సందీప్‌రెడ్డి ఉన్నాడు కదా… ధైర్యంగా ఉండమని చెప్పాడు..!


‘భరత్‌ అనే నేను’తో తెలుగులోకి అడుగుపెట్టి ప్రేక్షకుల్ని మెప్పించిన కథానాయిక కియారా అడ్వాణీ. ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’తో సందడి చేసింది. సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్‌ ‘కబీర్‌ సింగ్‌’లో నటించింది కియారా. ఆ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌కి వచ్చిన కియారా ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించింది.

తెలుగులో ‘వినయ విధేయ రామ’ తర్వాత సినిమా చేయలేదేంటి?
నేనూ తెలుగులో నా మూడో సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. చాలా కథలు వింటున్నాను. హైదరాబాద్‌ నా రెండో ఇల్లులాంటిది. ఇక్కడికి వచ్చినప్పుడంతా చాలా సంతోషంగా ఉంటుంది.

‘అర్జున్‌రెడ్డి’ చూశారా?
సినిమా విడుదలైనప్పుడే చూశా. నాకు చాలా బాగా నచ్చింది. విజయ్‌ దేవరకొండకి అభిమానిగా మారిపోయా. అదే సినిమా రీమేక్‌లో నటించే అవకాశం రావడం ఒక కలలా అనిపించింది.

విజయ్‌ దేవరకొండ, కథానాయిక షాలిని పాండేతో మాట్లాడారా?
షాలినిని కలవలేదు. విజయ్‌ దేవర కొండని ఒక అవార్డు వేడుకలో కలిశా. ‘అర్జున్‌రెడ్డి’ గురించి మాట్లాడుకున్నాం కానీ… తనేం సలహాలు ఇవ్వలేదు. సందీప్‌రెడ్డి ఉన్నాడు కదా, ధైర్యంగా ఉండమని చెప్పాడంతే.

‘అర్జున్‌రెడ్డి’ లాంటి క్లాసిక్‌ను రీమేక్‌ చేయాల్సి వచ్చినప్పుడు నటులకి ఎదురయ్యే సవాళ్లేంటి?
అంచనాలెక్కువగా ఉంటాయి. మాతృకని చాలా మంది చూసుంటారు. దానికంటే కొత్తగా ఏం చూపించాలనే ఓ ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది. సందీప్‌రెడ్డి వంగా ఒక రీమేక్‌ సినిమాలాగా తెరకెక్కించలేదు. మరో కొత్త కథ అన్నట్టు చూపించారు.

మార్పులు ఏమైనా చేశారా?
మూల కథ అదే. ఇక ఆశ్చర్యపోయే కొత్త విషయాలు ఏమున్నాయనేది తెరపైనే చూడాలి.

ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. అవి చేయడానికి ఇబ్బంది అనిపించలేదా?
ఇది మోడ్రన్‌ లవ్‌స్టోరీ. నేటి ప్రేమల్లో ముద్దులు, కౌగిలింతలు సహజం. ఇందులో అవి సహజంగా అందంగా ఉంటాయి. ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు.

బాలీవుడ్‌లో ప్రస్తుతం ‘లక్ష్మీబాంబ్‌’ సినిమా చేస్తున్నారు. హారర్‌ సినిమాలంటే ఇష్టమా?
నాకు హారర్‌ సినిమాలంటే అస్సలు ఇష్టం ఉండదు. ‘కాంచన’ సినిమాని నేను చూడలేదు కానీ… లారెన్స్‌ చెప్పిన స్క్రిప్టు విన్నప్పుడు ఎంజాయ్‌ చేశా. ‘కాంచన’కి రీమేక్‌గానే ‘లక్ష్మీబాంబ్‌’ తెరకెక్కుతోంది. ఇందులో హారరే కాకుండా కామెడీ కూడా ఉంటుంది. అందుకే చేస్తున్నా.

మళ్లీ వెబ్‌సిరీస్‌లు చేయబోతున్నారా?
ఒక నటిగా నాకు వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఒక్కటే. యువతరం వెబ్‌ సిరీస్‌లు బాగా చూస్తారు. వాళ్లకి మరింత దగ్గర కావడానికి అవి చేయడంలో తప్పులేదు.

తెలుగు నేర్చుకున్నారా?
రెండు సినిమాలే కదా చేసింది. కొంచెం అర్థమవుతోంది. ఇద్దరు టీచర్లని పెట్టుకొన్నా తెలుగు కోసం. ఇంకో రెండు మూడు సినిమాలు చేస్తే తెలుగులో మాట్లాడతా.

మా ఆవిడ సలహా ఇచ్చింది

హిందీ ప్రేక్షకుల కోసం తీసింది ‘కబీర్‌సింగ్‌’. ఆ చిత్రం ఎలా ఉండనుందో త్వరలోనే చూడబోతున్నారు. తెలుగులో గొప్ప విజయం సాధించిన ‘అర్జున్‌రెడ్డి’కి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాం. ఎక్కడా కాపీ పేస్ట్‌లాగా మా సినిమా ఉండదు. మా సినిమాకి ‘అర్జున్‌రెడ్డి’తో పోలికే నాకు నచ్చదు. పోలిక పెట్టిన ప్రతిసారీ నాకు టెన్షన్‌ పెరిగిపోతుంటుంది. తొలిసారి ‘అర్జున్‌రెడ్డి’ని చూడగానే వావ్‌ అనిపించింది. మా ఆవిడ కూడా ఆ సినిమాని చూసింది. ‘నువ్వు రీమేక్‌ చేస్తే బాగుంటుంద’ని తనే సలహా ఇచ్చింది. విజయ్‌ని ఇప్పటిదాకా కలవలేదు. మా సినిమా ట్రైలర్‌ గురించి ప్రభాస్‌ సామాజిక మాధ్యమాల్లో మెచ్చుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది. – షాహిద్‌ కపూర్

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *