రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్‌ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే….

దిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్డీయే ప్రభుత్వానికి మరో విజయం దక్కింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికలో అధికార పక్షాల అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ 20ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గురువారం జరిగిన ఈ ఎన్నికలో హరివంశ్‌కు 125 ఓట్లు రాగా.. ప్రతిపక్షాల అభ్యర్థి, కాంగ్రెస్‌ నేత హరిప్రసాద్‌కు 105ఓట్లు దక్కాయి. దీంతో కొత్త డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్‌ నారాయణ్‌ పేరును రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రకటించారు.

రాజ్యసభలో ప్రస్తుతం 244 మంది సభ్యులున్నారు. అయితే నేటి ఎన్నికకు ఆమ్‌ ఆద్మీ పార్టీ, వైకాపా సహా 14 మంది సభ్యులు దూరంగా ఉన్నారు. దీంతో సంఖ్యాబలం 230కి తగ్గింది. ఇందులో 125 మంది సభ్యుల మద్దతుతో ఎన్డీయే అభ్యర్థి విజయం సాధించారు.

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్షాల కూటమి బలాన్ని నిరూపించుకునేందుకు ఈ ఎన్నిక కీలకంగా మారింది. ఎన్డీయే అభ్యర్థిని ఓడించేందుకు కాంగ్రెస్‌, తృణమూల్‌ సహా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. తొలుత తృణమూల్‌ లేదా ఎస్పీ అభ్యర్థిని నిలబెట్టాలని ప్రతిపక్షాల కూటమి భావించినప్పటికీ.. చివరి నిమిషంలో ఆ బాధ్యతను కాంగ్రెస్‌కు అప్పగించాయి. దీంతో సీనియర్‌ నేత హరిప్రసాద్‌ను ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్‌ బరిలోకి దించింది.

మరోవైపు భాజపా సొంత పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా.. జేడీయూ నేత హరివంశ్‌ నారాయణ్‌కు మద్దతిచ్చింది. అంతేగాక.. ఎన్డీయే మిత్రపక్షాలు కూడా హరివంశ్‌కు మద్దతిచ్చేలా ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. కాగా.. జేడీయూ అభ్యర్థి నిర్ణయంపై తొలుత శివసేన అభ్యంతరం వ్యక్తం చేసినా ఆ తర్వాత హరివంశ్‌కు మద్దతిస్తామని ప్రకటించింది. రాజ్యసభలో ఎన్డీయేకు అవసరమైన మెజార్టీ ఉన్నందున హరివంశ్‌ ఈ ఎన్నికల్లో సులువుగానే విజయం సాధించారు.

జేడీయూకు చెందిన హరివంశ్‌ తొలిసారిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్‌కు అత్యంత సన్నిహితులు.

ప్రధాని శుభాకాంక్షలు

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. హరివంశ్‌ మంచి విద్యావంతుడని.. ఆయనపై పూర్తి నమ్మకం ఉందన్నారు. సభను హుందాగా నడిపించగలరని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *