పీఎన్‌బీని వదలని నష్టాలు…!

దిల్లీ: దేశీయ రెండో అతిపెద్ద బ్యాంకు అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను నష్టాలు వదిలిపెట్టడం లేదు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆ బ్యాంకు భారీగా నష్టాలను చవి చూసింది. జూన్‌ 30తో ముగిసిన 2018-19 తొలి త్రైమాసికంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రూ.940కోట్ల నష్టాలను తన ఖాతాలో వేసుకుంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో పీఎన్‌బీ నికర లాభం కేవలం రూ.343.40కోట్లు మాత్రమే. ఇక మొత్తం ఆదాయం రూ.15,072కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది పీఎన్‌బీ ఆదాయం రూ.14,468.14గా ఉంది.

ఇక పీఎన్‌బీ మొండి బకాయిలు 18.26శాతం పెరిగినట్లు ఆ బ్యాంకు ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రూ.13వేల కోట్లకు పైగా కుంభకోణం కారణంగా ఆ బ్యాంకు గతేడాది ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలోనూ రూ.13,416కోట్ల భారీ నష్టాన్ని నమోదు చేసింది. ఒక త్రైమాసికంలో బ్యాంక్‌ నమోదు చేసిన అతిపెద్ద నష్టం ఇదే.

పీఎన్‌బీ కుంభకోణంలో ప్రధాన నిందితులైన నీరవ్‌ మోదీ, మోహుల్‌ ఛోక్సీలు తప్పుడు ఎల్‌వోయూలతో నగదును మళ్లించిన విషయం తెలిసిందే. వీటిని ఉపయోగించుకుని ఇతర బ్యాంకుల్లోని విదేశీ శాఖల నుంచి నగదును తీసుకున్నారు. దీంతో పీఎన్‌బీ ఏడు బ్యాంకులకు రూ.6500కోట్ల వరకు చెల్లించాల్సి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *