జియో గిగాఫైబర్‌‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం


దిల్లీ: జియో అభిమానులు కొద్ది రోజులుగా ఎదురుచూస్తున్న జియో గిగాఫైబర్‌ ప్రీ-బుకింగ్స్‌ ప్రారంభయ్యాయి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలయన్స్‌ జియో నేటి నుంచి ఆప్టికల్‌ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు రిజిస్ట్రేషన్లను ప్రారంభించింది. 4జీ సేవల అనంతరం జియో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించేందుకు జియో సిద్ధమైన సంగతి తెలిసిందే. జియో ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ద్వారా డౌన్‌లోడ్‌ స్పీడ్‌ సెకనుకు ఒక గిగాబైట్‌ ఉంటుందని రిలయన్స్‌ వెల్లడించింది. మైజియో యాప్‌ లేదా జియో వెబ్‌సైట్‌ ద్వారా గిగాఫైబర్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఏ నగరం నుంచి ఎక్కువగా రిజిస్ట్రేషన్లు వస్తాయో అక్కడ నుంచి మొదటగా గిగాఫైబర్‌ సేవలు అందించనున్నట్లు రిలయన్స్‌ వెల్లడించింది. ఈ సేవలను మొత్తం 1100 నగరాల్లో ప్రారంభిస్తామని గత నెల రిలయన్స్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతానికి జియో గిగాఫైబర్‌ను ఇళ్లలో ఉపయోగించే‌ వినియోగదారులకు నెలకు రూ.1000 ప్లాన్‌తో సెకనుకు వంద మెగాబిట్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ అందించనుంది. గృహ వినియోగదారులకు పది రెట్ల వేగంతో ఇంటర్నెట్‌ అందిస్తామని జియో హామీ ఇచ్చింది. కాగా కంపెనీ ఈ గిగాఫైబర్‌ ధరను వెల్లడించలేదు. అయితే, గతంలో జియో విడుదలైనప్పుడు టెలికాం సంస్థల మధ్య భారీగా పోటీ ఏర్పడినట్లే ఇప్పుడు కూడా పోటీ ఏర్పడుతుందని భావిస్తున్నారు. రిలయన్స్‌ ఇటీవల విడుదల చేసిన జియో ఫోన్2 విక్రయాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫ్లాష్‌ సేల్‌ ప్రారంభమవుతుంది. ఈ ఫోన్‌ కోసం నేటి నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *