నీకూ నాకూ.. ఐకియా విరగబడిన వినియోగదారులు…


తిరునాళ్లు కాదు.. సంబురాలు లేవు.. కానీ జనమే జనం. రహదారులపై వాహనాలు బారులు తీరాయి. పెద్దఎత్తున ట్రాఫిక్‌ జామ్‌. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో అంతర్జాతీయ సంస్థ ఐకియా స్టోర్‌ వద్ద నెలకొన్న పరిస్థితి. నగర వాసులతో పాటు, ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐకియా స్టోర్‌ గురువారం ప్రారంభమయ్యింది. దీనికి తొలి రోజునే వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. అందుబాటు ధరలో ఎన్నో వస్తువులు, ఉత్పత్తులు ఉన్నాయనే అభిప్రాయంతో వినియోగదారులు పెద్ద ఎత్తున బారులు తీరారు. మధ్యాహ్నం వరకూ ఊహించని విధంగా పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు రావటంతో నిర్వాహకులు నిస్సహాయంగా మిగిలారు. స్టోర్‌ లోపల, బయటా వినియోగదారులు భారీగా చేరారు. ప్రారంభం సందర్భంగా రాయితీలు, బహుమతులు అందిస్తున్నారంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో చేరవేయడంతో కూడా జనరద్దీ పెరిగేందుకు కారణాలుగా నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఎదురైతే వారాంతపు రోజుల్లో రద్దీ మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ముందస్తు చర్యలు తీసుకునేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు.

కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం
అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు భారతదేశంలో పెట్టుబడి పెట్టేందుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడం శుభపరిణామమని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.టి.రామారావు అన్నారు. వీటి ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం ఐకియా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన తొలి స్టోర్‌ను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత ఐకియా ప్రాంగణంలో మొక్కను నాటారు. ఐకియా వంటి సంస్థలు ఇక్కడికి రావడం వల్ల అంతర్జాతీయ బ్రాండ్లు స్థానికులకు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ విధానాలే కీలకం: తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల విధానాల వల్లే దేశ, విదేశీ సంస్థలు హైదరాబాద్‌పై దృష్టి సారిస్తున్నాయని కేటీఆర్‌ అన్నారు. ఐకియా దీనికి తాజా ఉదాహరణగా పేర్కొన్నారు. భవిష్యత్తులో మరికొన్ని అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడకు రాబోతున్నాయన్నారు. స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు ఐకియా స్టోర్‌లో ప్రాధాన్యం ఇవ్వడాన్ని అభినందించారు. తెలంగాణ చేనేత, ఇతర ఉత్పత్తుల కోసం ప్రత్యేక స్టాల్‌ ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐకియా భారత సీఈఓ పీటర్‌ బెట్జెల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సందడే.. సందడి…: ఐకియా దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన స్టోర్‌ ప్రారంభ కార్యక్రమం సందడిగా జరిగింది. హైదరాబాద్‌కు చెందిన వారే కాకుండా బెంగళూరు, ముంబయి, పుణెకు చెందిన వినియోగదారులు, సరఫరాదారులు ఈ కార్యక్రమానికి వచ్చారు.
* ఐకియా అధికారులు, సిబ్బందితోపాటు భారత దేశంలో స్వీడన్‌ రాయబారి క్లాస్‌ మెలిన్‌ హాజరయ్యారు.
* ఫర్నిచర్‌, ఇతర వస్తువులను కొనుగోలుదారుల ఇంటికి వెళ్లి బిగించేందుకు అర్బన్‌క్లాప్‌ అనే సంస్థతో ఐకియా ఒప్పందం కుదుర్చుకుంది. వినియోగదారులు కొనుగోలు చేసిన వస్తువులను వారి ఇళ్లకు చేర్చడానికి గతి కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
* సమీప భవిష్యత్తులో భారత్‌లో తమ సిబ్బంది సంఖ్య 15వేలకు పెరుగుతుందని ఐకియా ప్రతినిథులు వెల్లడించారు.
* ఇచ్చే ఉద్యోగాల్లో సగం మంది మహిళా ఉద్యోగులే ఉండాలనే నిబంధనను కచ్చితంగా పాటిస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *