క‘న్నీటి’లోనే కేరళ…

కేరళలోని అలిప్పి జిల్లా కుట్టనాడ్‌ ప్రాంతంలో ఒక్కో గ్రామంలో 200-300 కుటుంబాల చొప్పున సుమారుగా మొత్తం 2లక్షల నుంచి 2.5 లక్షల మంది ప్రజలు వరద తాకిడికి నిరాశ్రయులయ్యారు. పలక్కడ్‌, త్రిశూర్‌, చెంగనూరు, తిరుకెల్లా, శబరిమలై తదితర ప్రాంతాల్లో వరదనీరు ఇంకి పోయినా… కుట్టనాడ్‌లో మాత్రం ఇంకా ఇళ్లన్నీ వరదనీటిలోనే చిక్కుకుపోయాయి. ఇక్కడి గ్రామాల ప్రజలందరూ చెట్టుకొకరు పుట్టకొకరుగా దాదాపు 700 పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. కేరళ వరద బాధిత ప్రాంతాల పరిశీలనకు వెళ్లిన ‘ఈనాడు-ఈటీవీ’ ప్రతినిధి బృందం జలమార్గం తప్ప రోడ్డు మార్గం లేని ఈ ప్రాంతంలో ప్రత్యేక పడవలో ప్రయాణించింది. ఇక్కడి గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు కేరళ కన్నీటి గాథలు ఇంకా ముగిసిపోలేదని అర్థమైంది. కనీసం మరో మూడునెలలు గడిస్తే తప్ప సాధారణ జీవనం ఒక మాదిరి దశకు చేరుకోలేని దుస్థితి కళ్లముందు సాక్షాత్కరించింది. కుట్టనాడ్‌ ప్రాంతంలో ప్రజల .

జీవనాధారం పోయింది
ఇక్కడి ప్రజల్లో అత్యధికులు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. మిగిలిన వారిలో మత్స్యకారులు, కొబ్బరిపీచుతో వస్తువులు తయారుచేసి వ్యాపారం చేసుకునేవారు, పర్యాటకంపై ఆధారపడి జీవించేవారు ఎక్కువ. సాయంత్రం 5 వరకు గృహ పడవ పర్యాటకం కొనసాగుతుంది. సాయంత్రం 5 తర్వాత మత్స్యకారులు చేపలు పడుతుంటారు. వరద నీటి బీభత్సం కారణంగా ఇప్పుడీ నాలుగు విభాగాలపై ఆధారపడి బతుకుతున్న ప్రజల జీవనోపాధి దెబ్బతింది. ఒక్క కుట్టనాడ్‌ ప్రాంతంలోనే దాదాపు రూ.2వేల కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సర్వం కోల్పోయిన ఈ కుటుంబాలు ఇప్పుడు పొట్టకూటి కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని వేల సంఖ్యలో ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా.. అత్యధిక ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటిని తిరిగి నిర్మించుకోవడానికి, చక్కదిద్దుకోవడానికి ఇక్కడి ప్రజలు మరింత శ్రమ పడాల్సిందే.

నిండా మునిగిన వరి

ఈ చిత్రాన్ని చూస్తుంటే నీళ్లతో కళకళలాడుతున్న పెద్ద నీటి కొలనులా కనిపిస్తోంది కదూ! వాస్తవానికిది ఆగస్టు 15కు ముందు వరకూ పచ్చని వరి చేలతో కళకళలాడిన ప్రాంతం. ఈ నీటి కింద దాదాపు 1000 ఎకరాలకు పైగా పంట మునిగి ఉంది. దీంతో రైతులు తల్లడిల్లుతున్నారు.


ఈ మహిళ పేరు సౌదామిని. కేరళలోని అలిప్పి జిల్లా కుట్టనాడ్‌ ప్రాంతంలో వరద ప్రవాహానికి ఈమె ఇల్లు ఇలా నీట మునిగిపోయింది. గృహోపకరణాలు, దుస్తులతోపాటు ముఖ్యమైన పత్రాలు కూడా నీటి పాలయ్యాయి. పునరావాస కేంద్రంలో కుటుంబంతో పాటు ఉంటున్న ఈమె రోజుకోసారి ఇలా సొంతింటికి వచ్చి వరద నీటిలో ఉన్న ఇంటిని చూసుకొని వెళ్తోంది. కుట్టనాడ్‌ ప్రాంతంలోని 14 గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి.

బోసిపోయిన పర్యాటకం

కేరళలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో కుట్టనాడ్‌ ఒకటి. రవాణాకు జలమార్గమే ఆధారం కాబట్టి ఇక్కడ అన్ని గ్రామాల్లోనూ సాధారణంగా ఇంటికొక చిన్న పడవ ఉంటుంది. ఇక్కడి ప్రత్యేకత గృహ పడవలు(హౌజ్‌ బోట్లు). పర్యాటక ప్రాంతం కావడంతో వీటి ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ. సాధారణంగా ఈ గృహపడవలు నిరంతరాయంగా అన్ని రోజులూ పనిచేస్తూనే ఉంటాయి. వీటి అద్దె రోజుకు రూ.5వేల నుంచి రూ.20వేల వరకూ ఉంటుంది. ఒక్కో గృహ పడవ రోజుకు కనీసం ఐదుగురికి ఉపాధిని కల్పిస్తుంది. ఈ పడవల్లో ఇంట్లో ఉన్నట్లే అన్ని వసతులూ ఉంటాయి. పర్యాటకులు పడవను ఒకరోజుకు అద్దెకు మాట్లాడుకుని నదీ విహారం చేస్తుంటారు. ఇప్పుడు వరద దెబ్బకు వెయ్యికిపైగా పర్యాటక గృహపడవలన్నీ కూడా నిలిచిపోయి జీవనోపాధి దెబ్బతింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *