పశ్చిమ నుంచే పవన్‌ పోటీ చేస్తారా…?


ఏలూరు: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే చర్చ పశ్చిమ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. పవన్‌కల్యాణ్‌ ఏలూరులో ఓటు హక్కు పొందడంతో అభిమానులు, ఆ పార్టీ నాయకుల్లో ఈ చర్చ మొదలైంది. గతంలో ఏలూరు పోస్టల్‌ కాలనీలో ఓ ఇల్లును పవన్‌ పేరిట నాయకులు అద్దెకు తీసుకున్నారు. అదే ఇంటి చిరునామాతో ఓటుహక్కు పొందారు. పవన్‌ పశ్చిమ నుంచి పోటీ చేస్తారా.. చేస్తే ఏ నియోజకవర్గం నుంచి చేయవచ్చు వంటి ఊహజనిత అంశాలు తెరమీదకి రావడానికి ఆయన గతనెల 27న భీమవరంలో జరిగిన పోరాట యాత్ర బహిరంగ సభ ప్రసంగ పాఠం కొంతవరకు దోహదకారిగా చెప్పవచ్చు.

ఆయన ఏమన్నారంటే…‘మా తాత పెనుగొండలో పోస్టుమేన్‌గా పనిచేశారు. మా నాన్న మొగల్తూరులో కానిస్టేబుల్‌గా పనిచేశారు. మా నాన్న మాకున్న రెండెకరాల భూమిని ఆడపిల్లల పెళ్లిళ్లకోసం అమ్మేశారు. ఆ భూమి ఉంటే ఇక్కడే ఉండిపోయేవాడిని. మా పూర్వీకులు ఇక్కడే నివసించినా.. నేనున్నది తక్కువ. చిన్నప్పుడు రెండు సార్లు వచ్చా. నరసాపురంలో తప్పిపోయా. అప్పట్లో కానిస్టేబుల్‌ రక్షించి మా నాన్నకు అప్పగించారు. మొగల్తూరులో చెట్టెక్కి జామకాయలు కోసిన తీపి జ్ఞాపకం గుర్తుందీ. ఈ పచ్చని జిల్లాను చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తోంది. మా పూర్వీకుల మూలాలున్న ప్రాంతంగా ఈ జిల్లా అంటే ఎంతో అభిమానం. జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటా’ అని పశ్చిమగోదావరి జిల్లా గురించి తన అభిమానాన్ని చాటుకున్నారు.

దాంతో పవన్‌ ఈ జిల్లా నుంచి పోటీ చేస్తారని ఆయన అభిమానులు, ఆపార్టీ నేతలు ఊహగానాలు, విశ్లేషణలు చేస్తున్నారు. ఎవరికి వారు మాదగ్గర పోటీ చేస్తారంటే మా దగ్గర చేస్తారని విశ్లేషిస్తున్నారు. ఈ విశ్లేషణలకు మద్దతుగా అనేక సమీకరణాలు చెబుతూ వారి వాదనలను సమర్థించుకుంటున్నారు. అలాగే ఏడాది కిందట ఏలూరు వచ్చినప్పుడు ఈ జిల్లాలోనే ఓటుహక్కు నమోదు చేయించుకుంటానని చెప్పారు. ఈ క్రమంలో ఏలూరు నగరంలోని పోస్టల్‌ కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అదే ఇంటి నంబరు చిరునామాతో పవన్‌కు ఓటుహక్కు నమోదు చేశారు. గత నెలలో ఓటరు గుర్తింపు కార్డు వచ్చింది. ఈ నేపథ్యంలో తన సొంత జిల్లా కేంద్రం అయిన ఏలూరు నుంచి పోటీ చేయాలని ఇక్కడి అభిమానులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని ఆ పార్టీ నాయకులు పవన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా చెబుతున్నారు.

రాష్ట్రంలోని 175 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీచేస్తారని పవన్‌ కల్యాణ్‌ పలు సందర్భాల్లో ప్రకటించారు. దానికనుగుణంగానే పలు నియోజకవర్గాల నుంచి నాయకులను ఆహ్వానించడం వంటివి ఇటీవల కాలంలో జోరందుకున్నాయి. ఆయన పూర్వీకులు మొగల్తూరులో నివసించారు. మొగల్తూరు నరసాపురం నియోజకవర్గం పరిధిలో ఉంది. పవన్‌కల్యాణ్‌ మా ప్రాంతవాసే అనే అభిప్రాయం అక్కడ స్థానికుల్లో ఉంది. దాంతో అక్కడి నుంచే పోటీ చేయించాలని మరికొంతమంది అభిప్రాయం. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ అధినేత చిరంజీవి పాలకొల్లు నుంచి పోటీ చేసి ఓటమి పొందారు. అదే స్థానం నుంచి పవన్‌ కల్యాణ్‌ను పోటీ చేయించి గెలిపించి తీరాలనే కసితో ఉన్నామని పాలకొల్లు ప్రాంత నాయకులు చెబుతున్నారు. పవన్‌ కల్యాణ్‌కు అండగా ఉండే వర్గం ఓటర్లు ఉన్న ప్రాంతం కావడంతో ఈ జిల్లాలో ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుపు ఖాయమనే భావనలో ఆ నాయకులు ఉన్నారు. పవన్‌కల్యాణ్‌ అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు ప్రకటించారు. ఇటీవల ఏలూరులో ఓటుహక్కు నమోదు చేయించుకోవడంతో ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎన్నికలకు గడువు ఇంకా చాలా ఉన్న నేపథ్యంలో అప్పటి రాజకీయ సమీకరణాలను బట్టి అధినేత అంతరంగాన్ని బట్టి అంతిమ నిర్ణయం ఉంటుందని వారిలో వారే సమాధాన పరచుకుంటున్నారు. సర్ది చెప్పుకుంటున్నారు. మొత్తం మీద పవన్‌ కల్యాణ్‌పోటీ ఎక్కడనే అంశంపై రసవత్తర చర్చ సాగుతోంది. ఇతర పార్టీలవారు కూడా ఈ అంశంపై ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *