విరాట్‌ది దిగ్గజ స్థాయే నాయకుడంటే అలా ఆడాలి….

విరాట్‌ కోహ్లి క్రికెటర్‌గా ఇప్పటికే దిగ్గజ స్థాయిని అందుకున్నాడని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని అన్నాడు. కోహ్లి ఇప్పటికే ఆటగాడిగా ఎంతో సాధించాడని, ఒక కెప్టెన్‌ నుంచి జట్టు ఎలాంటి ప్రదర్శన ఆశిస్తుందో.. కోహ్లి అలాగే ఆడతాడని ధోని కితాబిచ్చాడు. ముంబయిలో మంగళవారం జరిగిన ఒక ప్రచార కార్యక్రమంలో భాగంగా ధోని మాట్లాడుతూ.. ‘‘అతను అత్యుత్తమ ఆటగాడు. దిగ్గజ ఆటగాడు కావడానికి చాలా దగ్గరగా ఉన్నాడు. ఇప్పటికే ఆ స్థాయిని అందుకున్నాడు. అతడి విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నా. గత కొన్నేళ్లలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అతను బ్యాటింగ్‌ చేసిన తీరు అమోఘం. విరాట్‌ జట్టును ఎప్పుడూ ముందుండి నడిపిస్తాడు. ఒక కెప్టెన్‌ నుంచి ఆశించేది అదే. అతడికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’’ అని చెప్పాడు. మరోవైపు తన రిటైర్మెంట్‌ గురించి వస్తున్న ఊహాగానాలకు ధోని తెరదించాడు.

ఇటీవల ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా మ్యాచ్‌ అనంతరం అంపైర్‌ నుంచి ధోని బంతి తీసుకోవడంతో అతడి రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాను బంతి తీసుకోవడానికి అసలు కారణమేంటో ధోని వివరించాడు. ‘‘మా బౌలర్లు బంతిని ఆశించిన స్థాయిలో స్వింగ్‌ చేయలేకపోయారు. వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లోనే ప్రపంచకప్‌ జరగబోతోంది. కాబట్టి మేం రివర్స్‌ స్వింగ్‌ రాబట్టడం చాలా అవసరం. ప్రత్యర్థి జట్టు ఈ విషయంలో విజయవంతమవుతున్నపుడు మేం కూడా అది చేయాలి. మ్యాచ్‌ ముగిశాక ఐసీసీకి ఆ బంతితో ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే అంపైర్‌ను అడిగి మా బౌలింగ్‌ కోచ్‌ కోసం బంతిని తీసుకున్నా’’ అని ధోని తెలిపాడు. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో పరాజయం పాలైన భారత్‌..

సిరీస్‌ గెలవగలదా అని ధోనిని అడిగితే.. ‘‘ఒక టెస్టు మ్యాచ్‌ గెలవాలంటే 20 వికెట్లు తీయడం చాలా కీలకం. భారత బౌలర్లు అది చేయగలిగారు. ఇదే నా జవాబు. బ్యాటింగ్‌ ఎంత బాగా చేసినా 20 వికెట్లు తీస్తేనే గెలవగలం’’ అన్నాడు. తన కూతురు జివా రాకతో తన జీవితంలో చాలా ప్రశాంతత వచ్చిందని చెప్పాడు. ‘‘నాకు నచ్చినా నచ్చకపోయినా జివాకు బయట చాలా ప్రచారం వస్తోంది. నేనెక్కడికి వెళ్లినా తన గురించి అడుగుతున్నారు. మనకు ఉత్సాహాన్నిచ్చే, ఒత్తిడినంతా దూరం చేసే అలాంటి వ్యక్తి ఒకరు జీవితంలో ఉండటం చాలా బాగుంటుంది. తన వయసు మూడున్నరేళ్లే. కానీ ఇప్పటికే తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. తన మాట తీరే ఒక రకంగా ఉంటుంది. ఇంట్లో కూతురుండటం బాగుంటుంది’’ అన్నాడు.
17
ఇంగ్లాండ్‌తో రెండో టెస్టుకు ఆతిథ్యమివ్వబోతున్న లార్డ్స్‌ మైదానంలో భారత్‌ ఆడిన టెస్టు మ్యాచ్‌లు. రెండుసార్లు నెగ్గిన భారత్‌.. 11 సార్లు పరాజయం చవిచూసింది. 4 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *