వారాంతంలో.. రామగిరి రమ్మంటోంది…

ఆ గిరిపై ఎప్పుడో ఒకటో శతాబ్దంలో నిలబడిన కోట గోడలవి. అప్పుడు తెరుచుకున్న ఖిల్లా ద్వారాలు.. శాతవాహనులను సాదరంగా ఆహ్వానించాయి. మౌర్యులను ఆదరించాయి. కాకతీయులకు దారి చూపాయి. దిల్లీ సుల్తానులకూ ప్రవేశం కల్పించాయి. బహమనీలు వస్తుంటే బహుపరాక్‌ అన్నాయి. రెడ్డి రాజులకు వత్తాసు పలికాయి. మొఘలాయి చక్రవర్తులు, గోల్కొండ నవాబులు, నిజాం రాజులు ఎవరొచ్చినా స్వాగతించాయి. వారంతా వచ్చారు.. వెళ్లారు. చరిత్రలో కలిసిపోయారు. ఆ ద్వారాలు ఇంకా అక్కడే ఉన్నాయి. ఇప్పుడు మనల్ని స్వాగతించడానికి ఏడాదికోసారి మాత్రమే తెరుచుకుంటున్నాయి. ఆ సమయం ఆసన్నమైంది..
ఈ రాజులెవరూ ఇక్కడికి రాకముందు ఇక్కడికి శ్రీరామచంద్రుడు వచ్చాడటంటారు. సీతమ్మ, లక్ష్మణస్వామి సమేతంగా ఇక్కడ కాలుమోపాడని చెబుతారు. అందుకే ఈ ప్రాంతం రామగిరి అయింది. రాజుల కన్ను పడటంతో రామగిరి కాస్తా ఖిల్లాగా మారింది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ఉంటుందీ ఖిల్లా. బేగంపేట గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న భారీ గుట్టపై.. ఇంతెత్తు గోడలతో.. ఓ పక్క బండలతో.. అన్నివైపుల నుంచి చుట్టిముట్టిన చెట్టూచేమతో ఠీవీగా దర్శనమిస్తుంది. శ్రావణ మాసం వచ్చిందంటే తండోపతండాలుగా భక్తులు తరలివస్తారు. కొండల్లో ఐదారు కిలోమీటర్లు ప్రయాణిస్తారు. దారిలో పచ్చని ప్రకృతిని చూసి పరవశిస్తారు. సెలయేళ్లను చూసి మురిసిపోతారు. రామచంద్రుడ్ని కీర్తిస్తూ ఖిల్లాలోకి ప్రవేశిస్తారు. కొండలలో నెలకొన్న సీతారామాలక్ష్మణుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. బృందాలుగా వన భోజనాలు చేస్తారు. శ్రావణ మాసంలో కోటలో జరిగే సందడి ఇది.
రామగిరిపైకి వెళ్లిన వారు ఖిల్లా అంతా కలియ తిరుగుతారు. కోటలు, బురుజులు చూసి ఆశ్చర్యపోతారు. తొమ్మిది ప్రాకారాలతో నిర్మించిన రాతిగోడలు ఔరా అనిపిస్తాయి. 120 అడుగుల ఎత్తుండే గోడలపై అడుగడుగునా ఆనాటి శిల్పకారుల కళావిన్యాసం అబ్బురపరుస్తుంది. దుర్గంలో గజశాల, అశ్వశాల, చెరశాల, ప్రతాపరుద్రుల కోట, నిమ్మకోట, సోలుకోట ఇలా అలరించే విశేషాలెన్నో! బ్రహ్మగుండం, గంగ-గౌరి సవతుల బావులు, కూర్మగుండం, మల్లెవనం, బృందావనం పర్యాటకులకు కనువిందు చేస్తాయి. శ్రీరాముడు ప్రతిష్ఠించాడని చెప్పే శివలింగం మరో అద్భుతం. కొండపై నుంచి వచ్చే నీటిధార నేరుగా శివలింగంపై పడటం విశేషం. ఇలాంటి వింతలు, విశేషాలన్నీ ఆస్వాదించాలంటే శ్రావణ మాసంలో సాధ్యమవుతుంది. ఈ నెల దాటిందా.. కోట ద్వారాలు మూసుకుంటాయి. ఖిల్లా మీద మనుషుల సంచారం దాదాపుగా ఉండదు.


శతాబ్దాల రాచనగరి
క్రీ.శ ఒకటో శతాబ్దంలో గౌతమీపుత్ర శాతకర్ణి రామగిరిని సైనిక స్థావరంగా చేసుకొని ఉత్తర భారతాన్ని పాలించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. మౌర్య చక్రవర్తులు చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకుడు రామగిరి పాలనా కేంద్రంగా దక్షిణాదిని పాలించారు. కాకతీయ రాజులు ఓరుగల్లు తరహాలో రామగిరిపై తొమ్మిది కోటలు, దర్వాజాలను నిర్మించారట. దిల్లీ సుల్తాన్‌ మహ్మద్‌బిన్‌తుగ్లక్‌ ఓరుగల్లు కోటను ముట్టడించే ముందు రామగిరిని హస్తగతం చేసుకున్నాడు. తర్వాతి కాలంలో రామగిరిపై బహమనీ సుల్తానులు, వారి నుంచి రెడ్డిరాజుల ఆధిపత్యం కొనసాగింది. మొఘలాయిలు సైతం రామగిరిని పాలించారు. గోల్కొండ నవాబులు, నిజాం రాజుల వరకు రామగిరిపై రాచగిరి కొనసాగింది.

ఇలా వెళ్లొచ్చు..
రామగిరిఖిల్లా.. పెద్దపల్లి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెద్దపల్లి-మంథని రహదారిలోని నాగేపల్లి (బేగంపేట అడ్డరోడ్డు)లో దిగాలి. ఇక్కడి నుంచి బస్సులో కాని, ఆటోలో 4 కిలోమీటర్లు ప్రయాణిస్తే బేగంపేట చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు కాలినడకన వెళ్తే ఖిల్లాకు చేరుకోవచ్చు.
* ఖిల్లాలోని విశేషాలు చూసుకుంటూ రాములోరి గుడికి చేరుకోవాలనుకుంటే దాదాపు 5 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. నేరుగా దైవ దర్శనం చేసుకోవాలనుకుంటే.. రత్నాపూర్‌ గ్రామం నుంచి సొంత వాహనాల్లో ఖిల్లా వరకు వెళ్లవచ్చు. ఖిల్లాపై వన్యమృగాలు సంచరించే అవకాశం ఉండటంతో, ఒంటరిగా వెళ్తే ప్రమాదం. బృందాలుగా వెళ్లాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *