కిషోర చాణక్యం….

ఫ్యానుగాలి వేగంలో ప్రశాంత్‌కిషోర్‌ వ్యూహాలు
జగన్‌కు రెండేళ్లుగా వెన్నుదన్ను
2017, జులై..
గుంటూరులో వైకాపా ప్లీనరీ రెండో రోజు..
రాజకీయ తీర్మానాలు ప్రవేశపెడుతున్న తరుణం..

సభలో కూర్చున్న ఓ వ్యక్తిని వైకాపా అధినేత జగన్‌ స్టేజీపైకి పిలిచారు. ‘ఈయన పేరు ప్రశాంత్‌కిషోర్‌(పీకే).. మన పార్టీకి వ్యూహకర్త’ అని ప్రకటించారు. అప్పటివరకు శ్రేణులకు పెద్దగా పరిచయం లేని ఆ పేరు ఒక్కసారిగా మార్మోగింది. వైకాపాకు దశాదిశా నిర్దేశం చేసే బ్రహ్మాస్త్రమైంది. తన రాజకీయ వ్యూహ చాతుర్యంతో జగన్‌ను జనసమ్మోహితుడిగా మార్చేశారు పీకే. రెండేళ్లుగా వైకాపా వేసిన ప్రతి అడుగులో వెన్నుదన్నుగా నిలిచారు. నిజానికి పీకేను పరిచయం చేసిన సందర్భంలోనే పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడాలని జగన్‌ కోరినా.. ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ తర్వాత మాట్లాడతానని ప్రకటించారు. ఆ తర్వాత కూడా పార్టీ వేదికలపై ఎప్పుడూ మాట్లాడకపోయినా తెర వెనుక పీకే వ్యూహాలు విజయనినాదమై ప్రతిధ్వనించాయి.

‘రావాలి జగన్‌ కావాలి జగన్‌’ పాట రూపకల్పనలో కీలకంగా వ్యవహరించి విస్తృత ప్రచారం చేశారు. యూట్యూబ్‌లో ఈ పాటకు 2కోట్లకుపైగా వ్యూస్‌ వచ్చాయంటే ప్రచార విస్తృతిని తెలియజేస్తుంది.

గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేసిన వారికి ‘జగన్‌ అన్న పిలుపు’ పేరిట ఉత్తరాలు పంపించి జగన్‌తో భేటీలు ఏర్పాటు చేయించారు. వీరు క్షేత్రస్థాయిలో వైకాపాకు ఓటేసేలా ప్రభావితం చేయగలిగారు.

నిన్ను నమ్మం బాబు.. బైబై బాబు అంటూ చంద్రబాబుపై కార్యక్రమాలు చేయించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయించారు

అమరావతి: బిహార్‌లోని బక్సర్‌ ప్రాంతంలో సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ప్రశాంత్‌కిషోర్‌ మొదటిసారిగా 2011లో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. తొలుత ప్రజారోగ్య విభాగంలో శిక్షణ పొంది ఎనిమిదేళ్లపాటు ఐక్యరాజ్య సమితిలో పనిచేశారు. 2013లో సిటిజన్స్‌ ఫర్‌ అకౌంటబుల్‌ గవర్నెన్స్‌ (కాగ్‌) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేశారు. 2015లో దాన్ని ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ (ఐ-పాక్‌)గా మార్చారు. ఇప్పటివరకు 5 ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులకు వ్యూహాలు, ప్రచారం చేశారు. అంతకుముందు 2012లో జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్రమోదీని మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఏడాది ముందుగానే కార్యరంగంలో దిగి వ్యూహరచన చేసి విజయం సాధించారు. 2014లోనూ మోదీ ప్రధాని కావడంలో ప్రశాంత్‌కిషోర్‌ వ్యూహాలు ఎంతో పనిచేశాయి. ఆయనపై రాజకీయ పార్టీలకు గురి కుదరడంతో 2015లోనే వైకాపా సంప్రదింపులు చేపట్టింది. అవి కొలిక్కి వచ్చి మరుసటి ఏడాది కొంత సమాచార సేకరణ చేశారు. మిషన్‌ 2019 లక్ష్యంతో పీకే, ఆయన బృందం రెండేళ్ల కిందటే పని మొదలుపెట్టి క్షేత్రస్థాయిలో సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితులపై అధ్యయనం చేస్తూ అవసరమైన ప్రణాళికలు రచించారు.

నిర్మాణాత్మక అధ్యయనం

నియోజకవర్గానికి ఒకరు నుంచి ముగ్గురు వరకు సిబ్బందిని నియమించారు. వీరు పార్టీ పరిస్థితి, నియోజకవర్గ బాధ్యుడి పనితీరుపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా బలహీనంగా ఉన్న స్థానాలను గుర్తించి ప్రత్యేక దృషి పెట్టారు. పార్టీ నియోజకవర్గ బాధ్యుడి పనితీరు, కార్యకర్తలతో అనుసంధానం, ప్రజలతో ఉన్న సంబంధాలు, సామాజికవర్గాల వారీగా స్పందన తదితర అంశాలను పరిశీలించారు. స్థానిక సమస్యలు, వాటి విషయంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేశారు. వైకాపా సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించి రాష్ట్రస్థాయి నుంచి బూత్‌ స్థాయికి కమిటీలు, బూత్‌ సమన్వయకర్తల నియామకమయ్యేలా సూచనలు చేశారు. గడపగడపకు వైకాపా పేరుతో పార్టీ బాధ్యులు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి రెండుసార్లు వెళ్లేలా కార్యక్రమం చేపట్టారు. పాదయాత్ర సందర్భంగా కీలక సూచనలు చేశారు.
నిర్మొహమాటంగా మార్పులు

ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి ఏ అభ్యర్థి అయితే సరిపోతారనేది నిర్ణయించి పార్టీ అధ్యక్షుడు జగన్‌కు నివేదించారు. అభ్యర్థులను మార్చాల్సిన చోట నిర్మొహమాటంగా సూచించారు. అభ్యర్థుల ఎంపిక, ఖరారులోనూ కీలకంగా వ్యవహరించారు. అసమ్మతి నేతలతో స్వయంగా మాట్లాడారు. వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని పట్టు వీడనప్పుడు, ఆయనతో పీకే మాట్లాడారంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన ఎంత కీలకంగా వ్యవహరించారో స్పష్టమవుతోంది.
గతంలో మోదీ, నీతీష్‌కు..

* ప్రశాంత్‌కిషోర్‌ గతంలో భాజపా, కాంగ్రెస్‌, జేడీయూ పార్టీల విజయానికి పనిచేశారు.

* 2012 లో గుజరాత్‌ ఎన్నికల్లో మోదీ మూడోసారి సీఎం అయ్యేందుకు వ్యూహాలు రచించారు.

* 2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా, మోదీ కోసం పనిచేశారు.

* 2015 బిహార్‌ ఎన్నికల్లో నీతీష్‌కుమార్‌కు వెన్నుదన్నుగా నిలిచి సీఎం పీఠంపై కూర్చోబెట్టారు.

* 2017 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోసం పనిచేశారు.

* 2017 ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా చేసినా.. ఆ పార్టీ పరాజయం చవిచూసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *