ఉద్యోగ కల్పనకు అధిక ప్రాధాన్యం…

దేశంలో ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. వ్యాపార వర్గాలకు సులభతర వ్యాపార నిర్వహణ, ప్రోత్సాహకాల్లాంటివి ప్రభుత్వాల మాటల్లోనే తప్ప చేతల్లో లేవన్నారు. చైనాలో రోజుకు 50వేల ఉద్యోగాల సృష్టి జరుగుతుంటే మన దేశంలో 450కి మించి ఉండటం లేదని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. పారిశ్రామికవేత్తలకు అనువైన విధానాలు, ఉద్యోగ, ఉపాధి కల్పన అంశాలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.

మంగళవారం హైదరాబాద్‌లో యంగ్‌ ప్రెసిడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ (వైపీఓ), ఎంట్రపెన్యూయర్స్‌ ఆర్గనైజేషన్‌ (ఈఓ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్‌ పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 245 మందికి పైగా వ్యాపారవేత్తలు దీనికి హాజరయ్యారు. తాము అధికారంలోకి వస్తే అవలంబించే పారిశ్రామిక విధానాలు, ఇతర అంశాలపై రాహుల్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లో వివరించారు.

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు లోపభూయిష్టంగా ఉందనీ, దీనివల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ పన్నుల విధానంలో సమూల మార్పులు చేస్తామన్నారు. ఒకే పన్ను శ్లాబు ఉండేలా దీన్ని సవరిస్తామని తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల కేవలం 14-15 పెద్ద సంస్థలకే ప్రయోజనం కలుగుతోందనీ, ఎన్నో చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలు, సంస్థలు మూతబడే పరిస్థితికి వచ్చాయన్నారు.

తమ ప్రభుత్వం వచ్చాక యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన అన్ని సరళీకృత విధానాలను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ఏం చేయాలనేది చర్చిస్తామని అన్నారు. పెద్ద నోట్ల రద్దువల్ల ఎంత లాభం చేకూరిందో అంతుబట్టడం లేదు కానీ.. అనేక సంస్థలు దీనివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాయని విమర్శించారు. బ్యాంకింగ్‌ రంగంలోనూ సమూల ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనీ.. తాము అధికారంలోకి వచ్చాక బ్యాంకులు చిన్న పరిశ్రమలకే ప్రాధాన్యం ఇచ్చేలా విధానాలను మారుస్తామన్నారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి, దగ్గుబాటి సురేశ్‌బాబు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *