భారీ వర్షాలతో కృష్ణా జిల్లా అతలాకుతలం…


విజయవాడ: భారీ వర్షాలతో కృష్ణా జిల్లా అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపి లేని వర్షాలతో ఊరూ వాడా అన్న తేడా లేకుండా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. రహదారులు సైతం చెరువులను తలపిస్తుండటంతో చాలా ప్రాంతాల మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి.

విజయవాడ నగరంలోని వన్‌టౌన్‌ ప్రాంతంలో లోతట్టు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇళ్లల్లోకి నీరు చేరింది. దీంతో రోటరీనగర్‌ ప్రాంతంలో ప్రజలు రాత్రంతా నివాసాల్లోనే జాగరణ చేశారు. పరిస్థితిని నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో కమిషనర్‌ నివాస్‌ తమ సిబ్బందితో కలిసి ఈరోజు ఉదయం కాలనీని సందర్శించారు. అగ్నిమాపక యంత్రాల సహాయంతో నీటిని బయటకు తోడేస్తున్నారు. నివాసాలు, ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా సత్వర చర్యలు చేపట్టారు. ఆటోనగర్ సమీపంలోని ఏపిఐఐసీ కాలనీలో పరిస్థితి దారుణంగా ఉంది. కాలనీ మొత్తం నీట మునిగి జలాశయాన్ని తలపిస్తోంది.

భారీ వర్షాల కారణంగా కంచికచర్ల మండల పరిధిలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏనుగుగడ్డ వాగు, నక్కలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఏనుగుగడ్డ వాగు ప్రవాహం అధికంగా ఉంది. దీనివల్ల మొగులూరు, మున్నలూరు, అమరావరం తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. ఒకవైపు నుంచి మరొకవైపు రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నూజివీడులో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాలు వర్షపు నీటిలో మునిగాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వరద నీరు రహదారులపైకి చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

మైలవరం నియోజకవర్గంలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. నియోజకవర్గంలో కొన్ని చోట్ల రహదారులపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చందాపురం వద్ద నల్ల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెనపై నుంచి రెండు అడుగులమేర నీరు ప్రవహిస్తుండటంతో నందిగామ-చందర్లపాడు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కట్లేరు, వైరా, మున్నేరు వాగులు పొంగి ప్రవహించడంతో వీర్లపాడు- దొడ్డేదేవరాపాడు, పల్లెంపల్లి -దామలూరుల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కాజ్ వేపై భారీగా వరద నీరు చేరడంతో నందిగామ, వీర్లపాడు మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *