మా నాన్న నిర్మాత.. బాబాయ్‌ హీరో..

బంధుప్రీతిపై రానా దగ్గుబాటి ఏమన్నారంటే..

చిత్ర పరిశ్రమలో నెపోటిజం (బంధుప్రీతి) గురించి తనదైన శైలిలో స్పందించారు సినీ నటుడు రానా దగ్గుబాటి. బాలీవుడ్‌లో బంధుప్రీతి ఎక్కువని, టాలెంట్‌ ఉన్నా లేకపోయినా స్టార్‌ కిడ్స్‌కే అవకాశాలు ఇస్తుంటారని చాలా మంది ఆరోపించారు. ఈ విషయం గురించి రానా ఓ బాలీవుడ్‌ వెబ్‌ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు.

‘ఇక్కడ నేను మీకొక విషయం క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. భారతదేశంలోని ఏ ఫిలిం స్కూల్‌ కూడా గొప్ప దర్శకులను తయారుచేయదు. మన టాలెంట్‌తో మనమే గొప్ప దర్శకులుగా, నటులుగా మారాలి. ఉదాహరణకు ఓ తండ్రికి రసాయన కర్మాగారం ఉందనుకోండి.. అతని కుమారుడికి కూడా ఈ వృత్తిపై ఎంతో అవగాహన కలిగి ఉంటుంది. కర్మాగారంలో ఏం చేస్తారు? ఎలాంటి రసాయనాలు తయారుచేస్తారు? ఇలా అన్ని విషయాలు తెలిసుంటాయి’

‘అదే విధంగా స్టార్‌ కిడ్స్‌ కూడా అంతే. మా నాన్న నిర్మాత. అమ్మ ఫిలిం ల్యాబ్స్‌ చూసుకునేవారు. బాబాయ్‌ హీరో. కాబట్టి నాకు సినిమాలపై అవగాహన బాగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న స్టార్‌ కిడ్స్‌ ఎన్నో ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ తమని తాము నిరూపించుకుంటున్నారు. అలాంటప్పుడు స్టార్‌ కిడ్స్‌ను ఉద్దేశిస్తూ నెపోటిజం అనకూడదు. అనుభవం ఉన్నవారని సంబోధిస్తే బాగుంటుంది. అయితే స్టార్‌ కిడ్స్‌కి త్వరగా అవకాశాలు వస్తాయన్న మాట నిజం. అయితే తొలి అవకాశం ఇచ్చిన తర్వాత తమని తాము నిరూపించుకోవాలి. ప్రతీ సినిమాలో అవకాశం ఇప్పించడం కుదరదు’ అని వెల్లడించారు రానా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *