రఫేల్‌ రచ్చ… రాజకీయ మచ్చ మౌనాన్ని వీడని మోదీ ప్రభుత్వం

నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానమంత్రి హోదాలో ఫ్రాన్స్‌ వెళ్లినప్పుడు రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే నేడు తీవ్ర రాజకీయ వివాదానికి కేంద్ర బిందువైంది. 2015 ఏప్రిల్‌లో మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించడానికి చాలా ఏళ్ల ముందే రఫేల్‌పై చర్చలు ప్రారంభమయ్యాయి. భారత వాయుసేన కోసం 126 మధ్యతరహా యుద్ధ విమానాల కోసం టెండర్లు పిలవగా ఫ్రాన్స్‌కు చెందిన డసో సంస్థ అన్నింటికన్నా తక్కువ ధరను కోట్‌ చేసిందని 2002లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఫైటర్‌ విమానాల కొరతతో సతమతమవుతున్న భారత వైమానిక దళానికి ఎట్టకేలకు లోటు తీరనున్నదని సంతోషం వ్యక్తమైంది. పదేళ్లపాటు చర్చలు, శల్యపరీక్షలు, క్షేత్ర ప్రయోగాలు, మదింపులు జరిపి మరీ రఫేల్‌ను ఎంచుకున్నారు. ఈ ఒప్పందానికి మోదీ సత్వరం కార్యరూపమిచ్చి, దేశ రక్షణపై తనదైన ముద్ర వేస్తారని అంతా ఆశించారు. ఈ అంచనాల మధ్య ఫ్రాన్స్‌ వెళ్లిన ఆయన మొదటి రోజు ఆ దేశ అధ్యక్షుడు హోలెన్‌తో, మౌలిక వసతులు, రక్షణ సంస్థల ప్రధాన కార్యనిర్వహణాధికారుల(సీఈఓల)తో చర్చలు జరిపారు. తరవాత పాత్రికేయులతో మాట్లాడుతూ అంతర్జాతీయ టెండరు ప్రక్రియ ద్వారా 126 ఫైటర్‌ జెట్‌లను కొనే బదులు ఎగరడానికి సిద్ధంగా ఉన్న 36 విమానాలను కొనడానికి అంగీకారం కుదిరిందని ప్రకటించారు. దీంతో గతం నుంచి పాటిస్తున్న ఆయుధ సేకరణ ప్రక్రియ మూలనపడింది.

సచివుడికే సమాచారం లేదు
పాత పద్ధతి ప్రకారం భారత్‌కు భారీఎత్తున ఆయుధాలు విక్రయించదలచే విదేశీ రక్షణ ఉత్పత్తిదారులు స్థానిక సంస్థలకు పెట్టుబడులు, సాంకేతికత బదిలీ చేసి తమ ఆయధ వ్యవస్థల్లో కొంత భాగాన్ని భారత్‌లోనే ఉత్పత్తి చేయాలి. రఫేల్‌ ఉత్పత్తిదారు అయిన ప్రెంచి సంస్థ డసో ఏవియేషన్‌ సైతం ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)తో సహతయారీ ఒప్పందం కుదుర్చుకోవాలి. మోదీ ప్రధాని అయ్యాక హెచ్‌ఏఎల్‌ను పక్కనపడేశారు. ఇక్కడేమీ తయారు చేయకుండా 36 రఫేల్‌ విమానాలను నేరుగా ఫ్రాన్స్‌ నుంచి తెచ్చుకుంటామని ప్రకటించారు. ఈ ఆకస్మిక మలుపు ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి అధికారులను సైతం ఆశ్చర్యచకితుల్ని చేసింది. మోదీ ఫ్రాన్స్‌ బయలుదేరడానికి రెండు రోజుల ముందు అప్పటి విదేశాంగ కార్యదర్శి ఎస్‌.జయశంకర్‌ దిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ రఫేల్‌ ఒప్పందం గురించి డసో, హెచ్‌ఏఎల్‌, రక్షణ శాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయన్నారు. అంతకు రెండు వారాల క్రితం డసో సీఈఓ మాట్లాడుతూ తమతో కలసి ఫైటర్‌ విమానాలను తయారు చేయడానికి సిద్ధమని హెచ్‌ఏఎల్‌ చైర్మన్‌ ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. రఫేల్‌ ఒప్పందం త్వరలోనే ఖరారవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తీరా మోదీ ఫ్రాన్స్‌ వెళ్లాక కథ మారిపోయింది. అసలు ఏం జరిగిందో తనకు పూర్తిగా తెలియదని అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ ఒక టెలివిజన్‌ ముఖాముఖిలో చెప్పారు. ఆ తరవాత కొన్ని నెలలకే మొదట అనుకున్న రఫేల్‌ సేకరణ ప్రక్రియ రద్దయిపోయిందని పార్లమెంటులో ప్రకటించారు. దాంతో ఇక 126 రఫేల్‌ విమానాల సహ తయారీ ప్రసక్తి లేదని తేలిపోయింది. 2019 నుంచి 2022 లోపల డసో నుంచి నేరుగా 36 రఫైల్‌ ఫైటర్ల కొనుగోలుకు పారికర్‌, ఫ్రెంచి రక్షణ మంత్రి 2016 సెప్టెంబరులో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం విలువ రూ.59,000 కోట్లు. ఇందులో సగభాగాన్ని రఫేల్‌ భారత్‌లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
హెచ్‌ఏఎల్‌కు అడ్డంకులు

ఒప్పందం ప్రకారం 18 రఫేల్‌ ఫైటర్లను నేరుగా ఫ్రాన్స్‌ నుంచి తెచ్చుకొని, మిగిలిన 108 విమానాలను హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) డసో పర్యవేక్షణ కింద భారత్‌లోనే తయారు చేయాల్సి ఉంది. దీనివల్ల భారత్‌కు ఎంతో కీలకమైన రక్షణ పరిజ్ఞానం లభిస్తుంది. కొత్త ఒప్పందం ప్రకారం 36 విమానాలు ఫ్రాన్స్‌లో తయారవుతాయి. మనకు రక్షణ టెక్నాలజీ ఏదీ లభించదు. మరి మోదీ సర్కారు గొప్పగా చాటుకున్న ‘భారత్‌లో తయారీ’ (మేకిన్‌ ఇండియా) ఏమైనట్లు? ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఏఎల్‌లో రఫేల్‌ ఫైటర్లను తయారు చేయాల్సింది పోయి, ఒక ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టడాన్ని సర్కారు ఏ విధంగా సమర్థించుకొంటుంది? పోనీ సదరు ప్రైవేటు సంస్థకు రక్షణోత్పత్తిలో విశేష అనుభవం ఉందా అంటే అదీ లేదు.అనిల్‌ అంబానీ ఆస్తి 2008లో సుమారు 4200 కోట్ల డాలర్లుగా లెక్కతేలింది. ఇది అప్పటి భారత రక్షణ బడ్జెట్‌ కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ. ఆరోజుల్లో ఫోర్బ్స్‌ పత్రిక అనిల్‌ను ప్రపంచంలో ఆరో అతిపెద్ద సంపన్నుడని ప్రకటించింది. 2018 వచ్చేసరికి ఆయన ఆస్తి 240 కోట్ల డాలర్లకు పడిపోయింది. అది రఫేల్‌ ఒప్పంద విలువకన్నా తక్కువ. అప్పులేమో ఏకంగా 1500 కోట్ల డాలర్లకు చేరాయి. ఇలాంటి కంపెనీని డసో భాగస్వామిగా అంగీకరించడమేమిటి?

మోదీ ఈ ఒప్పందం కుదుర్చుకోవడానికి 13 రోజుల ముందు అనిల్‌ అంబానీ రిలయన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌ అనే కొత్త అనుబంధ కంపెనీ స్థాపించారు. మోదీ ప్యారిస్‌ వెళ్లినప్పుడు అనిల్‌ కూడా ఆయన వెంటఉన్నారు. రఫేల్‌ కొనుగోలు ఒప్పందం కుదిరిన పది రోజులకే డసో, రిలయన్స్‌ డిఫెన్స్‌ కలసి సంయుక్త సంస్థను స్థాపించాయి. దానిపేరు-డసో రిలయన్స్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌. యుద్ధ విమానాలు, ఉపగ్రహాల తయారీలో అసలు ఏ మాత్రం అనుభవం లేని అనిల్‌ అంబానీ సంస్థకు ఉన్నపళాన వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టు లభించడం విడ్డూరం. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడానికి కొద్ది రోజుల ముందు రాహుల్‌గాంధీ ఒకే ఒక్క వ్యాపారికి లబ్ది చేకూర్చడం కోసం ప్రధానమంత్రి మోదీ రఫేల్‌ ఒప్పంద రూపురేఖల్ని మార్చేశారని ఆరోపించారు. 2018 జూలైలో మోదీ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి ముందు రఫేల్‌ విమానాల ధరపై అంత రహస్యం దేనికని రాహుల్‌ ప్రశ్నించారు. తాము 126 రఫేల్‌ ఫైటర్లను 1020 కోట్ల డాలర్లకు కొనడానికి ఒప్పందం కుదుర్చుకుంటే, మోదీ సర్కారు కేవలం 36 విమానాలకు 870 కోట్ల డాలర్లు ధారపోయడానికి సిద్ధపడిందని కాంగ్రెస్‌ తీవ్రంగా విమర్శించింది. ఈ లెక్కన ఒక్కో విమానం ధర సుమారు రూ.1,670 కోట్లుగా తేలుతుంది. కాంగ్రెస్‌ హయాములో కుదిరిన ధరకన్నా ఇది మూడు రెట్లు ఎక్కువ. ప్యారిస్‌లో మోదీ రఫేల్‌ కొనుగోలు నిర్ణయాన్ని ప్రకటించిన తరవాత భారత్‌, ఫ్రాన్స్‌ విడుదల చేసిన సంయుక్త ప్రకటన ‘గతంలో భారత వాయుసేన పరీక్షించి ఆమోదించిన నమూనాలోనే రఫేల్‌ విమానాన్నీ, దాని ఆయుధాలనూ, ఇతర అనుబంధ వ్యవస్థలనూ అందిస్తామ’ని వివరించింది. అంటే 126 విమానాల తయారీ ఒప్పందం నిర్దేశించిన రూపులోనే 36 విమానాలు అందుతాయన్నమాట. కానీ, మొదటి ఒప్పందానికీ రెండో ఒప్పందానికీ తేడాలున్నాయని తరవాత సర్కారు వివరించింది. దేశ అవసరాల కోసం ఈసారి రఫేల్‌లో ప్రత్యేక మార్పులు చేశామని చెప్పిన ప్రభుత్వం, అవేమిటో నిర్దిష్టంగా వివరించకపోవడం అయోమయానికి దారితీసింది. ఈ విషయమై కాంగ్రెస్‌ గట్టిగా నిలదీయడంతో ధర గురించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ ఒప్పందంలో భారత్‌, ఫ్రాన్స్‌ ప్రభుత్వాలు గోప్యతా పరిరక్షణ నిబంధనకు కట్టుబడినందున తానేమీ వెల్లడించజాలనని తరవాత మాట మార్చేశారు. కొత్త ఒప్పందం కింద ప్రతి రఫేల్‌ ధర రూ.670 కోట్లనీ, అనుబంధ మార్పులు చేర్పులకయ్యే ఖర్చు దీనికి అదనమని రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్‌ రామ్‌రావ్‌ భమ్రే పార్లమెంటులో ప్రకటించారు. ఆపైన కొద్ది రోజులకు ఫ్రాన్స్‌ ప్రభుత్వం రఫేల్‌ వివరాలను గోప్యంగా ఉంచాలని 2008నాటి భద్రతా ఒప్పందం నిర్దేశించిందని వెల్లడించింది. రఫేల్‌ ఫైటర్ల అసలు ధర ఎంతో చెప్పాలంటూ ఒక పౌరుడు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా, అది గుప్తంగా ఉంచాల్సిన సమాచారమనీ, దాన్ని బయటపెడితే దేశ భద్రత, ప్రయోజనాలు దెబ్బతింటాయని ప్రభుత్వం స్పష్టీకరించింది. కానీ, ఈ ఏడాది మార్చిలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మేక్రాన్‌, భారత ప్రభుత్వం రఫేల్‌ సమాచారాన్ని పార్లమెంటుతో, ప్రతిపక్షాలతో పంచుకుంటే తమకు అభ్యంతరం లేదన్నారు. అదే సంవత్సరం డసో సంస్థ తన వార్షిక నివేదికలో రఫేల్‌ ఒప్పందం మొత్తం విలువ 740 కోట్ల డాలర్లని (రూ.55,000 కోట్లని) ప్రకటించి ఊహాగానాలకు తెరదించింది.

నైపుణ్య భారతానికి నీళ్లు
మరోవైపు ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలన్‌ భారత ప్రభుత్వ సూచన మేరకే రిలయన్స్‌ను భాగస్వామిగా తీసుకున్నామని వెల్లడించారు. ఇదంతా ప్రధానమంత్రికీ, రక్షణ మంత్రికీ తెలియకుండానే జరిగిందంటే నమ్మేదెలా? ప్రధాని మోదీ ఇకనైనా పూర్తి వివరాలతో ముందుకు రావాలి. యుద్ధ విమానాల ఉత్పత్తిలో అపార అనుభవం ఉన్న హెచ్‌ఏఎల్‌ను కాదని అనుభవశూన్యమైన రిలయన్స్‌కు ఇంతటి గురుతర బాధ్యత అప్పజెప్పడమేమిటి? రక్షణ నైపుణ్యంలో మేటి అయిన హెచ్‌ఏఎల్‌ నుంచి రూ.30,000 కోట్లను దొంగిలించి విమాన తయారీలో ఏమాత్రం నైపుణ్యం లేని అనిల్‌ అంబానీకి కట్టబెట్టారని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ విరుచుకుపడ్డారు. మోదీ ఆర్భాటంగా ప్రకటించిన నైపుణ్య భారత్‌ పథకం (స్కిల్‌ ఇండియా) కాస్తా, ప్రధానమంత్రి కిల్‌ ఇండియా పథకంగా మారిపోయిందని వ్యంగ్యాస్త్రం సంధించారు. మరోవైపు లక్షలాది భారతీయ యువతను గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంత అధిక నిరుద్యోగ రేటు చుట్టుముట్టిందన్నారు. ఈ విమర్శలకు మోదీ ప్రభుత్వం నుంచి సమాధానమేదీ లేదు. సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు ఇటీవల కేంద్ర నిఘా సంఘాన్ని (సీవీసీ) కలసి ఒప్పందంలో అవినీతిపై కేసు నమోదు చేయాలని కోరారు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)నూ వారు కలిశారు. అవకతవకలను శోధించి పార్లమెంటుకు నివేదిక సమర్పించాలని కోరారు. మొత్తంమీద ఈ వివాదం రానున్న పార్లమెంటు, విధానసభల ఎన్నికలపై ప్రభావం చూపనుంది. 1980ల్లో బోఫోర్స్‌ కుంభకోణం రాహుల్‌ తండ్రి రాజీవ్‌గాంధీ పాలనను అంతం చేసింది. ఈసారి రఫేల్‌ కూడా అలాంటి సంచలనాత్మక పరిణామానికి దారితీయబోతున్నదా అనే ప్రశ్న అందరి నోటా వినిపిస్తోంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *