పర్మిట్‌రూంల ఎత్తివేత..!

నూతన ఆబ్కారీ విధానానికి రూపకల్పన
కొత్త దుకాణాలకు అనుమతి లేనట్లే
లైసెన్సు ఫీజులో స్వల్ప పెరుగుదల!

 

హైదరాబాద్‌: మరో మూడు నెలల్లో రాష్ట్రంలో అమల్లోకి రానున్న కొత్త ఆబ్కారీ విధానంపై అధికారుల కసరత్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న మందు గదులను (పర్మిట్‌ రూంలు) ఎత్తివేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే లైసెన్సు ఫీజులో స్వల్ప పెరుగుదల ఉండవచ్చని తెలుస్తోంది. ఇది మినహా కొత్త ఆబ్కారీ విధానంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. రెండేళ్ల కాలానికిగాను 2017 అక్టోబరు 1 నుంచి అమలులోకి వచ్చిన ఆబ్కారీ విధానం గడువు సెప్టెంబరు 31తో పూర్తి కానుంది. అక్టోబరు నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుంది. దీనికి సంబందించి అధికారులు విధివిధానాలు రూపొందిస్తున్నారు. పర్మిట్‌రూంల పేరుతో మద్యం దుకాణాల వద్దే తాగే అవకాశం ఇవ్వడంతో అనేక రకాల సామాజిక సమస్యలు వస్తున్నాయి. చీకటిపడిందంటే చాలు ఈ దుకాణాల వద్ద భారీ రద్దీ కన్పిస్తోంది. ముఖ్యంగా జనావాస ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. అందుకే పర్మిట్‌రూంలను ఎత్తివేయాలని చాలాకాలంగా పలు ప్రాంతాల్లోని ప్రజలు కోరుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త ఆబ్కారీ విధానంలో వీటిని రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్త దుకాణాలకు అనుమతి ఇవ్వకపోవచ్చని, లైసెన్సు ఫీజులో స్వల్ప పెరుగుదల ఉండవచ్చని సమాచారం.

* రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల సంఖ్య : 2,216
* లైసెన్సు రుసుంల రూపంలో వసూలైన మొత్తం : రూ. 1,360 కోట్లు
* 50 వేల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో మద్యం దుకాణాల లైసెన్సు రుసుం : రూ. 45 లక్షలు
* 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో లైసెన్సు రుసుం : రూ. 55 లక్షలు
* 5 నుంచి 20 లక్షల జనాభా ఉన్న నగరాల్లో లైసెన్సు రుసుం : రూ. 85 లక్షలు
* 20 లక్షల జనాభా దాటిన నగరాల్లో లైసెన్సు రుసుం : రూ. 1.1 కోట్లు (లైసెన్సు ఫీజు రెండు సంవత్సరాల కాలానికి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *