ఎన్టీఆర్‌ కోసం ప్రైవేట్‌ జెట్‌లో పూజా హెగ్డే…


హైదరాబాద్‌: ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కథానాయిక పూజా హెగ్డే ‘దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమాతో మంచి బ్రేక్ అందుకున్నారు. ఆమె ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా గడుపుతున్నారు. ‘అరవింద సమేత’, ‘మహర్షి’ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రభాస్‌- రాధాకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలోనూ ఛాన్స్‌ దక్కించుకున్నారు. బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌ సరసన ‘హౌస్‌ఫుల్‌ 4’ సినిమాలోనూ నటిస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో పూజా హెగ్డే కాల్‌షీట్‌‌ నిండిపోయింది.

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. హరికృష్ణ హఠాన్మరణంతో కొన్ని రోజులు ఈ చిత్రం షూటింగ్‌ వాయిదా పడింది. దీంతో అప్పుడు తీయాల్సిన సన్నివేశాల్ని ఇప్పుడు తీస్తున్నారు. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ప్రస్తుతం పూజా హెగ్డే ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. షూట్‌ వాయిదా పడటంతో ఆమె తన డేట్స్‌ను కష్టపడి మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఓ పక్క ఇక్కడ షూట్‌లో పాల్గొంటూనే.. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరుగుతోన్న ‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్రీకరణ‌కు కూడా హాజరౌతున్నారట. దీని కోసం ఆమె ప్రైవేట్‌ జెట్‌లో ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌ నుంచి జైసల్మేర్‌కు కేవలం ఒక్క విమానం మాత్రమే ఉందని, అందులో వెళ్లాలంటే చాలా సమయం పడుతుందని ప్రైవేట్‌ జెట్‌లో వెళ్తున్నట్లు చెబుతున్నారు. రాజస్థాన్‌‌ మిలిటరీ ఏరియా కావడంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో ఎటువంటి ప్రైవేట్‌ జెట్‌ను అనుమతించరు. కానీ పూజా హెగ్డే మేనేజర్‌, నిర్మాతలు అనుమతి తీసుకున్నట్లు సమాచారం. ప్రైవేట్‌ జెట్‌లో ప్రయాణించేందుకు లక్షల్లో ఖర్చు అవుతుంది, కానీ డబ్బు కన్నా సమయానికి సెట్‌కు చేరుకోవడానికే పూజా హెగ్డే ప్రాధాన్యత ఇస్తున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *