అధికారానికి అష్ట పదులా? అష్ట కష్టాలా?

ఇది ఎన్నికల కాలం. రెండు ప్రధాన పక్షాలకూ జీవన్మరణ సమస్యే. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే గెలిస్తే.. మోదీ హవా నిలబడినట్లే. ఓడితే మళ్లీ కోలుకోవడం, మరోసారి అధికారంలోకి రావడం ఎప్పటికి సాధ్యమో! కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికీ ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకమే. రాహుల్‌గాంధీ నాయకత్వ సామర్థ్యానికి గీటురాయి. ప్రతిపక్షాల ఐక్యత నిలిచి గెలుస్తుందా.. అధికార ఫలాన్ని అందిస్తుందా? ప్రభుత్వ సానుకూలత పనిచేసి మరోసారి మోదీనే గద్దెనెక్కిస్తుందా అనేది సర్వత్రా ఆసక్తికరం. ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రభావం చూపే ప్రధానమైన 8 అంశాలున్నాయి. ఈ ఎనిమిది మెట్లు ఎక్కితే తొమ్మిదో మెట్టుమీద అధికార పీఠం సిద్ధంగా ఉంటుంది. అవి ఎక్కేవారెవరో.. పీఠాన్ని దక్కించుకునేవారెవరో!!

ఈ 8 అంశాలు ఎన్నికల్లో కీలకాస్త్రాలు

నిరుద్యోగం

ఉపాధి బహుదూరం

దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగం గణనీయంగా పెరుగుతోంది. 2017-18లో పట్టణ ప్రాంతాల్లో 7.1%, గ్రామీణ ప్రాంతాలలో 5.8% నిరుద్యోగం నమోదైంది. 2011-12లో పనిచేసే పురుషుల సంఖ్య 30.4 కోట్లు ఉంటే, 2017-18 నాటికి అది 28.6 కోట్లకు పడిపోయింది. అలాగే మహిళల ఉపాధికీ కొంతమేర గండిపడింది. 130 కోట్ల మందికి పైగా జనాభాలో ఇప్పటికీ సరైన ఉద్యోగాల్లేక చాలామంది ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఏటా 1.2 కోట్ల మంది ఉద్యోగార్థులు వస్తున్నా, 8 కీలకరంగాలు కలిపి కేవలం 1.35 లక్షల ఉద్యోగాలిస్తున్నాయి. అంటే, ఉద్యోగార్థులలో కేవలం 1 శాతానికే ఉద్యోగాలు వస్తున్నాయి. ఇది యువ ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గత ఆరేళ్లలో 3 కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోయారు.

పుల్వామా

భావోద్వేగాల బరువెంత?

సీఆర్పీఎఫ్‌ వాహనశ్రేణి లక్ష్యంగా జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాది చేసిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించడం దేశం మొత్తాన్ని కదిలించింది. ప్రతిగా ఫిబ్రవరి 26న పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో గల జైష్‌ ఎ మహ్మద్‌ శిక్షణ శిబిరాలపై భారత వైమానికదళం యుద్ధవిమానాలతో దాడులు చేసింది. ఈ దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల సంఖ్యపై పలు ప్రచారాలు వచ్చాయి. అంతలో భారత వైమానికదళానికి చెందిన అభినందన్‌ వర్ధమాన్‌ నడుపుతున్న యుద్ధవిమానం పాక్‌ భూభాగంలో కూలిపోవడం, ఆయన వారికి చిక్కడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఆ సమయంలో పాక్‌ నాయకులు అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే వర్ధమాన్‌ను తిరిగి అప్పగించారు. ఈ ఘటన నరేంద్రమోదీ ప్రతిష్ఠను పెంచిందని భాజపా వర్గాలు చెప్పుకొంటున్నాయి. వైమానిక దాడులకు సాక్ష్యాలు చూపించాలని విపక్షాలు డిమాండు చేయడం, వాటిని భాజపా ఎద్దేవా చేయడం లాంటి పరిణామాలు సంభవించాయి.

రఫేల్‌

ఓట్లు రాలేదెవరికి?

భారత వైమానికదళం వద్ద ఇప్పటికీ పాతకాలం నాటి యుద్ధవిమానాలే ఉన్నాయని.. వాటిస్థానే కొత్తవి తీసుకోవాలని వైమానిక దళాధిపతులు చాలాకాలం నుంచి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీఏ హయాంలో కుదిరిన ఒప్పందాన్ని రద్దుచేసుకుని ఎన్డీయే వచ్చాక ఫ్రాన్స్‌కు చెందిన దసో సంస్థ నుంచి 36 రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తాము 126 విమానాల కొనుగోలుకు తక్కువ ధరతో ఒప్పందం కుదుర్చుకుంటే, దాన్ని తోసిరాజని 36 విమానాలను ఎక్కువ ధరకు కొంటున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఆ`రోపించింది. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసి, సర్వోన్నత న్యాయస్థానం వరకు వెళ్లింది. విమానాల ధరను ప్రభుత్వం న్యాయస్థానానికి సీల్డ్‌కవర్‌లో ఇచ్చింది. పదేళ్లపాటు నిర్వహణ, ఏఈఎస్‌ఏ రాడార్‌, మైలేజి తగ్గకుండా ఇంజన్‌ను మెరుగుపరచడం.. ఇవన్నీ ఒప్పందంలో ఉన్నాయని కోర్టుకు తెలిపింది.

కుంభకోణాలు

మరక పడిందా.. లేదా?

 

గత ప్రభుత్వాల హయాంలో అనేక కుంభకోణాలు వెలుగుచూడగా, ఐదేళ్ల ఎన్డీయే పాలనలో ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు పెద్దగా రాలేదని భాజపా వర్గాలు చెప్పుకొంటున్నాయి. గతంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం మీద కామన్వెల్త్‌ క్రీడలు, 2జీ, బొగ్గుగనుల కేటాయింపుల్లో అవకతవకలు.. తదితర కుంభకోణాలకు సంబంధించిన ఆరోపణలను 2014 ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించిన మోదీ.. తాను అధికారంలోకి వస్తే దేశానికి కాపలాదారుగా ఉంటానని చెప్పారు. ‘న ఖావూంగా.. న ఖానేదూంగా’ (నేను తినను.. తిననివ్వను) అని చెప్పుకొచ్చారు. కొన్ని అంశాలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేసినా, అవి కోర్టులలో నిలవకపోవడంతో ‘చౌకీదార్‌’ ప్రతిష్ఠ మీద మరకలు పడలేదంటున్నారు. కానీ విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ లాంటివాళ్లంతా స్వదేశంలో బ్యాంకులను బురిడీకొట్టి విదేశాలకు పారిపోయింది నరేంద్రమోదీ హయాంలోనే!

అన్నదాతలు

అన్నీ సమస్యలే

ఆరుగాలం కష్టపడి.. హలం పట్టి పొలం దున్ని దేశవాసులకు అన్నం పెట్టే రైతన్నకు మాత్రం నోట్లోకి నాలుగువేళ్లు పోవడం కనాకష్టంగా మారింది. మిగిలిన అన్ని వస్తువులు, సేవలకు ఉత్పత్తి వ్యయానికి కొంత లాభం వేసుకుని అమ్మకపు ధర నిర్ణయిస్తే.. పంట ఉత్పత్తులకు కనీస మద్దతుధరలు లభించడం గగనమైపోయింది. చిన్న కమతాలు కావడం.. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు పెరగడం, భూమికోత, శీతల గిడ్డంగులు లేకపోవడం.. ఇలా సమస్యలతో అన్నదాతలు సతమతం అవుతున్నారు. వరదలు, తుపానులు దాదాపుగా చేతికందే పంటను తుడిచిపెట్టేస్తున్నాయి. దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయి. పలు రాష్ట్రాలలో రైతు రుణమాఫీని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించి, కొంతమేర అమలుచేసింది. అదే సమయంలో రైతులకు పంట పెట్టుబడి సాయం కల్పిస్తామంటూ కేంద్రం ‘కిసాన్‌ సమ్మాన్‌ యోజన’తో ముందుకొచ్చింది. ఒకవైపు సమస్యలు, మరోవైపు ఊరట కనిపిస్తుండటంతో రైతులు ఎటు మొగ్గుతారో చూడాలి.

పౌర పట్టిక

భాజపాకు మిత్రలాభం

అసోంతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అంశం.. జాతీయ పౌరపట్టిక. ఇది అసోంలోని భారతీయుల జాబితా. దీన్ని 1951లో రూపొందించారు. 2018లో నవీకరించిన పట్టికలో పేరుండాలంటే.. 1951 నాటి జాబితాలో గానీ, 1971 మార్చి 24 వరకు ఉన్న ఓటర్ల జాబితాలో పేరున్నవారితో బంధుత్వం నిరూపించుకోవాలి. 2018 జనవరి 1వ తేదీన విడుదల చేసిన ముసాయిదాలో 40 లక్షల మంది పేర్లు లేవు. 2.48 లక్షల మందిని అనుమానాస్పద ఓటర్ల జాబితాలో పెట్టారు. ఈ ప్రక్రియపై ఈశాన్య రాష్ట్రాలలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొన్ని రాజకీయ పక్షాలు దీన్ని వ్యతిరేకించగా, మరికొన్ని ఉండాలన్నాయి. తాము మళ్లీ అధికారంలోకి వస్తే కొనసాగిస్తామని భాజపా చెప్పిన తర్వాతే అసోం గణపరిషత్‌ పొత్తుకు ముందుకొచ్చింది.

పెద్ద నోట్ల రద్దు

మధ్య తరగతి నడ్డి విరిచింది

ప్రధాని మోదీ 2016 నవంబరు 8వ తేదీ రాత్రి రూ. 500, 1000 నోట్లను రద్దుచేశారు. నల్లధనాన్ని అరికట్టడం దీని లక్ష్యమని చెప్పారు. ఇది విజయవంతం అయ్యిందా.. లేదా అన్న విషయమై భిన్నాభిప్రాయాలున్నాయి. నోట్లరద్దు ప్రతికూల ప్రభావాలు సమసిపోయాయని ఆర్థికసర్వే చెబుతోంది. వృద్ధిరేటు ఇప్పటికీ మందగమనంలోనే ఉందని, నోట్ల రద్దు లక్ష్యాలు కూడా నెరవేరలేదని ఆర్థికవేత్తలు అంటున్నారు. రద్దుచేసిన నోట్లలో 99% బ్యాంకులలోకి తిరిగి రావడంతో నల్లధనం, నకిలీనోట్లు ఏమయ్యాయని అడుగుతున్నారు. ఎగుమతుల వృద్ధిరేటు 13.6 శాతానికి పెరిగిందని ఆర్థికసర్వే చెబుతోంది. నగదు అందుబాటులో లేక దిగువ మధ్యతరగతి, పేదవర్గాలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బ్యాంకుల వద్ద, ఏటీఎం కేంద్రాల వద్ద జనాలు బారులు తీరి నిలబడిన రోజులు ఇప్పటికీ గుర్తే.

జీఎస్టీ

మేలెంత.. కీడెంత?

దేశంలో బహుళ పన్నుల వ్యవస్థ స్థానే ఏకరూప పన్ను తీసుకొచ్చే ఉద్దేశంతో వస్తుసేవల పన్ను(జీఎస్టీ) ప్రవేశపెట్టారు. దీనివల్ల సానుకూల, ప్రతికూల ప్రభావాలు రెండూ ఉన్నాయి. ఇంతకు ముందు అమలులో ఉన్న వ్యాట్‌, సీఎస్టీ, సర్వీస్‌టాక్స్‌, సీఏడీ, ఎస్‌ఏడీ, ఎక్సైజ్‌ పన్ను.. వీటన్నింటినీ దాదాపు తొలగించారు. పన్నులు తగ్గడం వల్ల కొన్ని వస్తువుల ధరలు అదుపులోకి వచ్చాయి. వ్యాపారులు తప్పనిసరిగా జీఎస్టీ చెల్లించాల్సి రావడంతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతోంది. రాష్ట్రాలకు ఇది అనుకూలంగా లేదని..తగినంత వాటా రావడం లేదన్న ఆందోళన ఉంది. కేంద్ర, రాష్ట్రాలు రెండూ పన్ను వేయడంతో.. భారం వినియోగదారుల మీదే పడుతోంది. వస్త్ర, మీడియా, ఔషధ, పాడి తదితర రంగాలు నష్టాలలో ఉన్నా అధిక పన్ను పడుతోంది. నగలు, చరవాణి తదితర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *