారు. జూన్‌లో వరవరరావు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.

అరెస్టయిన వారి నేపథ్యాలివి..
వరవరరావు: విప్లవ రచయితల సంఘం (విరసం) వ్యవస్థాపక సభ్యుడు. 1957 నుంచి సాహిత్యం రాస్తున్నారు. మిసా చట్టం కింద 1973లో అరెస్టయ్యారు. 1975, 1986 మధ్యలో వివిధ కేసుల్లో పలు మార్లు అరెస్టై.. విడుదలవుతూ వచ్చారు. 2005లో ఏపీ ప్రజా భద్రత చట్టం కింద అరెస్టై.. చంచల్‌గూడ జైల్లో గడిపారు. 2006 మార్చి 31 కోర్టు ఈ కేసును కొట్టివేసింది. మిగతా కేసుల్లోనూ వరవరరావు బెయిళ్లు పొందారు.

అరుణ్‌ ఫెరీరా: నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీ ప్రచార విభాగానికి ఆయన 2007లో సారథిగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. 2014లో తనపై మోపిన అన్ని అభియోగాల నుంచి ఆయనకు ఊరట లభించింది.

సుధా భరద్వాజ్‌: ఛత్తీస్‌గఢ్‌లో గనుల కార్మికుల హక్కుల కోసం పోరాడి.. ప్రాచుర్యం పొందారు. పౌరహక్కుల కార్యకర్తగా, న్యాయవాదిగా.. భూ సేకరణలకు వ్యతిరేకంగా ఆమె పోరాడుతున్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

గొంజాల్వెస్‌: పౌర హక్కుల న్యాయవాది. ముంబయి విశ్వవిద్యాలయం నుంచి స్వర్ణ పతకం పొందారు. గతంలో మావోయిస్టు సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా, మహారాష్ట్ర నక్సలైట్స్‌ రాజ్య కమిటీ కార్యదర్శిగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. దాదాపు 20 కేసుల్లో నిందితుడిగా ఉండి.. ఆరేళ్లు జైల్లో గడిపారు. ఆధారాలు లేకపోవడంతో ఆయనపై కేసులను కోర్టులు కొట్టివేశాయి.
గౌతమ్‌ నవలఖా: దిల్లీలో పాత్రికేయుడిగా పనిచేస్తున్నారు. యూపీపీఏ చట్టం రద్దు కోసం పోరాడుతున్నారు. జమ్ముకశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనల గురించి.. విస్తృతంగా కథనాలు రాశారు.

యూపీపీఏ చట్ట కింద కేసులు
వరవరరావు సహా తాజాగా అరెస్టు చేసినవారిపై పోలీసులు.. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూపీపీఏ) కింద కేసులు నమోదు చేశారు. ఈ చట్టం పోలీసులకు.. అపరిమితమైన అధికారాలను ఇస్తోంది. ఏదైనా సంస్థను నిషేధించడానికి, ఎవరినైనా ఉగ్రవాదిగా పేర్కొనడానికి.. ఈ చట్టం అవకాశం ఇస్తుంది. నిషేధిత సంస్థకు సహకరిస్తే మూడేళ్లు, సదరు నేరంలో భాగస్వాములైతే మరణశిక్ష, జీవిత ఖైదు పడే ఆస్కారముంది. మామూలు నేరాల్లో నిందితులను అరెస్టు చేసినప్పుడు 90 రోజుల లోపు అభియోగపత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. అలా చేయలేకపోతే బెయిల్‌ పొందే అవకాశం నిందితులకు లభిస్తుంది. యూపీపీఏ కింద అరెస్టైనప్పుడు అభియోగపత్రాలు దాఖలు చేసే గడువు 180 రోజులు వరకూ ఉంటుంది. మామూలు చట్టాల ప్రకారం నిందితులను 15 రోజులే కస్టడీలోకి తీసుకోవచ్చు. యూపీపీఏ కింద.. 30 రోజుల వరకూ కస్టడీ పొందే అవకాశం ఉంది. నిందితులకు బెయిల్‌ రావడమూ కష్టమే.

సెక్షన్‌లివి..
ఐపీసీ 153: మాటలు, సైగలు,రాతల ద్వారా ఇరు వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టడం. మూడేళ్ల వరకూ జైలు శిక్ష పడుతుంది.
ఐపీసీ 505: ప్రజలను తప్పుదోవ పట్టించేలా సమాచారం ముద్రించడం, పంపిణీ చేయడం, ప్రకటనలు ఇవ్వడం, వదంతులను వ్యాప్తి చేయడం. నేరం నిరూపణ అయితే మూడేళ్ల వరకూ జైలుశిక్ష పడుతుంది.
ఐపీసీ-117: మూకుమ్మడిగా నేరాన్ని చేయడానికి ప్రోత్సహించడం. ఇందుకు మూడేళ్ల శిక్షపడే అవకాశం ఉంది.
ఐపీసీ-120 బి: నేరపూరిత కుట్ర. నేర తీవ్రతను బట్టి మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *