కేరళలో జల విలయం.. 26 మంది మృతి…


కేరళలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. 26 మంది ప్రాణాలను బలితీసుకున్నాయి. జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. బుధవారం రాత్రి నుంచి కుండపోతగా కురిసిన వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా నదులు, వాగులు పొంగిపొర్లాయి. పలు ఆనకట్టల్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేనివిధంగా 24 ఆనకట్టల గేట్లను ఒకేరోజు ఎత్తివేసి.. నీటిని దిగువకు వదిలారు. పరిస్థితులు భీతావాహంగా మారడంతో ఇడుక్కి, కోజికోడ్‌, వయనాడ్‌, మలప్పురం జిల్లాల్లో సైన్యం, జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సహాయక చర్యల రంగంలోకి దిగాయి. నీటిమట్టం ప్రమాదకరస్థాయికి పెరగడంతో..

ఆసియాలోనే అతిపెద్ద అర్ధచంద్రాకృతి ఆనకట్టగా ప్రసిద్ధిగాంచిన చెరుతోని ఆనకట్ట గేట్లు కూడా ఎత్తివేశారు. ఈ ఆనకట్ట గేట్లు ఎత్తడం గత 26 ఏళ్లలో ఇదే తొలిసారి. ఎత్తైన ప్రాంతాలు, ఆనకట్టల సందర్శనకు వెళ్లొద్దని పర్యాటకులను హెచ్చరించారు. పెరియార్‌ నదిలో నీటిమట్టం పెరగడంతో ముందుజాగ్రత్త చర్యగా కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల మధ్య(రెండు గంటలపాటు) విమాన రాకపోకలను నిలిపివేశారు. వర్షాలతో నష్ట తీవ్రతను అంచనా వేసేందుకుగాను రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన కేంద్ర బృందం.. విజయన్‌తో భేటీ అయింది. మరోవైపు, కేరళలో వర్ష బీభత్సంపై సీఎం విజయన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కేంద్రం నుంచి సాధ్యమైన సహాయమంతా చేస్తామని హామీ ఇచ్చారు. స్వయంగా మోదీ ఈ విషయాలను ట్విటర్‌లో వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *