ఆ పార్టీకి వెళ్తే హాలీవుడ్‌లో అవకాశం వచ్చింది : ప్రియాంక చోప్రా…


లాస్‌ఏంజెల్స్‌: ఓపక్క బాలీవుడ్‌ మరోపక్క హాలీవుడ్‌తో బిజీ అయిపోయారు గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా. అమెరికన్‌ టెలివిజన్‌ సిరీస్‌ ‘క్వాంటికో’తో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రియాంక ఆ తర్వాత వరుసగా హాలీవుడ్‌ ప్రాజెక్టులను చేజిక్కించుకుంటున్నారు. ఈ సందర్భంగా తన హాలీవుడ్‌ ప్రయాణం ఎలా మొదలైందో వివరిస్తూ ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘హాలీవుడ్‌ ప్రయాణం చాలా భయంకరమైనది. కానీ మంచి అనుభవం. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ రికార్డ్‌ ప్రొడ్యూసర్‌ జిమ్మీ లొవైన్‌తో కలిసి ఆల్బమ్‌ చేయాలని నా మేనేజర్‌ సలహా ఇచ్చాడు. అలా నేను అమెరికాకు వెళ్లాను. అక్కడివారు నన్ను స్నేహితురాలిగా స్వీకరించారు. కాబట్టి నేనూ వారితో కనెక్ట్‌ అయ్యాను. ఆ తర్వాత అక్కడి ఈవెంట్లకు, పార్టీలకు హాజరయ్యాను. ఆ పార్టీలకు వచ్చిన వారిలో గ్రామీ అవార్డులు అందుకున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. నన్ను చూసి ‘అమెరికాలో నువ్వు ఎందుకు పనిచేయకూడదు?’ అని అడిగారు. దాని గురించి ఆలోచించాను. అలా అమెరికన్‌ టెలివిజన్‌ సిరీస్‌ ‘క్వాంటికో’లో నటించే అవకాశం నేను పార్టీకి వెళ్లడం ద్వారా లభించింది’

‘అమెరికాకు చెందిన కమర్షియల్‌ బ్రాడ్‌కాస్ట్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ వైస్‌ప్రెసిడెంట్‌ నన్ను టీవీ షోలలో నటించమని అడిగారు. కానీ టీవీలో నటించడమంటే కనీసం ఆరేళ్లు దానికే కేటాయించాల్సి ఉంటుందని ఇంతవరకు నేను అలాంటివి చేయలేదని చెప్పాను. ఆ తర్వాత వారు నా కోసం భారత్‌ వచ్చారు. భారతీయ నటీనటులు గ్లోబల్‌ ప్లాట్‌ఫాంలపై నటించాలనుకుంటే వారికి ఒకేరకమైన షోలలో నటించే అవకాశం ఇస్తారు. దాంతో నాకూ అలాంటి అవకాశాలు ఇస్తారేమోనని భావించి నేను చేయనని చెప్పాను. ఆ తర్వాత నాకు 26 రకాల స్క్రిప్ట్‌లు చదివి వినిపించారు. అలా నేను ‘క్వాంటికో’లో ఎఫ్‌బీఐ ఏజెంట్‌ అలెక్స్‌ పాత్రలో నటించడానికి ఓకే చెప్పాను. ఎందుకంటే అలెక్స్‌ ఇండో-అమెరికన్‌.’

‘ ‘క్వాంటికో’లో నటిస్తున్నంతసేపు నేను అమెరికన్‌ అని అక్కడివారు నమ్మేలా నటించాను. అలెక్స్‌ పాత్రలో నటించే అవకాశం ఎంతమందికి వచ్చిందో నాకు తెలీదు కానీ నా గురించి వచ్చిన రివ్యూలు మాత్రం సంతృప్తినిచ్చాయి. నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదు అని నిరూపించాయి. మా నాన్న నాకోసం హాలీవుడ్‌లో ఆఫర్లు ఉంచి వెళ్లలేదు. ఏం చేసినా నా అంతట నేనే చేయాలి. అలా ప్రయత్నిస్తుండగా డ్వెయిన్‌ జాన్సన్‌తో కలిసి ‘బేవాచ్‌’లో నటించే అవకాశం వచ్చింది.’ అని వెల్లడించారు ప్రియాంక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *