రవిప్రకాశ్‌ అరెస్టుకు రంగం సిద్ధం…!

విచారణకు సహకరించకపోవడంతో ఆ దిశగా అడుగులు
న్యాయనిపుణులతో పోలీసుల సంప్రదింపులు
మరో కేసులో బంజారాహిల్స్‌ పోలీసుల నోటీస్‌


హైదరాబాద్‌: టీవీ9 వాటాల వివాదంలో ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్‌ అరెస్ట్‌ దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తొలుత నోటీస్‌ ఇచ్చిన అనంతరం అరెస్ట్‌ చేయాలనే యోచనతో ఉన్నట్లు తెలిసింది. 48 గంటల ముందు సమాచారం ఇచ్చిన తర్వాతే అరెస్ట్‌ చేసే యోచనలో భాగంగా గురువారం న్యాయనిపుణులను కూడా సంప్రదించినట్లు సమాచారం. టీవీ9 మాతృసంస్థ ఏబీసీఎల్‌లో సింహభాగం వాటాలు కొనుగోలు చేసిన అలందా మీడియా సంస్థ రవిప్రకాశ్‌పై ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి, లోగో విక్రయం ఆరోపణలతో సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌, బంజారాహిల్స్‌ ఠాణాల్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసుల విచారణలో భాగంగా రవిప్రకాశ్‌ను విచారించేందుకు పోలీసులు తొలుత ఇచ్చిన నోటీసులకు రవిప్రకాశ్‌ స్పందించలేదు. ముందస్తు బెయిల్‌ ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరకు మూడు రోజుల క్రితం సైబరాబాద్‌ ఠాణాలో విచారణకు హాజరయ్యారు. ఆయనను విచారిస్తున్న పోలీసులు.. రవిప్రకాశ్‌ దర్యాప్తునకు సరైన రీతిలో సహకరించడంలేదని చెప్పడాన్ని బట్టే రవిప్రకాశ్‌ అరెస్ట్‌ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు సైబరాబాద్‌లో గురువారం విచారణ జరుగుతున్న సమయంలో బంజారాహిల్స్‌ పోలీసులు రవిప్రకాశ్‌కు నోటీసు అందజేశారు. టీవీ9 లోగోను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించారనే ఆరోపణలతో రవిప్రకాశ్‌పై నమోదైన కేసు విచారణలో భాగంగా శుక్రవారం ఉదయం బంజారాహిల్స్‌ ఠాణాలో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రవిప్రకాశ్‌ తమ విచారణకు సహకరించడం లేదనే కారణాన్ని చూపి, ఈ సందర్భంగా పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

టీవీ9 సృష్టికర్తను నేనే
మూడు రోజులుగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు రవిప్రకాశ్‌ ముక్తసరిగా సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది. ఈ కేసులో మరో నిందితుడు మూర్తితోపాటు ఓ న్యాయవాది నుంచి సేకరించిన వాంగ్మూలాల ఆధారంగా కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం. రవిప్రకాశ్‌ ఇంట్లో, కార్యాలయాల్లో స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌లు, పత్రాలను విశ్లేషించి మరిన్ని వివరాల్ని క్రోడీకరించారు. అసలు విషయానికొచ్చేసరికి రవిప్రకాశ్‌ దర్యాప్తును మళ్లించే దిశగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. టీవీ9 సృష్టికర్తను తానేనని రవిప్రకాశ్‌ పలుమార్లు పోలీసులతో పేర్కొన్నారు. తానెలాంటి తప్పూ చేయలేదని చెబుతూ అసలు విషయాన్ని మరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మూడో రోజు విచారణలో పోలీసులు చాలాసేపు ఆయన్ను ఖాళీగానే కూర్చోబెట్టారు. విడతలవారీగా సైబర్‌క్రైమ్‌ వేర్వేరు పోలీస్‌ అధికారులు విచారించినా, కీలక అంశాల ప్రస్తావన పెద్దగా రాలేదని తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *