ముందస్తు ఎన్నికల కసరత్తు వేగవంతం
ప్రగతి నివేదన సభ తర్వాత నిర్ణయం
గవర్నర్‌తో భేటీలో సీఎం కేసీఆర్ చర్చ
అధికారులతోనూ సమావేశం
మంత్రిమండలి అజెండా పరిశీలన
ఐఏఎస్‌ల బదిలీలకు ఆమోదం
హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల కసరత్తు వేగం పుంజుకున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. సెప్టెంబరు మొదటివారంలో శాసనసభ రద్దు చేసే అవకాశముందని తెరాస వర్గాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఉన్నతాధికారులతో వివిధ అంశాలపై విస్తృత సమావేశం, గవర్నర్ నరసింహన్‌తో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ముందస్తు ఎన్నికలకు బలం చేకూరుస్తూ ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై అధికారులతో ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి చర్చించారు. వెంటనే రాత్రి 11 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేశారు. సీనియర్ ఐఏఎస్‌లు, ఎస్పీలు, కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులను బుధవారం బదిలీ చేసే అవకాశం ఉంది. మంత్రిమండలిలో ప్రవేశపెట్టనున్న అంశాలపైనా ఆయా శాఖల నుంచి వివరాలు తెప్పించుకున్న సీఎం ప్రగతిభవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, తమ కార్యాలయ అధికారులతో సమావేశమై విస్తృతంగా చర్చించారు. సెప్టెంబరు 2వతేదీన జరగనున్న ప్రగతి నివేదన సభకు ముందే మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించి, వివిధ అంశాలకు ఆమోదముద్ర వేయనున్నారు. 2వ తేదీనాటి సభ ఎన్నికల శంఖారావం లాగానే జరగనుంది. తర్వాత మంత్రిమండలి సమావేశం నిర్వహించి లేదా శాసనసభ సమావేశాలు జరిపాక గానీ సభ రద్దుకు సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
దిల్లీ పరిణామాలు, శాసనసభ సమావేశాలపై గవర్నర్‌తో చర్చ
ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. రెండు గంటల పాటు సమావేశం జరిగింది. దిల్లీ పర్యటన విశేషాలను చర్చించడంతో పాటు శాసనసభ సమావేశాల నిర్వహణ అంశాల గురించి మాట్లాడినట్లు తెలిసింది. దిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీలతో సమావేశాలు, చర్చించిన అంశాల గురించి వివరించారు. జోనల్ విధానానికి ఆమోదం, హైకోర్టు విభజన, ప్రాంతీయ వలయ రహదారితో పాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధి సహా ఇతర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. 95 శాతం స్థానిక రిజర్వేషన్ల కోసం నిర్దేశించిన జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత పెద్దఎత్తున ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు. హైకోర్టు విభజనపై కేంద్రం సానుకూలంగా వ్యవహరించిందనీ, దీనికి అనుగుణంగా స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసిందని, విభజన సాధ్యమైనంత త్వరగా జరిగే అవకాశముందని చెప్పారు. న్యాయస్థానం ఆదేశిస్తే ఏపీ హైకోర్టుకు ఇక్కడే భవన సదుపాయం, ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. కీలకమైన జాతీయ రహదారులకు తోడు కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులను కోరామని, దీనిపైనా కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
మంత్రిమండలి సమావేశంలో పలు నిర్ణయాలు
వచ్చే శాసనసభ సమావేశాల గురించి గవర్నర్‌తో సీఎం చర్చించారు. సమావేశాల నిర్వహణకు వివిధ తేదీలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో మంత్రిమండలి సమావేశం జరిపి పలు అంశాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారని తెలిసింది.
జేసీలు, ఆర్డీవోలు, డీఎస్పీల బదిలీలపైనా…
బదిలీల నేపథ్యంలో జిల్లాల జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజినల్ అధికారులు, డీఎస్పీల బదిలీలకు ముఖ్యమంత్రి అనుమతించారు. కొత్త జోనల్ విధానానికి సంబంధించి ఉత్తర్వుల జారీపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. దిల్లీలో ఉన్న ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మతో మాట్లాడారు. సాధ్యమైనంత త్వరగా ఉత్తర్వులు వచ్చేలా కృషి చేయాలని సూచించారు.