ఈ ఓటమి ఒక అనుభవం…

రాజకీయ వ్యవహారాలపై త్వరలో నూతన కమిటీ
సెప్టెంబరు నుంచి పార్టీ పక్ష పత్రిక : పవన్‌కల్యాణ్‌


అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఫలితాన్ని ఓటమిగా కాక ఒక అనుభవంగా తీసుకుంటున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ చెప్పారు. నాలుగేళ్ల పార్టీకి ఇన్ని లక్షల ఓట్లు రావడాన్ని ఒక విజయంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. జనసేనను ఎదగనివ్వకూడదని కొన్ని బలీయమైన శక్తులు పని చేయడంతో ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు చూడాల్సి వచ్చిందన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో మాట్లాడారు. తన తుది శ్వాస వరకు పార్టీని ముందుకు నడిపిస్తానని ఈ సందర్భంగా పవన్‌ స్పష్టం చేశారు. తాను పోటీ చేసిన రెండు చోట్లా సమయాభావం వల్ల పూర్తి స్థాయిలో ఓటర్లను కలుసుకోలేకపోయినట్లు చెప్పారు.

ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన.. ప్రస్తుత రాజకీయ వ్యవహారాల కమిటీ గడువు ముగిసిందని, త్వరలో నూతన కమిటీని ఏర్పాటు చేస్తామని పవన్‌ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ భావజాలం, నిర్ణయాలను కార్యకర్తలకు చేరవేసేందుకు జనసేన పార్టీ పక్ష పత్రికను తీసుకు వస్తున్నట్లు పవన్‌ వెల్లడించారు. దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబరులో పత్రిక తొలి సంచిక విడుదలవుతుందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు మాదాసు గంగాధరం, పి.రామ్మోహన్‌రావు, తోట చంద్రశేఖర్‌, ముత్తంశెట్టి కృష్ణారావు, చింతల పార్థసారథి, మహేందర్‌రెడ్డి, హరిప్రసాద్‌ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో గురువారం రాత్రి పవన్‌కల్యాణ్‌ సమావేశమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *