రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడతానని గట్టిగా చెప్పారు…

హైదరాబాద్‌ : తెదేపా సీనియర్‌ నేత హరికృష్ణ దుర్మరణం చాలా విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ రోజు ఉదయం మెహదీపట్నంలోని నివాసంలో హరికృష్ణ పార్థివదేహానికి వెంకయ్యనాయుడు నివాళులు అర్పించారు. నందమూరి కుటుంబసభ్యులను పరామర్శించారు.

అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ హరికృష్ణ నిర్భీతిగా, నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరించేవారని అన్నారు. ఏ పనైనా చిత్తుశుద్ధితో చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి హరికృష్ణ అని పేర్కొన్నారు. గతంలో రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడుతానని గట్టిగా చెప్పారని..ఆనాటి ఛైర్మన్‌ అభ్యంతరం తెలిపితే తాను జోక్యం చేసుకుని తర్జుమా చేస్తానని చెప్పినట్లు వెంకయ్యనాయుడు గుర్తుచేశారు.

హరికృష్ణకు ప్రజాభిమానం మెండుగా ఉందని.. సినీ, రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత సంతరించుకున్నారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. హరికృష్ణ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *