కాంగ్రెస్‌ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలి కేసీఆర్‌

హుస్నాబాద్‌: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నుంచి తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల శంఖారావం పూరించారు. తెరాస ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలు ఎందుకు వచ్చాయో నిన్ననే వివరించా. ఎన్నికలు తేవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్‌. అవాకులు.. చవాకులు పేలుస్తూ అధికారుల స్థైర్యాన్ని దెబ్బతీసేవిధంగా కాంగ్రెస్‌ అసత్య ఆరోపణలు చేసింది. సమైక్య రాష్ట్రంలో జీవనవిధ్వంసం జరిగింది. అవినీతి రహితంగా పాలన చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. ప్రతీ రూపాయిని లెక్కపెట్టి సమకూరిస్తే ఆదాయం వచ్చింది. భారతదేశంలో రైతులకు 24 గంటలు విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. దేశాన్ని కాంగ్రెస్‌ 60ఏళ్లు పాలించింది. వాళ్ల అవినీతి, దరిద్రపు పాలన వల్లనే దేశం దౌర్భాగ్యంగా ఉంది.’

‘దేశంలో 70వేల టీఎంసీల నీరు ఉన్నప్పటికీ ప్రజలకు ఉపయోగ పడని దుస్థితి కాంగ్రెస్‌ వల్లే ఏర్పడింది. తెలంగాణ కోసం పేగులు తెగేదాకా, 14 ఏళ్లు పోరాడాం. కాంగ్రెస్‌ పాలన అంతం కావాలనే 2014లో ప్రజలు తెరాసను గెలిపించారు. ఎన్నికలు వచ్చినప్పుడు అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం కాదు. రాష్ట్రంలో అభివృద్ధి కనిపించకపోతే కాంగ్రెస్‌నేతలు కంటివెలుగు పరీక్షలు చేయించుకోవాలి.’ అని కేసీఆర్‌ అన్నారు. తొలి ఎన్నికల శంఖారావ సభకు తెరాస శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఆపద్ధర్మ మంత్రులు ఈటల రాజేందర్‌, హరీశ్‌రావు, కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ సహా పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు ఈ సభలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *