సభలో మోదీని ఆలింగనం చేసుకున్న రాహుల్‌…


న్యూదిల్లీ: భాజపా ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రసంగం చేస్తుండగా.. ప్రధాని మోదీ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. రాఫెల్‌ ఒప్పందంలో కుంభకోణం జరిగిందని ఆరోపించిన రాహుల్‌ గాంధీ.. తాను స్వయంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడుని కలిసి ఈ ఒప్పందం గురించి అడిగానని అన్నారు. ఇలాంటి ఒప్పందమేమీ భారత్‌తో చేసుకోలేదని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు తనతో చెప్పారని రాహుల్‌ తెలిపారు. ఈ వ్యాఖ్యలు వినగానే ప్రధాని మోదీ నవ్వాపుకోలేకపోయారు.

ప్రధాని నరేంద్రమోదీపైనా, ఆయన ప్రభుత్వంపైనా రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. తన ప్రసంగం అంతా పూర్తయిన తర్వాత రాహుల్‌ చేసిన పనికి సభలోని వారే కాదు, ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న వారూ ఆశ్చర్యపోయారు. ప్రసంగం ముగిసిన అనంతరం తాను ఉన్న చోటు నుంచి ప్రధాని మోదీ వద్దకు వెళ్లిన రాహుల్‌ ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఈ హఠాత్పరిణామంతో మోదీ కూడా ఆశ్చర్యపోయారు. మోదీని ఆలింగనం చేసుకుని తిరిగి వెళ్లిపోతున్న అనంతరం రాహుల్‌ను వెనక్కి పిలిచిన మోదీ.. కరచాలనం చేసి ఆయన భుజంపై తట్టారు. తర్వాత తన స్థానంలోకి వెళ్లి కూర్చొన్న రాహుల్‌ తోటి సభ్యులు ఏదో అడగటంతో కన్ను కొడుతూ కనిపించారు. ప్రధాని నరేంద్రమోదీని, రాహుల్‌ ఆలింగనం దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా హల్‌చల్‌ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *