గొల్లుమంది గ్లాస్‌ ఒక్క రాజోలులోనే బోణీ….

2 చోట్లా పవన్‌కల్యాణ్‌ పరాజయం…

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో జనసేన మూడో ప్రత్యామ్నాయంగా రంగంలోకి దిగినా ఓటర్లను ఆకట్టుకోలేకపోయింది. తూర్పుగోదావరి జిల్లా రాజోలులో ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్‌ ఒక్కరే గెలుపొందారు. పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పరాజయం పొందారు. రాష్ట్రంలో ఓటర్లు ఏకపక్షంగా వైకాపాకు పట్టం కట్టడం, ఈ ఎన్నికల్లో జనసేనను ఒక ప్రత్యామ్నాయ పార్టీగా గుర్తించలేకపోవడం ఈ స్థాయి ఓటమికి కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

‘25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం కోసమే వచ్చాను. నేను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినా, పార్టీ అభ్యర్థులు చాలా మంది ఓటమి పాలైనా తుది శ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటాను. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతూనే ఉంటాను. సారా పోయకుండా, ఓట్ల కోసం డబ్బులు పంచి పెట్టకుండా ఎన్నికల్లో పాల్గొన్నాం. ఎన్నికల్లో బలమైన గెలుపు సాధించిన జగన్‌ మోహన్‌రెడ్డికి, కేంద్రంలో మళ్లీ గెలిచిన నరేంద్రమోదీకి నా అభినందనలు.’

– పవన్‌కల్యాణ్‌
జనసేన పోటీ చేసిన స్థానాలు : 138 (మరో రెండుచోట్ల నామినేషన్లు తిరస్కరించారు)

సీపీఐ, సీపీఎం, బీఎస్పీలు పోటీ చేసిన స్థానాలు 35

అంచనాలు తలకిందులు
జనసేనకు పట్టుంటుందని భావించిన పశ్చిమగోదావరి జిల్లాలో సాక్షాత్తూ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఓడిపోయారు. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో పవన్‌ రెండోస్థానంలో నిలిచారు. పవన్‌కల్యాణ్‌ ఏ రోజు తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అంచనాలు వెల్లడించలేదు. పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు జనసేనకు 15 స్థానాల వరకు రావొచ్చని అంతర్గత అంచనాల్లో పేర్కొంటూ వచ్చారు. ఫలితాల్లో వీరి అంచనాలన్నీ తలకిందులయ్యాయి.

కారణాలు ఏమిటి?
* 2014లో పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీని ఏర్పాటు చేసి నాటి ఎన్నికల్లో భాజపా, తెదేపాకు మద్దతు ఇచ్చి ప్రచారం చేశారు. అనంతర కాలంలో ఆయన రాష్ట్రంలో పార్టీ నిర్మాణంపై ఎలాంటి దృష్టి పెట్టలేదు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 5 ఏళ్ల పాటు సమయం చిక్కినా నియోజకవర్గాల వారీగా, జిల్లా వారీగా పార్టీ కమిటీలు ఏర్పాటు కాలేదు. సంస్థాగతంగాను పార్టీని ఏ రకంగాను బలోపేతం చేయలేదు.
* జనసేనకు ఓటు వేస్తే అది వేరే పార్టీకి ఉపకరిస్తుందనే అభిప్రాయం కూడా జనంలో కలగడంతో ఈ పార్టీకి విస్తృతస్థాయిలో మద్దతు లభించలేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనసేన తెలుగుదేశం పార్టీకి బి టీమ్‌ అన్న విషయాన్ని వైకాపా బలంగా ఓటర్లలోకి తీసుకువెళ్లగలగడమూ మరో కారణం.
* నిర్దుష్ట ప్రణాళిక, కార్యక్రమాలు, విధానాలు లేకపోవడమూ జనసేనకు నష్టం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వామప క్షాలతో, బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నా ఈ నిర్ణయాలన్నీ ఆలస్యంగా జరిగాయి.

ప్రజారాజ్యం కన్నా తీసికట్టుగా
తాజా ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీపై ప్రజారాజ్యం తాలూకు నీలినీడలు కనిపించాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీ 18 స్థానాల్లో గెలవడం, అనంతరం ఆ పార్టీని కాంగ్రెస్‌లో కలిపివేయడంతో ఓటర్లలో ఇంకా ఆ జ్ఞాపకాలు చెదిరిపోలేదు. ఆ ప్రభావం జనసేనపై కనిపించిందని చెప్పవచ్చు. 2009లో ప్రజారాజ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 18 స్థానాలు గెలిచింది. తెలంగాణను మినహాయించి మిగిలిన ఆంధ్రప్రదేశ్‌ను పరిగణిస్తే 16 స్థానాల్లో ప్రజారాజ్యం గెలిచింది. ప్రస్తుత ఫలితాల్లో జనసేన ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోవడాన్ని ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *