జెట్ఎయిర్‌వేస్‌కు కష్టకాలం

ముంబయి: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆర్థిక కష్టాల్లో నిండా మునిగిపోయింది. ఓవైపు ఇంధన ధరలు పెరగడం, రూపాయి పడిపోవడం.. మరోవైపు నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఎయిర్‌లైన్‌ సంస్థ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖర్చుల భారం తగ్గించుకోకపోతే ఎయిర్‌లైన్‌ను 60 రోజుల కంటే ఎక్కువ కొనసాగించలేరట. ఈ మేరకు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు ఇద్దరు మీడియాకు తెలిపారు.

ఎయిర్‌లైన్‌ ఛైర్మన్‌ సహా యాజమాన్య బృందం ఇటీవల పలుమార్లు సిబ్బందితో చర్చలు జరిపి పరిస్థితిని వివరించినట్లు సదరు ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. సంస్థ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, వెంటనే ఖర్చులను తగ్గించుకునే చర్యలు చేపట్టాలని యాజమాన్యం తెలిపిందట. లేదంటే 60రోజుల కంటే ఎక్కువ ఎయిర్‌లైన్‌ను నడపలేమని చేతులెత్తేసినట్లు సమాచారం. మరోవైపు ఎయిర్‌లైన్‌లో కొంతవాటాను అమ్మేయాలని కూడా చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా సిబ్బంది జీతాల్లో కోత విధించేందుకు జెట్‌ఎయిర్‌వేస్‌ సిద్ధమైన విషయం తెలిసిందే. సిబ్బంది వేతనాల ఆధారంగా 5 నుంచి 25శాతం వరకు కోత విధించాలని ఎయిర్‌లైన్‌ నిర్ణయించింది. ఉదాహరణకు ఏటా రూ.12లక్షల వేతనం ఉంటే అందులో నుంచి 5శాతం, రూ. కోటి అంతకంటే ఎక్కువ జీతం అందుకుంటే అందులో నుంచి 25శాతం వరకు తగ్గించాలని చూస్తోంది. ఇదే విషయాన్ని సదరు సిబ్బందితో యాజమాన్యం చర్చించింది. సాధారణంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ ఏటా సిబ్బంది వేతనాల కోసం రూ. 3000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ తగ్గింపు వల్ల సంస్థకు రూ.500కోట్ల భారం తగ్గనుంది.

ఇంధన ధరలు అధికంగా ఉండటం వల్లే తమకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఎయిర్‌లైన్‌ చెబుతోంది. 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో వరుస లాభాలను ఆర్జించిన జెట్‌ ఎయిర్‌వేస్‌.. గత ఆర్థిక సంవత్సరంలో మాత్రం రూ. 767కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనే సంస్థకు రూ.1000కోట్ల నష్టం రావొచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

షేర్లు డీలా..

జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లలో ఆ కంపెనీ షేర్లు డీలా పడ్డాయి. శుక్రవారం నాటి ఆరంభ ట్రేడింగ్‌లో కంపెనీ షేరు ధర దాదాపు 6శాతం పడిపోయింది. ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఎన్‌ఎస్ఈలో కంపెనీ షేరు ధర 4.32 శాతం పడిపోయి రూ. 316.85 వద్ద, బీఎస్‌ఈలో 4.27శాతం పడిపోయి రూ. 217.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *