సుపరిపాలన అందిస్తాం: గవర్నర్‌

అమరావతి: రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఆంధ్రప్రదేశ్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, హామీల అమలు గురించి తన ప్రసంగంలో వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు శాసనసభ్యులు, మండలి సభ్యులు హాజరయ్యారు. గవర్నర్‌ ప్రసంగం ముగిసిన తర్వాత శాసనసభ సోమవారానికి వాయిదాపడింది.

గవర్నర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

⇒ మా ప్రభుత్వం సేవ చేసేందుకు కట్టుబడి ఉంది. నూతన విధానాలు ప్రవేశపెట్టి సుపరిపాలన అందిస్తాం.
⇒ విభజనచట్టంలో పేర్కొన్న అంశాలన్నీ నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి చేస్తాం.
⇒ అవినీతి రహిత పాలన ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాం. దీనిలో భాగంగా రాష్ట్రంలోకి సీబీఐకి అనుమతి ఇచ్చాం.
⇒ ప్రజాధనం వృథా కాకుండా అనేక చర్యలు తీసుకుంటాం. ప్రాజెక్టుల్లో పారదర్శకత కోసం రివర్స్‌ టెండరింగ్‌ చేపడతాం.
⇒ నవరత్నాల అమలు కోసం మా ప్రభుత్వం కృషి చేస్తుంది. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకుంటాం.
⇒ రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయి. విభజన సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తాం. వందశాతం పారదర్శకత దిశగా సీఎంవో పనిచేస్తుంది.

⇒ అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహవసతి కల్పిస్తాం. నాలుగేళ్లలో 25లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

⇒ ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌ను ఏటా జనవరిలో ప్రకటిస్తాం. యువతకు పలు రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగాల్లో యువతకు శిక్షణ ఇస్తాం.

⇒ పాడి రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం. రైతులు, వ్యవసాయ కూలీల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటాం. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.12,500 అందిస్తాం. సహకార రంగాన్ని బలోపేతం చేస్తాం.

⇒ సహకార డెయిరీలకు పాలుపోసే రైతులకు లీటరుకు రూ.4 ప్రోత్సాహకం

⇒ పోలవరం, వెలిగొండ ప్రాజెక్టును నిర్ణీత సమయంలోగా పూర్తి చేస్తాం.

⇒ అమ్మఒడి పథకం కింద మహిళలకు ఏటా రూ.15,000 ఆర్థికసాయం చేస్తాం. మద్యం బెల్టుషాపులను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

⇒ బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తాం.

⇒ 108 వాహనాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం.

⇒ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా బోర్లు వేయిస్తాం. బోర్లు వేసేందుకు నియోజకవర్గానికి ఒక రిగ్‌ కేటాయిస్తాం.

⇒ రైతులకు పగటిపూట 9గంటలపాటు ఉచిత విద్యుత్‌. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం.

⇒ రూ.2వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయనిధి ఏర్పాటు చేస్తాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *