ఈ జోరు సాగనీ.. ఆత్మవిశ్వాసంతో కోహ్లీసేన…

ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు నేటి నుంచే
మధ్యాహ్నం 3.30 సోనీ సిక్స్‌, సోనీ టెన్‌-3లో..
సౌథాంప్టన్‌

వరుసగా రెండు పరాజయాలు.. అందులోనూ లార్డ్స్‌లో దారుణమైన పరాభవం.. ఈ స్థితిలో టీమ్‌ఇండియా పుంజుకుంటుందని ఎవ్వరూ అనుకోలేదు! మరో ఓటమి ఖాయమని, సిరీస్‌పై ఆశలు నిలిచే అవకాశమే లేదన్న నిర్ణయానికి వచ్చేశారు! ఇలాంటి స్థితిలో కోహ్లీసేన అద్భుతమే చేసింది. నాటింగ్‌హామ్‌ టెస్టులో గొప్పగా పుంజుకుంది. అన్ని రంగాల్లో రాణిస్తూ, ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ ఇంగ్లాండ్‌ను చిత్తుగా ఓడించింది. మళ్లీ అభిమానుల నమ్మకాన్ని గెలుచుకుంది.

ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు నాలుగో టెస్టులో బరిలోకి దిగుతోంది. జోరు కొనసాగిస్తూ ఈ మ్యాచ్‌లో మరో విజయం సాధించి, ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో సమం చేయాలన్న పట్టుదలతో కోహ్లీసేన బరిలోకి దిగుతోంది. గురువారమే మ్యాచ్‌ ఆరంభం. విజయోత్సాహంలో ఉన్న భారత్‌.. గత మ్యాచ్‌ జట్టునే సౌథాంప్టన్‌లోనూ కొనసాగించే అవకాశాలున్నాయి. మరోవైపు ఇంగ్లాండ్‌ మాత్రం రెండు మార్పులతో బరిలోకి దిగనుంది.

గత రెండు టెస్టుల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన యువ ఆటగాడు పోప్‌పై వేటు పడనుంది. మరోవైపు ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ గాయపడ్డాడు. వీరి స్థానాల్లో ఆల్‌రౌండర్లు సామ్‌ కరన్‌, మొయిన్‌ అలీలను జట్టులోకి తీసుకోనుంది. సౌథాంప్టన్‌లో వాతావరణం పొడిగా ఉండటం, పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించవచ్చన అంచనాలుండటంతో ఇప్పటికే జట్టులో కొనసాగుతున్న రషీద్‌తో పాటు మొయిన్‌ అలీలతో ఆతిథ్య జట్టు స్పిన్‌ దాడి చేయనుంది.

తొలి రెండు టెస్టుల్లో సత్తా చాటినప్పటికీ కరన్‌ను మూడో టెస్టుకు పక్కన పెట్టిన ఇంగ్లాండ్‌.. ఈ మ్యాచ్‌కు మళ్లీ తుది జట్టులోకి తీసుకోనుంది. ఇక పిచ్‌ స్పిన్నర్లకు సహకరించేలా ఉన్నప్పటికీ భారత్‌ అశ్విన్‌ ఒక్కడినే ఆడించనుంది. గెలుపు జట్టును మార్చాలని భారత్‌ భావించట్లేదు. ప్రధానంగా బ్యాటింగ్‌ వైఫల్యంతోనే తొలి రెండు టెస్టుల్లో పరాజయాలు చవిచూసిన టీమ్‌ఇండియా.. మూడో టెస్టులో బ్యాట్స్‌మెన్‌ సత్తా చాటడంతో విజయావకాశాలు సృష్టించుకుంది.

ముఖ్యంగా కోహ్లి రెచ్చిపోయాడు. అతను మరోసారి సత్తా చాటి, మిగతా బ్యాట్స్‌మెన్‌ అతడికి సహకారమందిస్తే భారత్‌ ఖాతాలో మరో గెలుపు జమ కావచ్చు. బుమ్రా రాకతో భారత బౌలింగ్‌ బలోపేతమైంది. మరోవైపు నాటింగ్‌హామ్‌ ఓటమి తర్వాత ఇంగ్లాండ్‌ పుంజుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. కాబట్టి కోహ్లీసేన అప్రమత్తంగా ఉండాల్సిందే.
6
కోహ్లి టెస్టుల్లో 6 వేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి చేయాల్సిన పరుగులు. అతను మరో 104 పరుగులు సాధిస్తే.. కెప్టెన్‌గా 4 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *