జియో ఫోన్‌-2 బుకింగ్స్‌…

న్యూదిల్లీ: రిలయన్స్‌ జియో ఫోన్‌-2 బుకింగ్స్‌ను ఈ నెల 15 నుంచి చేసుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది. ఈ ఏడాది జులైలో నిర్వహించిన రిలయన్స్‌ వార్షిక సమావేశంలో జియో ఫోన్‌-2 గురించి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో రూ.2,999కే ఈ 4జీ ఫీచర్‌ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ఫిజికల్‌ కీ బోర్డ్‌, వాట్సాప్‌తో పాటు పలు ఫీచర్లతో దీన్ని విడుదల చేయనున్నారు. గతంలో రిలయన్స్‌ అతి తక్కువ ధరకే విడుదల చేసిన జియో ఫోన్‌కు భారీగా స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

ఎలా బుక్‌ చేసుకోవాలి?
జియో ఫోన్‌-2ను జియో అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా లేదా మై జియో యాప్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. వాటిల్లో జియో ఫోన్‌-2 రిజిస్ట్రేషన్‌ పేజీపై క్లిక్‌ చేసి గెట్‌ నౌ ఆప్షన్‌లోకి వెళ్లాలి. ఆ తరువాత వచ్చిన పేజీలో మీ పేరు, ఫోన్‌ నెంబరు, అడ్రస్‌తో పాటు ఇతర వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఇందులో డెలివరీ సమయంలో డబ్బు చెల్లించే అవకాశం లేదు. రిజిస్ట్రేషన్‌ చేసుకునే సమయంలోనే నెట్‌ బ్యాంకింగ్‌ లేదా క్రెడిట్, డెబిట్‌ కార్డుల ద్వారా రూ.2,999 చెల్లించాలి. ఈ ఫోన్లను ఎప్పటి నుంచి డెలివరీ చేస్తామన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, బుకింగ్ చేసుకున్న కొన్ని రోజుల్లోనే ఈ ఫోన్‌ అందుకోవచ్చని తెలుస్తోంది.

రిలయన్స్‌ జియో ఫోన్‌-2 ఫీచర్లు..
2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే, 512 ఎంబీ ర్యామ్‌, 4 జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌, 2 ఎంపీ వెనుక కెమెరా, వీజీఏ ముందు కెమెరా సెన్సార్‌, 2,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం‌తో ఈ ఫోన్‌ రానుంది. వీఓఎల్‌టీఈ, వీవోవైఫై, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, బ్లూటూత్‌, ఎఫ్‌ఎమ్‌ రేడియో ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *