చైతన్య రథ సారథి నందమూరి హరికృష్ణ దుర్మరణం…


నల్గొండ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
తీవ్రంగా గాయపడి నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రిలో కన్నుమూత
కావలికి వెళ్తుండగా ఘటన
ప్రమాద సమయంలో స్వయంగా కారు నడుపుతున్న హరికృష్ణ
అతివేగం, సీటు బెల్టు పెట్టుకోకపోవడమే మరణానికి కారణం: నల్గొండ ఎస్పీ
మెదడు చిట్లడం వల్లనే మృతి: వైద్యులు
పార్థివదేహం హైదరాబాద్‌కు తరలింపు
జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ కన్నీరుమున్నీరు
హుటాహుటిన వచ్చిన చంద్రబాబు
హైదరాబాద్‌లో కేసీఆర్‌ నివాళులు

మరో ఘోరం జరిగింది. ఇంకో విషాదం నందమూరి కుటుంబాన్ని వెంటాడింది. ‘అన్నా’ అని పిలిస్తే చాలు ‘అన్నగారి’ అభిమానుల ఇంట్లో వాలిపోయే పెద్దదిక్కు.. అలా వెళ్తూనే పొద్దు వాలింది. కన్నబిడ్డ మరణం తాలూకూ గాయాన్ని మాన్పుకుంటున్న సమయంలో విధి ఆయన్నూ కబళించింది. పెద్ద కుమారుడు జానకీరామ్‌ను బలిగొన్న తరహాలోనే తండ్రినీ రోడ్డు ప్రమాదమే బలితీసుకుంది. నెల్లూరు జిల్లా కావలిలో నందమూరి అభిమాని ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్తుండగా నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌ వద్ద బుధవారం ఉదయం 5.56 – 6 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో సినీ నటుడు.. రాజ్యసభ మాజీ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ (61) కన్నుమూశారు. ఎన్టీఆర్‌ ‘చైతన్య రథాన్ని’ ముందుండి నడిపించి ‘చైతన్య రథ సారథిగా’ ఖ్యాతి గడించిన ఆయన..
చివరికి కారు నడుపుతూనే ప్రాణాలు కోల్పోయి తన సారథ్యానికి శాశ్వతంగా విరామం ప్రకటించడంతో నందమూరి అభిమానుల గుండె పగిలింది. ఇక మాకు దిక్కెవరంటూ రోదించింది. తండ్రీకుమారుల మరణాలు రెండూ పూర్వ నల్గొండ జిల్లాలోనే జరగడం విషాదకరం.

హరికృష్ణ దుర్మరణం
నల్గొండ


నల్గొండ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్‌ తనయుడు, సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ(61) మరణించారు. ప్రమాదం జరగడం..ఆసుపత్రికి తరలించడం.. కన్నుమూయడం అంతా 24 నిముషాల్లోనే జరిగిపోయింది. ఆయన మరణంతో తెదేపా నేతలు..అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగే శుభకార్యానికి హాజరయ్యే నిమిత్తం మరో ఇద్దరు మిత్రులు అరికెపూడి శివాజీ, రావి వెంకటరావులతో కలిసి బుధవారం ఉదయం 4.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి తన టయోటా ఫార్చ్యునర్‌ (ఏపీ 28 బీడబ్ల్యూ 2323)కారులో హరికృష్ణ బయల్దేరారు. ఆయనే స్వయంగా కారు నడుపుతున్నారు. అద్దంకి- నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారిలో అన్నెపర్తి వద్ద నీళ్ల సీసా తీసుకునేందుకని వెనక్కి తిరిగారు. ముందున్న మలుపును గుర్తించి తప్పించే క్రమంలో అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో కారు అదుపు తప్పింది. అనంతరం పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి ఎదురుమార్గంలో చెన్నై నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న కారు (ఏపీ 31 ఏఈ 9000)ను రాసుకుంటూ వెళ్లి పల్టీలు కొట్టింది. ఆ కుదుపుల కారణంగా కారు తలుపు తెరుచుకోవడంతో హరికృష్ణ ఎగిరి పక్కనే ఉన్న కల్వర్టు సమీపంలోని రాళ్లపై పడ్డారు. తలకు తీవ్రగాయమై రక్తస్రావమైంది. 12వ బెటాలియన్‌కు చెందిన అత్యవసర వాహనంలో సిబ్బంది నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ఆయన్ని బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూ 10 నిముషాల వ్యవధిలోనే కన్నుమూశారు. ఆయన కారులోనే ఉన్న మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. చెన్నై నుంచి వస్తున్న కారులో అయిదుగురు ప్రయాణిస్తుండగా…ఒకరికి తీవ్రంగా..మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే హరికృష్ణ కుమారులు జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. తండ్రి భౌతికకాయాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు.
ప్రమాద సమయంలో కారు సుమారు 150-160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోందని పోలీసులు వెల్లడించారు. మితిమీరిన వేగం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లే హరికృష్ణ కారు నుంచి బయటపడ్డారని..అదే ప్రమాద తీవ్రత పెంచి హరికృష్ణ మరణానికి కారణమైందని నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్‌ ‘ఈనాడు’కు తెలిపారు.

నీళ్ల సీసా తీసుకునేలోపే…


హైదరాబాద్‌ నుంచి ఉదయం 4.30కు బయల్దేరాం. సుమారు 6 గంటల సమయంలో నీళ్ల సీసా తీసుకుందామని హరికృష్ణ వెనక్కి తిరిగారు. ముందు మలుపు ఉండటం..ఏదో రాయి అడ్డంగా ఉందనిపించడంతో దాన్ని తప్పించబోతుండగా వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. సీటుబెల్టు పెట్టుకోకపోవడం..వాహనం పల్టీలు కొట్టడంతో హరికృష్ణ బయట ఎగిరిపడ్డారు. అంతా క్షణాల వ్యవధిలో జరిగిపోయింది.

మలుపు వల్లే…

మలుపులో బ్రేకులు వేయడంతో కారు ఎడమవైపునకు లాగింది. హరికృష్ణ స్టీరింగును వెంటనే కుడి వైపునకు తిప్పారు. వెనువెంటనే అదుపుతప్పి కారు బోల్తా పడింది. 1991 నుంచి ఆయన నాకు పరిచయం. శుభాకార్యాలు, షూటింగులు, విహారయాత్రలకు వెళ్లినపుడు హరికృష్ణ కారులోనే తీసుకెళతారు. అలా ఇద్దరం ఇప్పటివరకూ లక్షల కిలోమీటర్లు ప్రయాణించాం. ఏనాడూ చిన్న ప్రమాదం జరగలేదు. మంచి స్నేహితుడిని కోల్పోయా.


ఆ సమయంలో కారులో ప్రయాణిస్తున్న మిగతా ఇద్దరూ సీటు బెల్టు ధరించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారని వెల్లడించారు. సీటు బెల్టు ధరించని కారణంగా అత్యవసర సమయంలో తెరుచుకునే బెలూన్లూ తెరుచుకోలేదని, అవి తెరుచుకొని ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని పేర్కొన్నారు. ప్రమాద సమాచారం తెలియగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌ అమరావతి నుంచి వాయుమార్గంలో 12వ బెటాలియన్‌కు చేరుకున్నారు. అక్కణ్నుంచి రోడ్డు మార్గంలో తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి 11.07 గంటలకు కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. అంతకుమునుపే హరికృష్ణ సోదరి పురందేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సోదరుడు బాలకృష్ణ తదితరులు ఆసుపత్రికి చేరుకున్నారు. హరికృష్ణ భౌతికకాయాన్ని చూసి శోకసంద్రులయ్యారు. అనంతరం మరణోత్తర పరీక్ష నిర్వహించి పార్థివదేహాన్ని రహదారి మార్గంలో హైదరాబాద్‌కు తరలించారు. ఆ కాన్వాయ్‌ వెంటే చంద్రబాబు, లోకేశ్‌, జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ హైదరాబాద్‌ వెళ్లారు.


రాళ్లపై పడటంతో హరికృష్ణ తలకు తీవ్ర గాయమై మెదడు చిట్లినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శరీరంపై వివిధ చోట్ల గాయాలు కావడం వల్లే ఆయన మృతిచెందినట్లు వైద్యుల నివేదికా స్పష్టం చేస్తోంది. నల్గొండకు చెందిన ఇద్దరు వైద్యుల బృందం హరికృష్ణ మృతదేహానికి మరణోత్తర పరీక్ష నిర్వహించింది.


హరికృష్ణ మరణ వార్త తెలియగానే ఆయన అభిమానులు, బంధువులు నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి పోటెత్తారు. ఉదయం నుంచి అక్కడ అభిమానుల తాకిడి పెరగడంతో పోలీసులు అప్రమత్తమై బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఏపీ సీఎం సహా వివిధ రంగాల ప్రముఖులు ఇక్కడికి రావడంతో నల్గొండ ఎస్పీ రంగనాథ్‌ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు.

గంటసేపు చంద్రబాబు ఆసుపత్రిలోనే..
హరికృష్ణ భౌతికకాయానికి నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రిలో శవపరీక్షలు పూర్తయ్యే వరకు సీఎం చంద్రబాబు అక్కడేఉన్నారు. తొలుత హరికృష్ణ భౌతికకాయాన్ని ఆయన సందర్శించాకనే నల్గొండ నుంచి వచ్చిన వైద్యబృందం శవపరీక్ష నిర్వహించింది.

చెన్నై పర్యటన రద్దు.. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం వెళ్లాల్సిన చెన్నై పర్యటనను రద్దు చేసుకున్నారు. దివంగత డీఎంకే అధినేత కరుణానిధి సంతాప సభలో పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉండగా.. హరికృష్ణ అంత్యక్రియలు ఉండడంతో తన పర్యటనను రద్దు చేసుకున్నారు. కరుణానిధి సంతాప సభకు సీఎం చంద్రబాబు తరపున ఎంపీలు అశోక్‌గజపతిరాజు, సీఎం రమేష్‌, సుజనా చౌదరి వెళ్లనున్నారు.


నెత్తుటి మడుగులో పడిఉన్నారు
– జి.ఉపేందర్‌బాబు, ప్రత్యక్షసాక్షి, 12వ పటాలం కానిస్టేబుల్‌
ఉదయం ఆరు గంటల సమయంలో స్నేహితుడు రంజిత్‌తో కలిసి ద్విచక్రవాహనంలో పటాలంలో విధులకు వెళ్తున్నా. అప్పుడే ప్రమాదం జరిగింది. ముందుగా వాహనంలో ఉన్న ఇద్దర్నీ బయటకు తీశాం. వాళ్లను ఆరా తీయగా..వాహనం నడిపింది ఎన్‌టీఆర్‌ కుమారుడు హరికృష్ణ అని తెలిపారు. తర్వాత ఆయన కోసం పరికించాం. 15 అడుగుల దూరంలో కల్వర్టులో హరికృష్ణ నెత్తుటి మడుగులో పడి ఉండటాన్ని గుర్తించి రోడ్డుపైకి తీసుకొచ్చాం. మరో మిత్రుడు సైదులు పటాలం అత్యవసర వాహనాన్ని తీసుకొచ్చారు. కమాండెంట్‌ కృష్ణకుమార్‌ ఘటనా స్థలానికి వచ్చారు. వారితో కలిసి క్షతగాత్రులను కామినేని ఆసుపత్రికి తరలించాం.

10 నిమిషాల సేపు బతికే ఉన్నారు
– కె.సైదులు, హరికృష్ణను ఆసుపత్రికి తీసుకువచ్చిన వాహన డ్రైవర్‌
ప్రమాదం జరిగిందని తెలియగానే అంబులెన్స్‌లో హరికృష్ణను కామినేని ఆసుపత్రికి తీసుకొచ్చా. 5 నుంచి 10 నిముషాలపాటు ఆయన బతికే ఉన్నారు. ఆయన సినీ నటుడు హరికృష్ణ అని ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాతే తెలిసింది.
అప్రమత్తతతో మాకు ప్రాణాప్రాయం తప్పింది
– శివ, ఎదురుగా వస్తూ ప్రమాదానికి గురైన కారు డ్రైవర్‌

మేం చెన్నై నుంచి హైదరాబాద్‌ వస్తున్నాం. అకస్మాత్తుగా ఎదురుగా డివైడర్‌ను దాటి మా వైపు వాహనం వస్తుందని ముందే గ్రహించి మా వాహనాన్ని రహదారి చివరకు పోనిచ్చా. అయినా చాలా వేగంతో వచ్చిన ఎదుటి వాహనం మా కారు చివరి భాగాన్ని ఢీ కొట్టింది. మేం ముళ్లపొదల్లో పడిపోయాం. మేం అయిదుగురు వస్తుండగా… ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వాళ్లం స్వల్పగాయాలతో బయటపడ్డాం. వాహనం మావైపు వస్తుందని ముందే గ్రహించడం వల్లే బతికి బయటపడ్డాం. లేదంటే మా కారుపై ఆ వాహనం పడిపోయేది.

నెల్లూరుకు ఎందుకు వస్తున్నారంటే
నెల్లూరు: నందమూరి హరికృష్ణ గురువారం ఉదయం నెల్లూరు నగరంలోని ఇస్కాన్‌ సిటీలో ఒక అపార్టుమెంట్‌ శంకుస్థాపనకు హాజరుకావాల్సి ఉంది. హరికృష్ణకు స్నేహితుడు కావటం.. సెంటిమెంట్‌గా అతని చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తే శుభంగా ఉంటుందని అపార్టుమెంట్‌ నిర్వాహకుని నమ్మకం. గత ఏడాది గూడూరులో ఒక అపార్టుమెంటు శంకుస్థాపన హరికృష్ణ చేతుల మీదుగా నిర్వహించారు. ఇదే విశ్వాసంతో గురువారంనాటి శంకుస్థాపన కార్యక్రమానికి కూడా ఆయనను ఆహ్వానించారు. అందుకు అనుగుణంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి రేణిగుంట వరకు విమానంలో ప్రయాణించటానికి టిక్కెట్లు పంపారు. వాస్తవానికి బుధవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి బయలుదేరాల్సి ఉంది. మంగళవారం రాత్రి హరికృష్ణ ఫోన్‌ చేసి ‘బుధవారం ఉదయం రోడ్డు మార్గంలో నెల్లూరుకు వస్తున్నట్లు, మార్గమధ్యలో కావలిలో వివాహానికి హాజరు కావాల్సి ఉంది’ అని చెప్పినట్లు సమాచారం. సినీ పరిశ్రమతో అనుబంధం ఉన్న ఒకరి కుమారుడు వివాహం కావలిలో బుధవారం ఉదయం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *