నా భార్యను సైతం…: జగన్ సంచలన ఆరోపణ….


విజయనగరం: బిజెపిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ఆరోపణ చేశారు. ఈ రోజు కూడా ప్రత్యేక హోదాపై రాజీ పడడం లేదు కాబట్టే బిజెపి తన భార్యను కూడా ఎనిమిదేళ్ల తర్వాత కేసుల్లో ఇరికించడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం విజయనగరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

నీ నైజం ఏమిటి, నా నైజం ఏమిటి అని చెప్పడానికి అంతకన్నా నిదర్శనం ఇదేనని ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అన్నారు. అబద్దాలు చెప్పడం, మోసాలతో బతకడం చంద్రబాబు నైజమని అన్నారు. మాట కోసం, విలువల కోసం బతికే వ్యక్తి జగన్‌ అని అన్నారు.

ప్రజల కోసం తానెప్పుడు కూడా రాజీ పడలేదని, కాబట్టే ఓదార్పు చేస్తానన్నందుకు అప్పట్లో అధికారంలో ఉన్న సోనియాగాంధీ ఒప్పుకోకపోతే కోట్లాడామని, అందుకే కాంగ్రెస్, టీడీపీ రెండూ కలిసి కేసులు బనాయించాయని జగన్ అన్నారు.

నాలుగున్నరేళ్లుగా బీజేపీతో కాపురం చేసింది నువ్వు కాదా? హోదాను తాకట్టు పెట్టింది నువ్వనేది ప్రజలకు తెలియదా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు.. బీజేపీతో తనకున్న కనెక్షన్‌ ద్వారా మహారాష్ట్రలో బాబ్లీ ఆందోళన కేసు తెరపైకి తెచ్చాడని, దాన్నో పెద్ద కేసుగా చిత్రీకరిస్తున్నాడని, సానుభూతి కోసం డ్రామాలాడుతున్నాడని ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

నిజంగా నువ్వు బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే.. ఓటు కోసం కోట్లు వెదజల్లుతూ, నల్లధనంతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపుల్లో సాక్ష్యాలతో దొరికితే… ఆ కేసు లో నీకు నోటీసులు ఇవ్వకుండా.. బాబ్లీ కేసులో ఇస్తున్నారంటే నువ్వు బీజేపీతో మేనేజ్‌ చేసుకున్నట్లే కదా చంద్రబాబూ అని ఆయన అన్నారు.

బీజేపీతో నాలుగేళ్లు అంటకాగి ఇప్పుడు మాట్లాడేదేంటి ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. బీజేపీతో సఖ్యతగా ఉందంటున్నాడని, ఆయన రాజకీయాలు చూస్తుంటే బాధేస్తోందని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అంటూ ఇంత దారుణంగా అబద్ధాలాడే మనిషి రాజకీయాల్లో ఉండటానికి అర్హుడేనా అని ఆయన ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *