పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2.50 తగ్గింపు కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ


దిల్లీ: భారీగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సతమవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఇందులో భాగంగా పెట్రోల్‌, డీజిల్‌లపై ఎక్సైజ్‌ సుంకాన్ని రూ.2.50 తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ గురువారం ప్రకటించారు. రోజూ భారీగా పెరుగుతున్న చమురు ధరల నియంత్రణకు చర్యలు తీసుకునేందుకు సంబంధిత మంత్రులతో గురువారం సమావేశం జరిగింది.

సమావేశం అనంతరం జైట్లీ మాట్లాడుతూ…‘పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ప్రజల మీద అత్యధిక భారం పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2.50 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించేలా ఈ సమావేశంలో తీర్మానించాం. ఈ సుంకంలో కేంద్రం రూ.1.5, ఆయిల్‌ కంపెనీలు రూ.1 తగ్గించనున్నాయి. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ గాడిలోనే ఉంది. ప్రజలు తమ సంపాదనను కేవలం వీటిమీదే కాకుండా ఇతర నిత్యావసరాలపైనా వెచ్చించాలన్నదే మా ఉద్దేశం. ద్రవ్యోల్బణం ప్రస్తుతం 4 శాతంలోపే ఉంది. దాన్ని తగ్గించే పనిలో ఉన్నాం. అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు పెరుగుతుండటమే ఇందుకు కారణం. గతంలో కూడా ఇలా ధరలు పెరిగినప్పుడు రూ. 2 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాం. దేశంలోని చమురు, మార్కెట్‌ కంపెనీలన్నీ ఈ తగ్గించిన సుంకాన్ని భరించే స్థాయిలోనే ఉన్నాయి. రాష్ట్రాలు కూడా రూ.2.50 వరకూ తగ్గిస్తే, ప్రజలకు మొత్తం రూ.5వరకూ ప్రయోజనం చేకూరుతుంది. ప్రతి రాష్ట్రం దీన్ని అమలు చేయాల్సిందిగా లేఖలు రాస్తాం. పెట్రోల్‌, డీజిల్‌పై తాజా తగ్గింపుతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై రూ.10వేల కోట్ల పైనే అదనపు భారం పడుతుంది.’ అని తెలిపారు.

ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందిస్తూ… ‘పెట్రోల్‌ ధరలు పెరిగిన ప్రతిసారీ వాటిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. గతంలోనూ ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు రూ.2 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించాం. ఇప్పుడూ అదే పనిచేశాం. ప్రజల జేబుల్లో డబ్బంతా పెట్రోల్‌, డీజిల్‌లకే ఖర్చు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ధరలను కట్టుదిట్టం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. మా చర్యలను తప్పు బట్టే అర్హత కాంగ్రెస్‌కు లేదు’ అంటూ మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *