హిమ దాస్‌ కోసం సర్‌ప్రైజ్‌ రెడీ..!

గువహటి: ఆసియన్‌ క్రీడల్లో మూడుసార్లు పతకాలు సాధించి భారతదేశాన్ని గర్వపడేలా చేశారు స్ప్రింటర్‌ హిమదాస్‌. ఈరోజు ఆమె తన స్వస్థలమైన గువహటికి చేరుకోనున్నారు. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనవాల్‌.. హిమదాస్‌ను సాదరంగా ఆహ్వానించనున్నారు. భారత్‌కు మూడు పతకాలు తెచ్చిపెట్టిన హిమదాస్‌ను అభిమానులు వినూత్నంగా స్వస్థలానికి ఆహ్వానించాలనుకున్నారు. ఇందుకోసం అసోం విమానాశ్రయంలో ఎర్ర తివాచీ వేసి దానిపై స్టార్ట్‌..1,2,3,4,5,6 అన్న సంఖ్యలతో ట్రాక్‌ను రూపొందించారు.

ఆసియన్‌ క్రీడల్లో హిమదాస్‌ ఇలాంటి ట్రాక్‌‌పైనే పరిగెత్తి పతకాలు సాధించారు. హిమదాస్‌ కోసం అభిమానులు వేసిన ఈ ట్రాక్‌ సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. గువహటి చేరుకున్నాక హిమదాస్‌.. సారుసుజాయ్‌ స్టేడియం, డాక్టర్‌ భూపేన్‌ హజారిక సమాధి క్షేత్ర స్థూపం వద్దకు చేరుకుంటారు. శ్రీమంత శంకరదేవ్‌ కళాక్షేత్రంలో అసోం రాష్ట్ర ప్రభుత్వం ఆమెను సన్మానించనుంది.

ఐఏఏఎఫ్‌ ప్రపంచ అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళా అథ్లెట్‌గా హిమదాస్‌ చరిత్ర సృష్టించారు. మహిళల 400మీ పరుగులో ఆమె విజేతగా నిలిచారు. 18 ఏళ్ల హిమ 51.46 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన తొలి భారత ట్రాక్‌ అథ్లెట్‌గా కూడా హిమ ఘనత సాధించారు. గోల్ట్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో 51.32 టైమింగ్‌తో హిమదాస్‌ ఆరో స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *