కాల్‌ డేటాయే ఆధారం…!


విశాఖ మన్యంలోని డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టులో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన రోజునే సర్కారు సిట్‌ వేసింది. హత్యలకు కారణం ఏమిటి.. హత్యలో పాల్గొన్న మావోయిస్టులు ఎవరు.. వీరిని హతమార్చడానికి ఎన్ని రోజుల నుంచి ప్రణాళిక వేసుకున్నారు.. వారికి స్థానికంగా సహకరించిందెవరు..నిఘా వైఫల్యం ఇతరత్రా కోణాల్లో సిట్‌ బృందం దర్యాప్తు చేయాల్సి ఉంది. డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ కూడా జిల్లాలోనే మూడు రోజులు పాటు ఉంటూ దర్యాప్తు బృందానికి సూచనలు చేశారు.హత్య జరిగిన రెండు మూడు రోజుల వరకు మావోల నుంచి ఏమైనా లేఖ రూపంలో సమాచారం వస్తుందేమోనని వేచిచూశారు. వారం రోజులయినా మావోలు లేఖ విడుదల చేయకపోవడంతో పోలీసులు తమశైలిలో విచారణ మొదలుపెట్టారు. అసలు మావోయిస్టులు నేతలను హత్య చేయడానికి కారణం ఏమై ఉంటుందో ఓ అంచనాకు వచ్చారు. ఈ ఇద్దరు నేతలు పాల్గొనే ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల వివరాలు, వారి కదలికలను ఎప్పటికప్పుడు మావోయిస్టులకు తెలియడంతోనే సులువుగా ఈ హత్యలు చేసి వెళ్లిపోయినట్లు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ నేతల కదలికల సమాచారాన్ని మావోయిస్టులకు చేరవేసింది ఎవరన్నదే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులను విచారించినా, మరికొందరిన అదుపులోకి తీసుకుని ప్రశ్నించినా వారి నుంచి సరైన సమాచారం రావడం లేదు. దీంతో పోలీసులు అనుమానితుల ఫోన్‌ కాల్స్‌పై దృష్టిపెట్టి దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఫోన్లపై నిఘా.. : లివిటిపుట్టు వద్ద నేతలను తుపాకీలతో కాల్చి హతమార్చిన తరవాత వారి దగ్గరున్న ఫోన్‌లను మావోయిస్టులు వెంటపట్టుకుని పోయారు. అంతకు ముందే నేతలతో మావోయిస్టులు మాట్లాడి వారి నుంచి వ్యాపార, రాజకీయపరమైన వ్యవహారాలు, ఆర్థిక పరమైన వివరాలను తెలుసుకుని, ఎందుకు చంపుతున్నదీ మావోలు రికార్డు.

చేసినట్లు తెలిసింది. నేతలను చంపి కొద్ది దూరం వెళ్లిన తరవాత మరలా వచ్చి వారి సెల్‌ఫోన్లను తీసుకుని వెళ్లిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కనీసం నేతల సెల్‌ఫోన్లు ఉన్నా తదుపరి విచారణలో పోలీసులకు కొంత సమాచారం వచ్చేది. మావోలు ఆ అవకాశం కూడా పోలీసులకు ఇవ్వలేదు. దీంతో సిట్‌ అధికారులు మావోలు నేతల ఫోన్లను ఎందుకు పట్టుకువెళ్లారు అందులో ఏమైనా విలువైన సమాచారం ఏదైనా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి ఫోన్‌లు లేకున్నా ఫర్వాలేదు.. వారితో తరచూ వ్యాపార, రాజకీయాలపై మాట్లాడేవారి ఫోన్లపై నిఘా పెట్టాలని నిర్ణయించారు. అందుకే ఘటన జరిగిన మూడో రోజు నుంచి విచారణ పేరుతో అనుమానితులను తీసుకువచ్చి వారు ఉపయోగించే ఫోన్‌ నంబర్లు, ఇతర మాధ్యమాల గురించి గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తున్నారు. ఫోన్‌ నంబర్లు, మెయిల్‌ ఐడీలు సేకరిస్తున్నారు. రెండు మూడు నెలలుగా ఈ ఫోన్ల నుంచి ఎమ్మెల్యేతో పాటు ఎవరెవరికి కాల్స్‌ చేసింది తెలుసుకోవాలని భావిస్తున్నారు. వాటి ఆధారంగానే మావోలకు నేతల కదలికల సమాచారం ఎలా చేరిందో తేల్చనున్నారు.

విచారణ ముమ్మరం : నేతల వ్యాపార లావాదేవీలు.. భూముల వ్యవహారాలు.. రాజకీయ మార్పులపై మావోలకు తెలిసినవారి నుంచే సమాచారం వెళ్లిందనే పూర్తి నిర్ధారణకు వచ్చారు. అందుకే మూడు రోజుల నుంచి అనుమానితుల విచారణను ముమ్మరం చేశారు. వీరిలో ఎక్కువగా కిడారితో సత్సంబంధాలున్న మండల, గ్రామస్థాయి నాయకులున్నారు. కొంతమంది బయట ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారాలు చేస్తున్నవారు ఉన్నారు. వీరందరినీ ఒక్కొక్కరిగా పిలిచి మూడు నుంచి నాలుగు గంటల పాటు స్టేషన్‌తో పాటు విశాఖపట్నానికి తరలించి విచారణ చేస్తున్నారు. డుంబ్రిగుడకు సమీపంలో అంత్రిగుడ అనే పీవీటీజీ గ్రామం నుంచి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా అందులో ఇద్దరి ఉప ఎంపీపీ పూచీకత్తుతో విడిచిపెట్టారు. అవసరమైనప్పుడు పిలుస్తాం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గెమ్మిలి శోభన్‌ అనే వ్యక్తిని మాత్రం నాలుగు రోజులుగా పోలీసులు అదుపులోనే ఉన్నాడు. అతడిని విడిచిపెట్టలేదు. శని, ఆదివారాల్లో మండలంలోని తెదేపా నేతల కొందరు, స్థానిక వ్యాపారులను విచారించారు. వీరితో పాటు ఆ రోజు ఎమ్మెల్యే వాహనం వెనుక వెళ్తున్న విలేకరులను విచారణ చేస్తున్నారు. ఫోన్లు, కెమెరాలను పరిశీలించి కుటుంబ వ్యవహారాల గురించి, ఎమ్మెల్యేతో ఉన్న సంబంధాలు.. ఘటన తరవాత ఎవరెవరికీ ఫోన్‌చేసింది తదితర సమగ్ర సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ ఘటనకు సహకరించిన వారిని అరెస్టు చూపించడానికి పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *